Abn logo
Sep 25 2021 @ 11:44AM

వైసీపీ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

                - సమావేశం హాలులోనే పురుగుల మందు తాగి..


సి.బెళగల్‌(కర్నూలు): సి.బెళగల్‌-1 వైసీపీ ఎంపీటీసీ ఈరన్నగౌడ్ శుక్రవారం పురుగుల మందు తాగారు. తాను ప్రతిపాదించిన వ్యక్తికి కో-ఆప్షన్‌ మెంబర్‌ పదవి ఇవ్వలేదన్న మనస్తాపంతో అధికారుల ఎదుటే ఈ ఘటనకు పాల్పడ్డారు. సి.బెళగల్‌ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీ 9, టీడీపీ 4 గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 3 కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ మెంబర్‌ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. కో ఆప్షన్‌ మెంబర్‌కు ముల్లా అరోన్‌ బాషా నామినేషన్‌ మాత్రమే దాఖలు చేయడంతో ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తుండగా ఎంపీటీసీ ఈరన్న గౌడు ఈ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టాలని కోరారు. ఇందుకు ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కో ఆప్షన్‌ మెంబర్‌ పదవికి తాను ప్రతిపాదించిన వారికి కాకుండా వేరొకరికి ఇచ్చారంటూ ఈరన్న గౌడు వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. కార్యాలయ సిబ్బంది వెంటనే పురుగుల మందు డబ్బాను లాక్కుని ఈరన్నగౌడును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీలో మొదటి నుంచి ఉండి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వలేదంటూ కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌పై ఈరన్నగౌడు కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు. ఈరన్నగౌడుకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేనే బాధ్యుడని కుటుంబ సభ్యులు మల్లికార్జున గౌడు, ప్రదీప్‌, రాజు, వెంకటేశ్వర్లు తెలిపారు. 


- వెల్దుర్తిలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియకు ఎల్‌.నగరం వైసీపీ ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ గైర్హాజరయ్యారు. తనకు ఎంపీపీ పదవి ఇవ్వకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 


- ఆత్మకూరు మండల పరిషత్‌ సమావేశ భవనంలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవానికి, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికకు వైసీపీకి చెందిన పిన్నాపురం ఎంపీటీసీ కుందూరు వెంకటేశ్వరమ్మ గైర్హాజరయ్యారు. ఎంపీపీ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో ఆ స్థానాన్ని ఈమెకు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే కరివేన ఎంపీటీసీ తిరుపాలమ్మను ఎంపీపీ పదవి వరించడంతో వెంకటేశ్వరమ్మ మనస్తాపానికి గురై ప్రమాణ స్వీకారానికి రానట్లు తెలుస్తోంది. 


- డోన్‌ వైస్‌ ఎంపీపీ పదవి ఇవ్వలేదని వైసీపీకి చెందిన ఓబులాపురం ఎంపీటీసీ సుధాకర్‌ యాదవ్‌ అలకబూనారు. శుక్రవారం మండల పరిషత్‌ సమావేశ భవనంలో ముందుగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం చేయించారు. సుధాకర్‌యాదవ్‌ కూడా చేశారు. అనంతరం వైస్‌ ఎంపీపీ పదవి కోసం సుధాకర్‌ యాదవ్‌ తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే.. పార్టీ అధినాయకత్వం అంగీకరించలేదు. దీంతో వైస్‌ ఎంపీపీ ఎన్నికకు సుధాకర్‌ యాదవ్‌ గైర్హాజరయ్యారు.