Abn logo
Sep 18 2021 @ 15:10PM

జగనన్న ఇళ్ల కోసం జగడం..!

పనులపై పెత్తనం కోసం ఆరాటం..

నాసిరకం పనులతో కాసుల వేట..


ప్రభుత్వ పథకం పనులపై పనులపై పెత్తనం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తాయి. పనుల పరిశీలనకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి ముందే.. ఆ విభేదాలు బయటపడ్డాయి. విషయం గ్రహించిన సదరు ఇన్‌చార్జి మంత్రి ఉన్నట్లుండి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఇంతకీ ఆ ప్రభుత్వ పథకం ఏది? ఆ పనులపై పెత్తనం కోసం తాపత్రయపడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు? వారి మధ్య విభేదాలే ఇన్‌చార్జి మంత్రి పర్యటన రద్దుకి కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? వాచ్‌ దిస్‌ స్టోరీ.

పనుల్లో భారీగా అవకతవకలు..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న ఇళ్లు . అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాసుల వర్షం కురిపిస్తున్నది కూడా జగనన్న ఇళ్లు, స్థలాలే! దీంతో ఈ ఇళ్ల స్థలాల్లో పనులపై పెత్తనం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ఇళ్ల స్థలాల పంపిణీ అయిపోయిన తర్వాత ప్రస్తుతం జగనన్న లేఅవుట్‌లలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్..

గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల్లో పనులపై పెత్తనం కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయంలోనే గుంటూరు నగర ఎమ్మెల్యేలకు, తాడికొండ ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. తాడికొండ నియోజకవర్గంలోని పేరేచర్ల, లాం లోని స్థలాలు తన నియోజకవర్గం పరిధిలో ఉన్నందున మౌలిక సదుపాయాల కల్పన తన కనుసన్నల్లోనే జరగాలని తాడికొండ ఎమ్మెల్యే భావిస్తున్నారు. లబ్ధిదారులంతా తమ నియోజకర్గాల పరిధిలోని వారేననీ, వారి పనులు మేము దగ్గరుండి జరిపించాలనీ గుంటూరు నగర ఎమ్మెల్యేలు ఇప్పటికే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు.

స్థల పరిశీలన కోసం వెళ్లిన మంత్రి..

గుంటూరు నగరవాసులకు జగనన్న కాలనీల కోసం నగరానికి సమీపంలోని పేరేచర్ల, లాం గ్రామాల్లో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇందులో కోట్లాది రూపాయలు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లెవలింగ్‌, అంతర్గత రోడ్లు, విద్యుద్దీకరణ, డ్రైనేజ్‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఈ స్థలాలను పరిశీలించేందుకు హౌసింగ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు ఇటీవల గుంటూరు నగరానికి వచ్చారు. ముందుగా ఆయన తాడికొండ నియోజకవర్గ పరిధిలోని పేరేచర్లలోని స్థలాల వద్దకు వెళ్లారు.

బయటపడిన విభేదాలు..

స్థలాల పరిశీలన కార్యక్రమంలో ఇన్‌ఛార్జి మంత్రితోపాటు గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తాఫా, మద్దాలి గిరిధర్‌లు పాల్గొన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే అయిన ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ పరిణామం ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజుకు మింగుడు పడలేదట. నిజానికి పేరేచర్లలో జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన తర్వాత.. అదే నియోజకవర్గ పరిధిలోని లాం గ్రామంలో స్థల పరిశీలనకు ఇన్‌ఛార్జ్‌ మంత్రి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయనకు అప్పటికే పరిస్థితి అర్థమవడంతో.. లాం పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరిగి వెళ్లిపోయారట.

పనుల్లో నాణ్యతా లోపం..

ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పొలాల వ్యవహారంలో కూడా అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ భారీఎత్తున ముడుపులు అందాయని ఆరోపణలు తలెత్తాయి. ఒక్కో ఎకరానికి రైతుల నుంచి 5 నుంచి రూ.10లక్షల వరకు ప్రజాప్రతినిధుల పేరు చెప్పి వసూలు చేశారని ప్రచారం జరిగింది. అంతటితో సరిపెట్టుకోకుండా ఇప్పుడు ఆ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కేటాయించే కోట్లాది రూపాయలుపై ప్రజాప్రతినిధుల కన్నుపడింది. ఇప్పటికే స్థలాల మెరక పేరుతో భారీగా నిధులు నొక్కేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతుమంత్రంగా మట్టి తోలించారు. అదేమంటే, ఇటీవల కురిసిన  వర్షాలకు మట్టి కొట్టుకుపోయిందనే వాదన వినిపిస్తున్నారు.

పనులు.. తమకంటే తమకంటే..

పేరేచర్లలో 390 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి.. సుమారు 14 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అలాగే లాంలో 115 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి.. దాదాపు  5,420 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ స్థలాల పనుల్లో పెత్తనం కోసమే గుంటూరు నగర ఎమ్మెల్యేలకు, తాడికొండ ఎమ్మెల్యేకు మధ్య వివాదం తలెత్తిందనే గుసగుసలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మరీ ఈ ఆధిపత్య పోరు మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండిImage Caption