Abn logo
Feb 25 2020 @ 04:58AM

బంగ్లాను దాటేశారు

భారత మహిళలది అదే జోరు.. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జోష్‌లో ఉన్న హర్మన్‌ సేన ఈసారి బంగ్లాదేశ్‌ను ఆటాడుకుంది. తద్వారా ఈ జట్టుతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ఆరంభంలో చిచ్చరపిడుగు షఫాలీ వర్మ భారీ సిక్సర్లతో వాకా మైదానాన్ని హోరెత్తించగా.. ఆఖర్లో వేద కృష్ణమూర్తి వేగంగా ఆడి పరుగులను రాబట్టింది. దీంతో తాజా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత బౌలర్లు సమష్టిగా దెబ్బతీయడంతో డెత్‌ ఓవర్లలో బంగ్లా పూర్తిగా తడబడింది. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ మూడు వికెట్లతో మరోసారి మ్యాజిక్‌ చేసింది.


భారత్‌కు వరుసగా రెండో విజయం

స్పిన్నర్‌ పూనమ్‌కు 3 వికెట్లు

బంగ్లాదేశ్‌ పరాజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌

ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు మంగళవారం విశ్రాంతి దినం


పెర్త్‌: మహిళల టీ 20 ప్రపంచక్‌పలో భారత్‌ జైత్రయాత్ర సాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39) తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు తోడు భారత బౌలర్లు పూనమ్‌ (3/18), శిఖా (2/14), అరుంధతి (2/33) సత్తా చాటారు. దీంతో సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 18 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రెండు విజయాలతో గ్రూప్‌-ఎలో భారత్‌ నాలుగు పాయింట్లతో టాప్‌లో నిలిచి సెమీస్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది. మూడో మ్యాచ్‌ గురువారం న్యూజిలాండ్‌తో జరుగుతుంది.  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా చివర్లో వేద (11 బంతుల్లో 4 ఫోర్లతో 20 నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించింది. సల్మా ఖాతూన్‌, పన్నా ఘోష్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసి ఓడింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షఫాలీ వర్మ నిలిచింది. జ్వరం కారణంగా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరం కాగా 16 ఏళ్ల రిచా ఘోష్‌ బరిలోకి దిగింది.

ఆది నుంచీ తడబాటే..: ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ముర్షిదా, నిగర్‌ సుల్తానా మాత్రమే ఆకట్టుకోగలిగారు. రెండో ఓవర్‌లోనే శిఖా వికెట్‌ పడగొట్టింది. ఇక ఎనిమిదో ఓవర్‌లో ముర్షిదా జోరుకు అరుంధతి రెడ్డి బ్రేక్‌ వేసింది. తర్వాత పూనమ్‌ బంతిని అందుకోవడంతో బంగ్లాకు కష్టాలు ఆరంభమయ్యాయి. పరుగులు చేయాల్సిన రన్‌రేట్‌ కూడా పెరగడంతో వేగంగా ఆడే ప్రయత్నంతో సుల్తానా 17వ ఓవర్‌లో అవుటైంది. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు కావాల్సి ఉండగా రుమానా 11 పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచింది. కానీ ఆఖరి ఓవర్‌ తొలి బంతికే శిఖా పాండే ఆమెను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా ఓటమి లాంఛనమే అయింది.

షఫాలీ.. అదే జోరు: టాస్‌ ఓడిన భారత్‌ బ్యాటింగ్‌కు దిగగా ఎప్పటిలాగే టీనేజర్‌ షఫాలీ వర్మ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టి చక్కటి పునాది వేసింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ తన్మయ్‌ (2) వికెట్‌ కోల్పోయినా.. షఫాలీ మాత్రం వెనక్కి తగ్గలేదు. క్రీజులో ఉన్నంత సేపు బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించింది. తొలి ఓవర్‌లోనే సిక్సర్‌తో జోరు చూపించగా మూడో ఓవర్‌లోనైతే 17 పరుగులు రాబట్టింది. ఆరో ఓవర్‌ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన షఫాలీ మూడో బంతినీ అదే రీతిన ఆడబోయి క్యాచ్‌ అవుటైంది. జెమీమాతో కలిసి రెండో వికెట్‌కు 3.4 ఓవర్లలో 34 పరుగులు జోడించింది. తన దూకుడు కారణంగా పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు సాధించింది. ఆమె నిష్క్రమించాక జెమీమా బాధ్యతాయుతంగా ఆడింది. అడపాదడపా ఫోర్లతో ఆకట్టుకుంది. మరోవైపు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (8) పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ పదో ఓవర్‌లోనే వెనుదిరిగింది.  తర్వాత జెమీమా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటైంది. 17వ ఓవర్‌లో రిచాతో పాటు దీప్తి శర్మ కూడా అవుటవడంతో భారత్‌ 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ వేద 18వ ఓవర్‌లో 3 ఫోర్లు బాదడంతో జట్టు పోరాడే స్కోరును సాధించింది.


స్కోరుబోర్డు

 భారత్‌: తానియా భాటియా (స్టంప్డ్‌) నిగర్‌ సుల్తానా (బి) సల్మా ఖాన్‌ 2; షఫాలీ వర్మ (సి) షమీమా సుల్తానా (బి) పన్నా ఘోష్‌ 39; జెమీమా (రనౌట్‌) 34; హర్మన్‌ప్రీత్‌ (సి) రుమాన అహ్మద్‌ (బి) పన్నా ఘోష్‌ 8; దీప్తి శర్మ (రనౌట్‌) 11; రిచా ఘోష్‌ (సి) నహీదా అక్తర్‌ (బి) సల్మా ఖాతూన్‌ 14; వేద కృష్ణమూర్తి (నాటౌట్‌) 20; శిఖా పాండే (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 142/6. వికెట్ల పతనం: 1-16, 2-53, 3-78, 4-92, 5-111, 6-113. బౌలింగ్‌: జహనారా ఆలమ్‌ 4-0-33-0; సల్మా ఖాతూన్‌ 4-0-25-2; నహీదా అక్తర్‌ 4-0-34-0; పన్నా ఘోష్‌ 4-0-25-2; రుమానా అహ్మద్‌ 2-0-8-0; ఫహీమా ఖాతూన్‌ 2-0-16-0.

బంగ్లాదేశ్‌: షమీమా సుల్తానా (సి) దీప్తి శర్మ (బి) శిఖా పాండే 3; ముర్షిదా ఖాతూన్‌ (సి) రిచా ఘోష్‌ (బి) అరుంధతి 30; సంజిదా ఇస్లాం (సి) తానియా (బి) పూనమ్‌ 10; నిగర్‌ సుల్తానా (సి) అరుంధతి (బి) రాజేశ్వరి 35; ఫర్గనా (సి) తానియా (బి) అరుంధతి 0; ఫహిమా (సి) షఫాలీ (బి) పూనమ్‌ 17; జహనారా (స్టంప్డ్‌) తానియా (బి) పూనమ్‌ 10; రుమానా (బి) శిఖా పాండే 13; సల్మా ఖాతూన్‌ (నాటౌట్‌) 2; నహీదా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 124/8; వికెట్ల పతనం: 1-5, 2-44, 3-61, 4-66, 5-94, 6-106, 7-108, 8-121. బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0-32-0; శిఖా పాండే 4-0-14-2; రాజేశ్వరి 4-0-25-1; అరుంధతి 4-0-33-2; పూనమ్‌ యాదవ్‌ 4-0-18-3.


Advertisement
Advertisement
Advertisement