Abn logo
Sep 23 2021 @ 00:39AM

జీ - సోనీ విలీనం

  • విలీన సంస్థలోకి సోనీ రూ.11,655 కోట్ల పెట్టుబడులు 
  • ‘సోనీ’కి 52.93ు, ‘జీ’ చేతికి 47.07 శాతం వాటా
  • అతిపెద్ద వినోద నెట్‌వర్క్‌గా అవతరణ  


న్యూఢిల్లీ: భారత వినోద రంగంలో భారీ డీల్‌ కుదిరింది. దేశంలో అతిపెద్ద లిస్టెడ్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌(జెడ్‌ఈఈఎల్‌).. సోనీ పిక్చర్‌ నెట్‌వర్క్‌ ఇండియాలో విలీనం కానుంది. ఒప్పందంలో భాగం గా సోనీ 157.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.11,655 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా విలీన సంస్థలో సోనీకి 52.93 శాతం వాటా లభించనుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం వాటా ఉంటుంది.


జీఈఈఎల్‌ ప్రస్తుత ఎండీ, సీఈఓ పునీత్‌ గోయెంకా విలీన సంస్థకు సారథ్యం వహించనున్నారు. కంపెనీ బోర్డులో మెజారిటీ సభ్యులను సోనీ నియమించనుంది. తమ నెట్‌వర్క్‌లు, డిజిటల్‌ ఆస్తులు, వినోద కార్యక్రమాల ప్రొడక్షన్‌ కార్యకలాపాలు, ప్రోగ్రామ్‌ లైబ్రరీలను ఏకం చేసేందుకు సోనీతో నాన్‌-బైండింగ్‌  ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు జెడ్‌ఈఈఎల్‌ సమాచారం అం దించింది.


కొత్త కంపెనీ 70కి పైగా టీవీ చానెళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్‌ సేవల వేదికలు (జీ5, సోనీ లివ్‌), రెండు ఫిల్మ్‌ స్టూడియోల ు(జీ స్టూడియో, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా) కలిగి ఉండనుంది. తద్వారా దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా అవతరించనుంది. తమ ప్రధాన ప్రత్యర్థులైన స్టార్‌, డిస్నీ నెట్‌వర్క్‌ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు జీ, సోనీకి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడనుందని మీడియా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. 


తుది ఒప్పందానికి 90 రోజులు.. 

విలీనంపై సాధ్యాసాధ్యాలను చర్చించడంతోపాటు వాటాదారులు, తదితరుల అనుమతులతో తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు వర్గాలు 90 రోజుల గడువు నిర్దేశించుకున్నాయి. 


‘జీ’లో హైడ్రామాకు తెర!

కొద్ది రోజుల క్రితం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంపెనీ చీఫ్‌ పునీత్‌ గోయెంకాతోపాటు మరో ఇద్దరు బోర్డు సభ్యులు పదవి నుంచి తప్పుకోవాలని కంపెనీ మైనారిటీ వాటాదారులైన ఇన్వెస్కో డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌, ఓఎ్‌ఫఐ గ్లోబల్‌ చైనా ఫండ్‌ ఎల్‌ఎల్‌సీ డిమాండ్‌ చేశాయి. ఇందుకోసం వాటాదారుల ఈజీఎం ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ రెండు ఫండ్లు జెడ్‌ఈఈఎల్‌లో మొత్తం 17.9 శాతం వాటా కలిగి ఉన్నాయి.


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర గోయెంకా కుటుంబ సభ్యు ల ఆధిపత్యానికి చెక్‌ పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్లు ఈ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఫండ్ల ఒత్తిడికి అడ్డుకట్ట వేయడంతోపాటు కంపెనీపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు జీ ప్రమోటర్‌ కుటుంబం సోనీతో డీల్‌ కుదుర్చుకున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, డీల్‌ నిబంధనల ప్రకారం గోయెంకా కుటుంబానికి ఉన్న 4 శాతం వాటాను భవిష్యత్‌లో 20 శాతం వరకు పెంచుకునే వీలుంటుంది. జపాన్‌కు చెందిన సోనీ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఎస్‌పీఎన్‌ఐకి భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.జీ షేర్లు జిగేల్‌ 

విలీన వార్తల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు దూసుకెళ్లాయి. బీఎ్‌సఈలో షేరు ఒక దశలో  39 శాతం వరకు ఎగబాకి రూ.355.40 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. చివరికి 31.86 శాతం లాభంతో రూ.337.10 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.7,823.98 కోట్లు పెరిగి రూ.32,378.98 కోట్లకు చేరుకుంది. గ్రూప్‌లోని ఇతర ‘షేర్లు జీ లెర్న్‌ 14.30 శాతం, జీ మీడియా కార్పొరేషన్‌ 4.92 శాతం లాభపడ్డాయి.ఝున్‌ఝున్‌వాలాకు కాసుల పంట 

బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు జీ షేర్లు కాసుల పంట పండించాయి. ఆయన యాజమాన్యంలోని రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈనెల 14న 50 లక్షల జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లను ఒక్కొక్కటీ రూ.220.44 చొప్పున మొత్తం రూ.110 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు.. సోనీతో డీల్‌ నేపథ్యంలో అమాంతం ఎగబాకింది. దాంతో ఈ కంపెనీలో బిగ్‌బుల్‌ పెట్టుబడుల విలువ వారం రోజుల్లోనే రూ.168.55 కోట్లకు (50 శాతానికి పైగా) పెరిగింది.