Abn logo
Sep 6 2020 @ 03:49AM

వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం

Kaakateeya

సమస్యలపై అధికారులను నిలదీసిన సభ్యులు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వివిధ సమస్యలపై జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అధ్యక్షతన శనివారం జడ్పీ హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి కలెక్టర్‌ పౌసుమిబసు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహే్‌షరెడ్డి, నరేందర్‌రెడ్డి, యాదయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కందుల కొనుగోళ్లలో అక్రమాలు, యూరియా కొరత, నత్తనడకన కొనసాగుతున్న రోడ్ల పనులు, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై సభ్యులు అధికారులను నిలదీశారు.


కొడంగల్‌ కందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్‌, కొడంగల్‌ జడ్పీటీసీలు మహిపాల్‌, నాగరాణి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రైతులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకుంఠధామాల పనులు వేగంగా కొనసాగడం లేదని పీఆర్‌ఈఈ మనోహర్‌రావు వివరిస్తుండగా, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ జోక్యం చేసుకుని, ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ, వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 


రోడ్ల దుస్థితిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆగ్రహం

ఇదిలా ఉంటే, జిల్లాలోని రోడ్ల దుస్థితిపై జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహే్‌షరెడ్డి, ఆనంద్‌, నరేందర్‌రెడ్డిలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌-తాండూరు రోడ్లు చాలా అధ్వానంగా మారాయని, పనులు ఎందుకు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, మండలాల్లో ఎకరా వంతున స్థలం కేటాయిస్తే పీఏసీఎస్‌ భవనాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ దృష్టికి తీసుకవచ్చారు. జడ్పీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కలెక్టర్‌ను కోరారు. 


కరోనా అదుపులో జడ్పీ కీలక భూమిక

కరోనా మహమ్మారిని జిల్లాలో అదుపు చేయడానికి జడ్పీ ప్రారంభం నుంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వచ్చిందని, జడ్పీ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మాస్కులు కుట్టించామని, శానిటైజర్లు పంపిణీ చేశామని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. ఆగస్టులో కురిసిన వర్షాలకు వంతెనలు తెగి రాకపోకలు నిలిచిపోయాయని, ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల్లో కోవిడ్‌ పరీక్షలు పెంచాలన్నారు.


ఇదిలా ఉంటే, సమావేశానికి ముందు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటాన్ని పూలతో అలంకరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఉష, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీఈవో రేణుకాదేవి, డీఏవో గోపాల్‌, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement