Abn logo
Jun 4 2020 @ 03:29AM

మరి వీటి సంగతేమిటి?

  • రైతు భరోసా కేంద్రాలకూ వైసీపీ రంగులు
  • వాటర్‌ ట్యాంకులు, కరెంటు స్తంభాలకూ అవే!


అమరావతి, రాజమహేంద్రవరం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఒక్క గ్రామ సచివాలయాలకే కాదు.. ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన రైతుభరోసా కేంద్రాలకు, గ్రామాల్లోని బోర్లు, బావులు, వాటర్‌ ట్యాంకులు, శ్మశానాలు, ఆర్చీలు, విద్యుత్‌ స్తంభాలు అన్నింటికీ తమ పార్టీ రంగులనే అద్దింది. తమ ముద్ర కన్పించాలనే అత్యుత్సాహంతో ఏడాది కాలంగా ప్రభుత్వ భవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో కనిపించిన ప్రతి గోడకూ.. రోడ్ల పక్కనున్న చెట్లకూ పార్టీ రంగులే వేశారు. అయితే  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ప్రభుత్వం తొలగించలేదు. తాజాగా సుప్రీంకోర్టు కూడా రంగులను తొలగించాలని ఆదేశించింది. గత నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతుభరోసా కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. వీటికి కూడా పార్టీ రంగులే వేశారు. రాజమహేంద్రవరంలో రాష్ట్రంలో మొదటిగా సీఎం జగన్‌ ప్రారంభించిన దిశ పోలీసుస్టేషన్‌కు కూడా వైసీపీ రంగులే వేశారు. ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజలందరికీ సంబంధించినవి. ఈ కార్యాలయాలకు ఒక పార్టీ రంగు ఉంటే, మిగతా ప్రజానీకం ఇక్కడ తమకు న్యాయం జరగదేమోనని అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉంది.

Advertisement
Advertisement
Advertisement