Aug 16 2021 @ 23:16PM

‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ వర్సెస్ ‘కింగ్’ నాగార్జున

ఇప్పటి వరకు హీరోలు.. వారి సినిమాల విషయంలో పోటీ పడటం చూసుంటారు. ఇకపై స్మాల్ స్క్రీన్‌పై ‘హోస్ట్’ విషయంలోనూ హీరోల మధ్య తీవ్రపోటీ ఉండబోతుందనేది.. త్వరలో ప్రసారం కాబోయే ‘బిగ్‌బాస్’, ‘ ఎవరు మీలో కోటీశ్వరులు’ నిరూపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ రెండు కార్యక్రమాలపై ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా హోస్ట్‌ల విషయంలోనే ఆ చర్చలు ఉండటం అనేది ఇక్కడ విశేషం. ఇప్పుడీ రెండు షోల విషయంలో ఒక షో (ఎవరు మీలో కోటీశ్వరులు) టెలికాస్ట్ విషయంపై క్లారిటీ రాగా, మరో షో(బిగ్‌బాస్)‌కి సంబంధించి కాస్త వెనకడుగు పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం టెలికాస్ట్ కాబోతోన్న షోనే కావడం గమనార్హం. ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5’ని ఈ మంత్ ఎండింగ్‌కి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తే.. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఆగస్ట్ 22 నుంచి అంటూ షో టెలికాస్ట్ వివరాలను కూడా వదిలేశారు. దీంతో రేటింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని.. ‘బిగ్‌బాస్’ టీమ్ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ టైమింగ్, రేటింగ్ వంటి విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చాక ‘బిగ్‌బాస్ సీజన్ 5’ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఆ షో నిర్వాహకులు ఉన్నట్లుగా టాక్. 

రెండూ ‘స్టార్ మా’ ప్రోగ్రామ్‌లే.. కానీ?

తెలుగు బుల్లితెరకు సంబంధించి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్’.. ఈ రెండు షోలకు ఆద్యం పోసింది ‘స్టార్ మా’నే. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రస్తుతం నెంబర్ వన్ ఛానల్‌గా ‘స్టార్ మా’ దూసుకుపోతోంది. ఈ రికార్డు కోసం ఇతర ఛానళ్లు కూడా గట్టిపోటీనే ఇస్తున్నాయి. ఈ పరంగా చూస్తే జెమిని ఛానల్ కొన్నాళ్లుగా సరిగా పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. అయితే స్టార్ మాకి చెందిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్‌ని కాస్త ఛేంజ్ చేసి ఇప్పుడు జెమిని ఛానల్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను టెలికాస్ట్ చేయబోతుంది. ఈ కార్యక్రమంతో జెమిని తన సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని హోస్ట్‌గా ఎన్నుకుంది. వాస్తవానికి ఈ షో అనగానే గుర్తొచ్చే పేరు మాత్రం కింగ్ నాగార్జునే. అంతగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని నాగార్జున రక్తి కట్టించారు.

నాగార్జున వర్సెస్ ఎన్టీఆర్

ఇప్పుడీ రెండు కార్యక్రమాలతో నాగార్జున వర్సెస్ ఎన్టీఆర్ అనేలా బుల్లితెరపై వాతావరణం క్రియేట్ అవుతోంది. ఎందుకంటే కింగ్ నాగార్జున మొదలెట్టిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’నే కాస్త టైటిల్ మారి.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అయిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతుంటే.. యంగ్ టైగర్ స్టార్ట్ చేసిన ‘బిగ్‌బాస్’కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవి రెండూ ప్రస్తుతం 5వ సీజన్‌లో ఉండటం విశేషం. అంతకుముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తొలి మూడు సీజన్లను కింగ్ నాగార్జున హోస్ట్‌ చేయగా, నాల్గవ సీజన్‌ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఇప్పుడు యంగ్‌టైగర్ ఎంటరవుతున్నారు. ఇక బిగ్‌బాస్ విషయానికి వస్తే తొలి సీజన్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ దిగ్విజయంగా నడపగా.. రెండో సీజన్‌కు ‘నాని’.. మూడు, నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు 5వ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. అయితే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని నాగ్ ఆసక్తికరంగా నడిపితే.. ‘బిగ్‌బాస్’ అంటే తన పేరు మాత్రమే ఫస్ట్ చెప్పుకునేంతగా ఎన్టీఆర్ నడిపించారు. ఇప్పుడు జరగబోయే ఇద్దరి షోలు ఒకే టైమ్‌లో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో రేటింగ్ విషయంలో నువ్వా? నేనా? అనే ఉత్కంఠ ఈ హీరోలకు, వారి అభిమానులకు ఉంటుందనడంలో సందేహించాల్సిన అవసరమే లేదు. మరి ఈసారి ఎవరు టాప్ రేటింగ్స్ సాధిస్తారో చూడాల్సి ఉంది. 

వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా.. తనకు తిరుగులేదని ఆల్రెడీ నిరూపించుకున్న ఈ టైగర్‌ని ఎదుర్కొవాలంటే కింగ్ ఈసారి కాస్త ధీటైన అస్త్రాలనే వదలాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పాత్ర ఏదైనా నేను రెడీ అంటూ దూకుతున్న యంగ్ టైగర్ పవరేంటో చూసేందుకు కింగే ఓ అడుగు వెనక్కి వేస్తున్నాడు. టైగర్‌ని ఎదుర్కొనేందుకు ఎటువంటి వ్యూహంతో కింగ్ వస్తాడో వెయిట్ అండ్ సీ..