Abn logo
Jun 13 2021 @ 03:16AM

ఉన్నత విద్యకు యువతులు దూరమే!

సర్టిఫికెట్‌ కోర్సులకే పరిమితమైన అమ్మాయిలు

ఉన్నతస్థాయి కోర్సుల్లో యువకులదే పైచేయి

యూజీ, పీజీ ఉత్తీర్ణతలో యువతుల హవా

అఖిల భారత ఉన్నత విద్యా సర్వేలో వెల్లడి


అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా బాలికా విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. ఒక దశ వరకే ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఉన్నత విద్య విషయానికి వచ్చేసరికి.. మాత్రం యువకుల సంఖ్యే అధికంగా ఉంటోంది. వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో.. పీహెచ్‌డీ నుంచి ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల వరకు ఎన్‌రోల్‌మెంట్‌ పరంగా చూస్తే.. యువకులే ముందంజలో ఉన్నారు. అయితే, సర్టిఫికెట్‌ కోర్సుల విషయంలో యువతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘అఖిల భారత ఉన్నత విద్యా సర్వే-2019-20’ స్పష్టం చేసింది. ఇక, ఏపీ విషయానికి వస్తే పీహెచ్‌డీ, ఎంఫిల్‌, పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో 2019-20 విద్యా సంవత్సరంలో చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య 18,97,149. వీరిలో యువకులు 10,21,126 మంది కాగా, 8,76,023 మంది యువతులు ఉన్నారు. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఇక, సర్టిఫికెట్‌ కోర్సుల విషయానికి వస్తే.. 2015-20 మధ్య ఈ కోర్సులు చేసిన వారిలో యువతులే అధికంగా ఉన్నారు. 


పెరుగుతున్న కాలేజీలు

జనాభా అవసరాల మేరకు కాలేజీల సంఖ్య ఏపీలో పెరుగుతున్నట్టు సర్వే వెల్లడించింది. 2015-19 విద్యా సంవత్సరంలో ప్రతి లక్ష జనాభాకు 45 కాలేజీలు ఉంటే.. 2019-20నాటికి వాటి సంఖ్య 51కి పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే సగటున ప్రతి లక్ష జనాభాకు 30 కాలేజీలు మాత్రమే ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 2015-16లో 2,532 కాలేజీలు ఉండగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేటు కాలేజీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. 


చేరేవారు తక్కువే

దేశవ్యాప్తంగా ప్రతి కాలేజీలో సగటున 680 మంది ఎన్‌రోల్‌ అవుతుండగా, ఏపీలో 547 మంది మాత్రమే ఎన్‌రోల్‌ అవుతున్నారు. ఉన్నత విద్యలో ఉత్తీర్ణతలను చూస్తే.. మొత్తం మీద యువతులే అధికసంఖ్యలో ఉన్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో అన్ని కోర్సులు కలిపి 4,21,868 మంది ఉత్తీర్ణులు కాగా, వీరిలో యువతులు 2,15,368 మంది కాగా, యువకులు 2,06,500 మంది ఉన్నారు. పీజీ, యూజీ, సర్టిఫికెట్‌ కోర్సుల్లో అమ్మాయిల ఉత్తీర్ణత ఎక్కువగా నమోదైంది. పీహెచ్‌డీ, ఎంఫిల్‌, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో మాత్రం యువకుల ఉత్తీర్ణత అధికంగా ఉండడం గమనార్హం.