Abn logo
Oct 24 2020 @ 21:15PM

బైక్‌ ఆపాడని ట్రాఫిక్‌ పోలీసుపై మహిళ దాడి.. చొక్కా చింపి మరీ..

ముంబై: ఓ మహిళ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. చొక్కా చింపేసింది. ఎడాపెడా చెంపదెబ్బలు కొట్టింది. దారుణంగా దూషించింది. అయితే ఆ కానిస్టేబుల్‌ చేసిన పాపమేంటో తెలుసా...? హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌ నడుపుతున్నందుకు ఆపడమే. అవును.. హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతున్నందుకు గానూ వాహనాన్ని నిరులవరించి ఆమెను ప్రశ్నించాడా కానిస్టేబుల్‌. అంతే ఆమె పూనకం వచ్చినట్లు ఊగిపోయి అతడిపై తిట్ల దండకం అందుకుంది. అంతటితో ఆగకుండా చేయి చేసుకుని దారుణంగా కొట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆమె చేసిన పని పోలీసు వ్యవస్థ గౌరవానికే భంగం కలిగించేలా ఉందని, ఇది ముంబై పోలీసుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, తన ట్వీట్‌లో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ట్యాగ్ చేసి ఈ వీడియోను షేర్‌ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాటన్ ఎక్సేంజ్ చెక్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఏక్ నాథ్ పార్థే అనే కానిస్టేబుల్‌పై ఈ దాడి జరిగింది.

దాడి జరుగుతున్న సమయంలోనే మిగిలిన పోలీసులు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఓ మహిళా కానిస్టేబుల్ ఘటనా స్థలానికి వచ్చారు. నిందితురాలిని పట్టుకున్నారు. కానిస్టేబుల్ మీద దాడి చేసిన మహిళను సాద్వికా రమాకాంత్ తివారీ(30)గా గుర్తించారు. ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తిని మొహిసిన్ ఖాన్(26)గా గుర్తించారు. వారిద్దరినీ లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వాధికారిపై దాడి చేసినందుకు సాద్వికా రమాకాంత్ తివారీ మీద సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. ఇద్దరి మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే, నిందితురాలు ఆరోపిస్తున్నట్టు ఆమెపై కానిస్టేబుల్ అసభ్యకరంగా దూషించలేదని అధికారిక ప్రకటన ద్వారా పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే సాద్వికా తివారీ దాడి చేస్తున్నా, తిడుతున్నా కూడా.. తిరిగి దాడి చేయకుండా సంయమనంతో వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్ ఏక్ నాథ్ పార్థేను ట్రాఫిక్‌ జాయింట్ పోలీస్ కమిషనర్ అభినందించారు. ఆయన సహనాన్ని మెచ్చుకున్నారు.