Abn logo
Sep 18 2021 @ 23:55PM

ఎవరిదో జడ్పీ పీఠం!

 వైసీపీలో ఎవరికి వారుగా ప్రయత్నాలు

 సామాజిక సమీకరణలతో మల్లగుల్లాలు

 రేసులో ముగ్గురు మహిళలు

 పిరియా విజయకు అవకాశం?

(శ్రీకాకుళం -ఆంధ్రజ్యోతి)

ఓవైపు జడ్‌పీటీసీ...ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లాలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కీలకమైన జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని తమ కుటుంబ సభ్యులకు, అనుకూల వర్గాలకు దక్కించుకునేందుకు వైసీపీలోని ముఖ్య నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు నాయకులు ఇప్పటికే నేరుగా సీఎం వద్దకు వెళ్లి తమకే జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. వాస్తవానికి ఇవి దాదాపుగా కొన్నాళ్ల కిందటే ఖరారైపోయాయి. కానీ తుది ఫలితం కోసం వేచిచూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సామాజిక సమీకరణలతో ఎవరికి వారు తమకే పీఠం దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించడంతో వైసీపీకి కలిసొచ్చింది. అధికార పార్టీకే ఈ కుర్చీ సొంతమని దాదాపుగా తేలిపోయింది. దీంతో  ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచే చైర్‌పర్సన్‌ కుర్చీ లక్ష్యంగా వ్యూహాలు నడిచాయి. జడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో వైసీపీలో ప్రధానంగా ముగ్గురు మహిళా నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు స్వయంగా అత్తాకోడళ్లు. మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం సతీమణి ఇందుమతి రేగిడి నుంచి..ఆమె కోడలు, పాలవలస విక్రాంత్‌ సతీమణి గౌరీపార్వతి పాలకొండ నుంచి జడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరిద్దరినీ జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం కోసమే వ్యూహాత్మకంగా పోటీలో నిలిపినట్టు తెలుస్తోంది. వీరితో పాటు కవిటి నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన పిరియా విజయ కూడా జడ్పీ సీటు కోసం పోటీ పడుతున్నారు.


 ఆ రెండు నియోజకవర్గాలపై వైసీపీ దృష్టి...

జిల్లాలో ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ప్రాంతాలకు చెందిన వారిలో ఒకరికి జడ్పీ చైర్‌పర్సన్‌ వంటి కీలక పదవిని  అప్పగిస్తే టీడీపీ ప్రభావం తగ్గించవచ్చనేది పార్టీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ సతీమణి పిరియా విజయను జడ్పీ ఛైర్‌పర్సన్‌గా చేయాలనేది పార్టీ ముఖ్య నేతల ఉద్దేశంగా చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో కూడా వైసీపీ ఓటమి చవిచూసింది. ఆ నియోజకవర్గంలో సీనియర్‌ నేత దువ్వాడ శ్రీనివాస్‌కు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తొలుత ఆయన సతీమణి దువ్వాడ వాణికి జడ్పీ పీఠం ఇస్తారనే ప్రచారం సాగింది. శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో పార్టీ అధిష్టానం నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో భాగంగా జడ్పీ పీఠం ఒక ప్రధాన సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందని పార్టీ ముఖ్య నేతలు భావించారు. ఇందులో భాగంగానే ఆ సామాజిక వర్గానికి చెందిన గౌరీపార్వతిని పాలకొండ... ఇందుమతిని రేగిడి నుంచి జడ్పీటీసీలుగా పోటీలోకి దింపారు. మారిన సమీకరణల నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ముఖ్య నేత సీఎం జగన్‌ను కలిసి తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అదే జరిగితే గౌరీ పార్వతి, ఇందుమతి ఇద్దరూ జడ్పీ ఛైర్‌పర్సన్‌ రేసులో లేనట్లేనని పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌కు సీఎం జగన్‌ వద్ద మంచి పేరు ఉంది. ఆయన సతీమణి పిరియా విజయ కవిటి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయను జడ్పీ ఛైర్‌పర్సన్‌గా చేసేందుకు జిల్లా ముఖ్య నేతలంతా ఒక  నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, విశాఖ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో మహిళా కోటాలో మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు జడ్పీటీసీ అభ్యర్థులు జడ్పీ పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.