Abn logo
May 4 2021 @ 00:28AM

తాళ్లతో కట్టి.. పెట్రోలు పోసి నిప్పంటించి..!

యువకుడిని సజీవ దహనంచేసే యత్నం

కాలుతున్న శరీరంతో పరుగు  

గ్రామంలోకి వచ్చి పడిపోయిన వైనం

పరిస్థితి ఆందోళనకరం

ప్రేమ వ్యవహారమే కారణమని  అనుమానం 


ఒంగోలు: బేల్దారి మేస్ర్తి పిలుస్తున్నాడని ఓ యువకుడిని మరో యువకుడు నమ్మకంగా ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అనంతరం మరో వ్యక్తితో కలిసి అతడిని తాళ్లతో కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కాలుతున్న శరీరంతోనే ఆ యువకుడు పరుగు తీసి గ్రామంలోకి వచ్చి పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో ఆదివారం రాత్రి జరిగింది. అందిన సమాచారం మేరకు.. నేలటూరుకు చెందిన యరజాన అంకమ్మరావు (23) బేల్దారి పనులతోపాటు, వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం అతను మిర్చి కోతలకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో ఓ యువకుడు అతని వద్దకు వచ్చి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికి అంకమ్మరావు మంటల్లో కాలుతూనే పరుగు పెడుతూ గ్రామంలోని చర్చి వద్దకు వచ్చి పడిపోయాడు.


స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. గ్రామానికి చెందిన ఒక బాలిక విషయంలో తలెత్తిన గొడవలే తనపై హత్యాయత్నానికి కారణమని బాధితుడు న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చాడు. తన ఇంటికి ఒక యువకుడు వచ్చి బేల్దారి మేస్త్రి పిలుస్తున్నాడని మోటారు సైకిల్‌పై ఎక్కించుకొని చెరువు సమీపంలోకి తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడ మధు అనే యువకుడితో కలిసి తనను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారని న్యాయమూర్తికి వివరించారు. అంకమ్మరావు పరిస్థితి విషమంగా ఉంది. అతని శరీరం  సగానికి పైగా కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఒంగోలు రూరల్‌ సీఐ సుబ్బారావు తెలిపారు. 


పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు 

అంకమ్మరావు కొంతకాలంగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన బాలిక వెంటపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలిక బంధువులు ఎవరైనా అతన్ని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు అనుమాని తులను అదుపులోకి తీసుకుని విచా రిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకమ్మరావు


Advertisement
Advertisement
Advertisement