Abn logo
Mar 5 2020 @ 04:16AM

ఆట అదరాలి.. ఫైనల్ చేరాలి!

 ఈ మెగా టోర్నమెంట్‌లో భారత జట్టు ఇప్పటివరకు అజేయం..తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తుచేసిన ఉత్సాహంతో వరుస విజయాలు సాధిస్తూ ప్రతిష్ఠాత్మక ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో నిలిచింది..సెమీఫైనల్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌ గట్టి జట్టయినా ఇదే ఊపులో మరో గెలుపు అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చు..తొలిసారి ఫైనల్‌ చేరాలన్న ఆకాంక్ష... ఆపై ట్రోఫీతో చరిత్ర సృష్టించాలన్న పట్టుదల కలగలిసిన వేళ గురువారం జరిగే మ్యాచ్‌కు హర్మన్‌ప్రీత్‌ సేన సిద్ధమైంది..అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రిజర్వ్‌ డే లేనందున పోటీ రద్దయితే భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది..


ఇంగ్లండ్‌తో భారత్‌ సెమీస్‌ నేడు

మ్యాచ్‌కు వర్షం ముప్పు

టీ20 వరల్డ్‌కప్‌ 


సిడ్నీ: వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు భారత జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆరంభ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాకివ్వడంతో హర్మన్‌ సేన ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా రెట్టింపైంది. ఆపై వరుస విజయాలతో గ్రూప్‌ టాపర్‌ (8 పాయింట్లు)గా నిలిచింది.  తద్వారా టైటిల్‌ రేసులో గట్టి పోటీదారుగా దూసుకొచ్చింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ అదే ఆటతీరును ప్రదర్శించి మొదటిసారి ఫైనల్లో ప్రవేశించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.


నెం. 1 బ్యాటర్‌ వర్సెస్‌ నెం.1 బౌలర్‌

సెమీఫైనల్‌ పోరు ఇరుదేశాల అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కారణం..వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌వుమన్‌ వర్సెస్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌ పోరాటమే. ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఇలా వీరిద్దరి మధ్య ఫైట్‌ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ గ్రూప్‌ దశ ముగిసే సరికి భారత చిచ్చరపిడుగు షఫాలీ వర్మ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌నకు దూసుకుపోయింది. ఇక ఇంగ్లండ్‌ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ బౌలర్లలో అగ్రస్థానానికి చేరింది. రెండు జట్లు సెమీ్‌సకు చేరడంలో వీరిద్దరిదీ ముఖ్యపాత్ర. అయితే షఫాలీ-ఎకెల్‌స్టోన్‌ పోరాటం చూడాలంటే వరుణ దేవుడు కరుణించాలి. గురువారం సిడ్నీలో వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. 


టాప్‌ ఫామ్‌లో భారత్‌...

 ఒకరిద్దరు మినహా భారత జట్టంతా టాప్‌ ఫామ్‌లో ఉంది. టీనేజ్‌ సంచలనం షఫాలీ బ్యాటింగ్‌లో అదరగొడుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో 161 రన్స్‌ చేసిన ఆమె..టీ20 బ్యాట్స్‌వుమెన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. 40.25 సగటుతో ఈసారి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో 16 ఏళ్ల షఫాలీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌ నటాలీ స్కివెర్‌ (202), హీధర్‌నైట్‌ (193) తొలి రెండుస్థానాల్లో ఉన్నారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌వుమన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ కూడా చక్కటి ఫామ్‌లో ఉంది. ఆమె ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నా..వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతోంది. ఇక వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్‌లతో కూడిన మిడిలార్డర్‌  కష్ట సమయాల్లో ఆదుకుంటోంది. మరోవైపు జట్టులోని ఇద్దరు అత్యంత సీనియర్లు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఓపెనర్‌ స్మృతీ మంధాన ఇప్పటివరకు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. మరి కీలకమైన సెమీఫైనల్లో వారు బ్యాట్లు ఝళిపిస్తారేమో చూడాలి. బౌలింగ్‌ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి టోర్నీలో టాప్‌ బౌలర్‌గా నిలిచింది. ఆమెకు మీడియం పేసర్‌ శిఖా పాండే (4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) చక్కటి సహకారం అందిస్తోంది. 


ఇంగ్లండ్‌ బలం...బ్యాటింగ్‌

 మూడు విజయాలు ఒక పరాజయంతో గ్రూప్‌ ‘బి’లో ఆరు పాయింట్లతో రెండో స్థానంతో ఇంగ్లండ్‌ సెమీ్‌సకు క్వాలిఫై అయింది. ఆ జట్టు బలమంతా బ్యాటింగే. నటాలీ 67.33 సగటుతో మూడు హాఫ్‌ సెంచరీలతో 202 రన్స్‌ చేసింది. ఈమె జోరుకు భారత్‌ ఎలా కళ్లెం వేస్తుందో చూడాలి. బౌలింగ్‌లో స్పిన్నర్‌ సోఫీ ఎలెక్‌స్టోన్‌ (8 వికెట్లు), పేసర్‌ అన్యా ష్రబ్‌సోల్‌ (7 వికెట్లు) టోర్నీ టాప్‌ బౌలర్లలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.


గత ప్రపంచకప్‌లో... 

కిందటిసారి వెస్టిండీ్‌సలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో హర్మన్‌సేనతో తలపడినప్పుడు ఇంగ్లండ్‌ 8 వికెట్లతో నెగ్గింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌..19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ హీథర్‌నైట్‌ మూడు వికెట్లతో దెబ్బతీసింది. లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ ఛేదించింది. మిగిలిన నాలుగుసార్లు గ్రూప్‌ దశలో భారత్‌ను ఇంగ్లండ్‌ ఓడించింది. గత మెగా టోర్నీ సెమీ్‌సలో ఓడిన భారత జట్టులోని ఏడుగురు ప్లేయర్లు ఇప్పుడూ ఉన్నారు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వారు తహతహలాడుతున్నారు. ఇక వరల్డ్‌క్‌పనకు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు టోర్నీలో ఇంగ్లండ్‌పై విజయం సాధించడం భారత్‌కు సానుకూలాంశం. 


వర్షంతో రద్దయితే భారత్‌, సౌతాఫ్రికా ఫైనల్‌కు

సిడ్నీలో గురువారం జరిగే రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లకూ వరుణుడి ముప్పు పొంచిఉంది. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఫలితం రావాలంటే ఒక్కో జట్టు కనిష్ఠంగా ఐదు ఓవర్లు ఆడాలి. కానీ ఐసీసీ టోర్నీలకు నిబంధనలు భిన్నంగా ఉంటాయి. ఒక్కో జట్టు కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అంటే..సెమీ్‌సలో ఫలితం రావాలంటే ఒక్కో మ్యాచ్‌ 20 ఓవర్లు జరగాల్సి ఉంటుంది. అలాజరగకుంటే మ్యాచ్‌ రద్దవుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లూ రద్దయితే..రెండు గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అంటే గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌ భారత్‌, గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానంలో నిలిచిన సౌతాఫ్రికా ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి. అయితే ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. 


జట్లు  (అంచనా)

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తిశర్మ, వేద కృష్ణమూర్తి, తానియా భాటియా (కీపర్‌), షిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌


ఇంగ్లండ్‌: హీధర్‌ నైట్‌ (కెప్టెన్‌), డానీ వ్యాట్‌, టామీ బ్యూమాంట్‌, నటాలీ స్కివెర్‌, ఫ్రాన్‌ విల్సన్‌, అమీ జోన్స్‌ (కీపర్‌), కేథరిన్‌ బ్రంట్‌, అన్యా ష్రబ్‌సోల్స్‌, మాడీ విలీర్స్‌, సోఫీ ఎకెల్‌స్టోన్‌, సారా గ్లెన్‌.

Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
Advertisement