Abn logo
Jun 17 2021 @ 04:08AM

..సంకెళ్లు బిగిసే పాడుకాలం లయిస్తుందా?

అల్పసంతోషులం అనుకుంటారేమో తెలియదు కానీ, చిక్కని చిమ్మచీకటి పలచబడి, కన్ను పొడుచుకుంటే ఓ వెలుగు చుక్క కనిపిస్తున్నది. ఎంతో ఆనందం అనిపిస్తున్నది. ఎడతెగదేమోననుకున్న ఎడారిలో కాలికింత చెమ్మ తగిలినట్టు ఊరటగా ఉన్నది. జనారణ్యరోదనలు కమ్ముకుని, గుండెలార్చుకుపోతున్నప్పుడు, చెవిలో ఎవరో ఒక చిన్న ఓదార్పు పలికినట్టు ఆశ పుడుతున్నది. అయిపోతున్నదిలే, గ్రహణం వదలడం మొదలయిందిలే, ఊపిరాడని బిగతీత ముగిసి శ్వాస తెలుస్తుందిలే, ఇంకొంచెం తాళితే గండం గడచిపోతుందిలే, అన్న నమ్మకం మొదలవుతున్నది. కుత్తుక మీద ఉక్కుపాదం ఎంతగా బిగిస్తే, ఈ మాత్రం సడలింపు స్వర్గం లాగా ఉన్నది!


ఢిల్లీ హైకోర్టు మంగళవారం నాడు ఉద్యమ ఖైదీలు ముగ్గురికి బెయిల్ ఇచ్చిందేమో కానీ, తనకు తెలియకుండానే భారత ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరులు పోసింది. ప్రజా ఉద్యమాలకు ఉగ్రవాదానికీ తేడా తెలియదా అని ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. ప్రభుత్వ విధానం మీద నలుగురిని కలుపుకుని ప్రదర్శన చేస్తే, నినాదాలు చేస్తే, నిరసన తెలిపితే, ఊపా చట్టం కింద బంధిస్తారా అని నిలదీసింది. ఏమిటీ దుర్వినియోగం అని ఆశ్చర్యపోయింది. ఈ మూడు బెయిల్ తీర్పులు సాధారణమైనవి కావు, అక్షరమక్షరం అన్వయిస్తే అనేకానేక సంకెళ్లను ఛేదించగలిగినవి. 


ఇంతకాలం ఢిల్లీ హైకోర్టుకు తెలియకపోవడమే ఆశ్చర్యం. రాజద్రోహం కేసులు ఇట్లా ఎడాపెడా మోపుతారా అని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఇట్లాగే విస్తుపోయింది. దేశంలో క్షేత్రస్థాయిలో, దిగువ పరిపాలనలో, న్యాయపాలనలో ఏమి జరుగుతున్నదో తెలియకపోవడం ఎంత అన్యాయం? రాజకీయ అసమ్మతి, ఉద్యమాలను ప్రమాదకారులుగా చిత్రించి క్రూర చట్టాల కోరల్లోకి తోయడం కొత్తదేమీ కాదు. మీసాలూ నాసాలూ యాభై ఏళ్ల కిందటే జనాన్ని కాల్చుకుతిన్నాయి. ప్రజల నిరసన పెరిగి అవతారాలు చాలించినప్పటికీ, టాడాలూ పోటాలు అమాయకులను ఎంతగా వేధించాలో అంతగా వేధించగలిగాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ‘ఊపా’కు ఊపిరి పోసింది కూడా మరో ప్రభుత్వమే. కానీ, గత ఏడు సంవత్సరాల కాలంలో, చట్టాలను బలాదూర్‌గా ఉపయోగించారు. చేవచచ్చిన ప్రతిపక్షాలను మినహాయించి, తక్కిన ప్రజాస్వామిక నిరసనలన్నిటినీ సృజనాత్మకంగా అణచివేయగలిగారు. విచారణ లేకుండా, వెసులుబాటు లేకుండా ఏళ్ల తరబడి బంధించిపెట్టే అధికారాన్ని ఝళిపించారు. ప్రాసిక్యూషన్ చెప్పినదానికి అనేక సందర్భాలలో దిగువకోర్టులు తలలూపాయి. ఉద్యమకారులలో ఉపద్రవాన్ని చూ శాయి. వయసు పైబడిన ఖైదీలు చిన్న చిన్న అవసరాలకు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వచ్చింది. జబ్బు చేసింది ఆస్పత్రిలో చేర్చమని మొర పెట్టుకోవలసి వచ్చింది. తల్లో తండ్రో చనిపోయారు బెయిల్ ఇవ్వండి అని ప్రాధేయపడినా నిరాకరణను ఎదుర్కొనవలసి వచ్చింది. నిండు వైకల్యం ముందు కూడా కనికరం లేని కాఠిన్యం వికటాట్టహాసం చేసింది. 


ప్రతి ప్రజా ఉద్యమమూ ఒక కుట్రే. ప్రతిచోటా, నిబద్ధులూ ప్రజాపక్షపాతులే దోషులు. బీమా కోరేగావ్ కూడా అంతే. దళితుల వేడుక అది. ఒక చారిత్రక న్యాయసందర్భాన్ని తలచుకునే పండుగ అది. దానిలో విధ్వంసాన్ని చొప్పించినవారు భద్రంగా ఉన్నారు, దానిలో విషపు చుక్క చిందించినవారు క్షేమంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాపక్షపాతులు, నిస్వార్థ కార్యకర్తలు, మేధావులు కటకటాల వెనుకకు వెళ్లారు. పౌరసత్వ చట్టంపై నిరసనలూ అంతే. ప్రజాస్వామిక వాదులందరి గొంతు గుడారమై షాహిన్‌బాగ్ ఏర్పడింది. బీమా కోరేగావ్ లాగే అక్కడ కూడా కనిపించని కుట్ర ఒకటి కత్తి దూసింది. ఇంకేముంది, నిరసనకారుల కుట్ర రూపొందింది. జెఎన్‌యు, జామియా మిలియా విద్యార్థులను, ఢిల్లీ సమాజంలోని పౌర కార్యకర్తలను ఊపా వరించింది. గర్భవతులకు బెయిల్ రావడం కూడా కష్టమైంది. కొవిడ్ రోగులకు చికిత్స కూడా గగనమైంది. పద్నాలుగునెలల నుంచి ఎడతెగని కారాగారం. కోర్టు ముందుకు సంకెళ్లతో తీసుకువస్తామని, అనుమతించమని అభ్యర్థన ఒకటి.. న్యాయం తమ పక్షాన లేకున్నా న్యాయస్థానాన్ని మభ్యపెట్టగలిగితే ధైర్యం పెరుగుతూ పోతుంది కదా!


అన్నన్ని బెయిల్ దరఖాస్తులను చూసి, నిరాకరించిన దిగువ కోర్టులు ఏ ప్రమాదాన్ని వారిలో చూశాయో కానీ, హైకోర్టు ఇప్పుడు, విద్యార్థి నాయకులేమిటి, ఈ చట్టం ఏమిటి అని విస్మయం ప్రకటిస్తున్నది. పౌరసత్వ చట్టం మీద నిరసన ఉద్యమాన్నే కాదు, ఢిల్లీలో నెలల తరబడి నిలకడగా ఉద్యమం నడుపుతున్న రైతాంగం మీద కూడా అదే కోవలో చర్యలు. మరి హక్కుల ఉద్యమకారులు ఇంతకాలం చెబుతున్నది నిజమైనట్టే కదా? ఉగ్రవాదమో తీవ్రవాదమో హింసావాదమో ఏదో ఒక పేరు చెప్పి నిరసనకారులను నిర్బంధించే ప్రభుత్వం, వాస్తవంగా వాటిని ప్రజాస్వామ్యవాదులను అణచివేయడానికే ఉపయోగిస్తుందన్న హెచ్చరిక రుజువైనట్టే కదా? 


నాలుగున్నర దశాబ్దాల కిందటి అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ కుడి, ఎడమ రాజకీయాలలోని తన ప్రత్యర్థులందరినీ మూకుమ్మడిగా నిర్బంధించారు. రచయితలను, పాత్రికేయులను, సామాజిక కార్యకర్తలను అందరినీ వేధించారు. ఆ అనుశాసన పర్వం, ఆమె అధికారాన్నే కబళించింది. మరి మూడేళ్లకే తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిర, ఆ గుణపాఠాన్ని మరచిపోలేదు.. అందరినీ ఒకేసారి బంధించడం వల్ల ఈ పరిస్థితి కలిగింది, ఎంపిక చేసిన శత్రువునే కొట్టాలి అన్నది ఆమె నేర్చుకున్న కొత్త పాఠం. వెంటనే పంజాబ్‌లో అకాలీదళ్‌లో చిచ్చు మొదలయింది. కశ్మీర్‌లో ఫరూఖ్ అవుట్. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీయార్ ప్రభుత్వం రద్దు. ఆ తరువాత, పంజాబ్ తీవ్రవాదం పెరిగింది. కొంతకాలానికి, స్వయంకృతాలు కశ్మీర్ కల్లోలానికి కారణమయ్యాయి. కొన్నిటి పేరు చెప్పి, అన్ని గొంతులనూ అణచిపెట్టగల క్రూరచట్టాలు అవతరించాయి. దేశంలో ఎక్కడో ఒకచోట ఎప్పుడూ ఇనుపబూట్ల కవాతు సాగుతూనే ఉన్నది. ప్రజాస్వామిక ఆకాంక్షలన్నిటినీ తీవ్ర, ఉగ్రవాదాలుగా ఆరోపించడం ప్రభుత్వాలకు అలవాటు అయిపోయింది. కానీ, ఎంతటి బీభత్సంలోనూ న్యాయానికి ఎంతో కొంత ఆస్కారం ఉండేది. బహిరంగంగా ప్రజాస్వామిక కార్యక్రమాలలో పాల్గొనేవారిపై ఇంత బాహాటంగా విరుచుకుపడే ధోరణి లేకపోయేది. ఔరా! నిన్నటి చీకటి రోజులే మెరుగు అనుకునే రోజులు వచ్చాయి కదా? 


ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలు వాతావరణాన్ని ప్రజాస్వామికం చేసేందుకు పాదులు వేశాయన్న ఆనందాన్ని, కొంత జాగ్రత్తగానే అనుభవించాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్యానికి, ఉగ్రవాదానికి సరిహద్దురేఖ గురించి న్యాయస్థానం ప్రస్తావించింది. దేశరక్షణకు ముప్పు వచ్చిన సందర్భాలనే తీవ్రమైనవిగా పరిగణించాలని సూచించింది. కానీ, సందర్భం, అవసరం ఏమైనా, ఊపా లాంటి చట్టాలు, వాటిలోని అప్రజాస్వామిక, అమానవీయ అంశాల కారణంగా నిరాకరించవలసినవి. మోపిన అభియోగం నిందితులు చేసి ఉంటారన్న ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం సంతృప్తి చెందితే చాలు, ఏ భౌతిక సాక్ష్యమూ లేకుండానే, బెయిల్ నిరాకరించవచ్చునన్న నిబంధన కానీ, నిర్దోషిత్వాన్ని నిందితుడే నిరూపించుకోవాలన్న అంశం కానీ ఆ చట్టాన్ని సహజన్యాయానికి విరుద్ధంగా నిలబెట్టాయి. నిందితులపై అభియోగాలు న్యాయమైనవే అని కేంద్ర హోంశాఖ ఇచ్చిన తాఖీదు ప్రకారం దిగువన్యాయస్థానాలు సంతృప్తి చెందడాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. హోంశాఖ అంచనాలు న్యాయనిర్ధారణలో పరిశీలించదగినవి కావని కూడా చెప్పింది. హైకోర్టు ఇంత తీవ్రంగా అభిశంసించినా ఢిల్లీ పోలీసులు ఏమాత్రం బెరుకు లేకుండా సుప్రీం కోర్టుకు అప్పీలు  చేసుకున్నారు.


ఊపా పరిధిలోకి విద్యార్థి నాయకులు, యువకులు రారని చెప్పింది కానీ, రాజద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టు చేసినట్టు ఉపా ప్రాసంగికతను కానీ, యోగ్యతను కానీ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించలేదు. ఆ మేరకు, నిరుత్సాహం కలుగుతుంది కానీ, ఏమో, కొంచెం కొంచెంగా గొంతు పెగుల్చుకుంటున్న సత్యమార్గం, మున్ముందు మహా ప్రకటన చేస్తుందేమో? అణగారిపోయో, అలసిపోయో, అసమర్థమైపోయో నిశ్శబ్దంగా ఉన్న గొంతులు ఇక శక్తులు కూడదీసుకుంటాయోమో?

కె. శ్రీనివాస్