Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మహాపాదయాత్ర’లో అమరావతి రైతులను కలిసిన YSRCP MLA.. హాట్ టాపిక్

నెల్లూరు : అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతోంది. ఇప్పటివరకూ తెలుగుదేశంతో పాటు పలు పార్టీల నాయకులు మద్దతు పలికారు. అంతేకాదు ప్రజా సంఘాలు సైతం మహాపాదయాత్రలో పాల్గొని మద్దతిచ్చాయి. అయితే.. మహాపాదయాత్ర శిబిరం వద్ద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు.. ఆ ఎమ్మెల్యే రైతులకు మద్దతు కూడా ఇచ్చారని తెలియవచ్చింది. శిబిరం వద్ద రైతులను కలిసిన ఆయన.. కాసేపు మాటామంతి జరిపారు. రెండు రోజుల పాటు ఈ నియోజకవర్గంలోనే యాత్ర కొనసాగుతుందని రైతులు కోటంరెడ్డికి చెప్పగా.. ఏ ఇబ్బంది వచ్చినా తనని సంప్రదించాలని ఎమ్మెల్యే చెప్పారు. ‘జై అమరావతి’ అనాలని ఎమ్మెల్యేను రైతులు కోరగా తిరస్కరించినట్లు తెలిసింది. మరోవైపు మహిళా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. ఒకరు తన మెడలోని కండువా తీసి ఆయన మెడలో వేయడానికి ప్రయత్నించగా తిరస్కరించారు. కాగా.. రైతులను ఎమ్మెల్యే కలవడంతో ఈ వ్యవహారం జిల్లాలోనే కాకుండా .. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఒకరిద్దరు వైసీపీ పెద్దలు కోటంరెడ్డికి ఫోన్ కూడా చేసినట్లు సమాచారం.

అదే కాన్సెప్ట్..!

అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. వరద బాధితుల పరామర్శ పర్యటన మధ్యలో రాజధాని రైతులని కలిసిన మాట వాస్తవమేనన్నారు. వర్షాల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయమని అందరికీ ఫోన్ నంబర్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళా రైతులు అమరావతికి మద్దతివ్వమని కోరారని.. అయితే పార్టీ ఏ స్టాండ్‌లో వెళితే.. అదే తన స్టాండ్ అని వారికి చెప్పానన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో వరదలు, వర్షాల వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదనేది తన కాన్సెప్ట్ అని.. అదే మానవత్వం, సంస్కారమని కోటంరెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు రూరల్‌లోని ముంపు ప్రాంతాల్లో కోటంరెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇలా పర్యటనలో భాగంగా అమరావతి రైతుల శిబిరం వద్దకు వెళ్లారు.


Advertisement
Advertisement