Abn logo
Oct 3 2020 @ 04:01AM

రైతుబజారు ఏర్పాటయ్యేనా?

Kaakateeya

పరిగిలో స్థల వివాదంతో నిలిచిన రైతుబజారు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం

రోడ్డుపై సంత నిర్వహణతో ఇబ్బందుల్లో రైతులు, ప్రజలు 


పరిగి: వికారాబాద్‌ జిల్లా పరిగి పట్టణంలో జరిగే సంతకు ప్రత్యేకస్థలం లేక వ్యాపారులు, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రతి శుక్ర, శనివారాల్లో మార్కె ట్‌ను పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ప్రధాన రహదారులపై నిర్వహించడం కారణంగా వ్యాపారులు, ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. అడుగడుగునా అవరోధాలతో సాగే సంత కారణంగా పట్టణంలోని ప్రఽధాన చౌరస్తాల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. రోడ్లపైనే ఎక్కడ బడితే అక్కడ ప్రైవేట్‌ వాహనాలు, ఆటోలు పార్కింగ్‌ చేయడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో రోడ్డుపైనే కొనసాగే ఈ సంతను ఏడాదిపాటు మార్కెట్‌ కమిటీ స్థలంలో కొనసాగించారు. ఆ స్థలంలో రైతుబజారు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని పాలకవర్గం నిర్ణయించడంతో తిరిగి కూరగాయాల మార్కెట్‌ నడి రోడ్డుపైకి వచ్చింది. శుక్ర, శనివారాల్లో అయితే సంత జరిగే ప్రాంతాల్లో రోడ్డుపై నడవడానికి కూడా వీల్లేకుండా ఉంటుంది. రైతులు, వ్యాపారులు చలి, వాన, ఎండల మధ్యలోనే కూరగాయలు విక్రయిస్తుంటారు.


2002లో రైతుబజారు ఏర్పాటుకోసం అప్పటి ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి విధితమే. శిలాఫలకం వేసి పదిహేనేళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత మార్కెట్‌కమిటీ రూ.75లక్షలతో రైతుబజారును, రూ.67లక్షలతో షాపింగ్‌ కాం ప్లెక్స్‌ను నిర్మించాలని నిధులు మంజూరి చేసింది. పనులను టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు కూడా ప్రారంభించారు. ఈస్థలం మాదని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో రైతుబజారు, షాపింగ్‌ కాం ప్లెక్స్‌ నిర్మాణ పనులు 6మాసాల నుంచి నిలిచిపోయాయి. రైతుల బజారు నిర్మాణం ఇక వివాదంగా మారింది. 


పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల, దోమ, పూడూర్‌ గ్రామాలకు చెందిన వేలాది మంది వస్తుంటారు. వారానికి రెండు రోజులు జరిగే ఈ సంతలో ప్రత్యక సదుపాయాలు లేకపోవడంతో రోడ్డుపైనే కూరగాయలు విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపార సముదాయాలు రోడ్డుపైనే పెట్టడం వల్ల వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా గతంలో పలుసార్లు  ప్రమాదాలు కూడా సంభవించాయి. రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార లావాదేవీల మూలంగా సంతరోజుల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. దీని మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వినియోగిదారులు, వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ప్లాట్‌ఫామ్‌లు నిర్మించినప్పటికీ వాటిపై షెడ్లు నిర్మించడం మరిచారు. ముఖ్యంగా వర్షాకాలం అయితే నానా అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. 


త్వరలో సమస్యకు పరిష్కారం..ఎండీ అజారొద్దీర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, పరిగి 

రైతుబజారు స్థలం కొంత వివాదమైంది. త్వరలోనే పరిష్కారం కానుంది. మున్సిఫ్‌ కోర్టులో మార్కెట్‌ కమిటీ వైపే తీర్పు వచ్చింది. అవతలి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన కారణంగా సమస్య పెండింగ్‌లో ఉంది. రీసర్వే చేయాలని ఉన్నతాధికారులను కోరాం. రైతు బజారు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు రూ.1.30లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ వెంటనే రైతుబజారు నిర్మాన పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇక రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు ఉండవు.


రైతుబజారును త్వరగా ఏర్పాటు చేయాలి..బాబయ్య, బీకేఎస్‌ అధ్యక్షుడు, పరిగి 

పరిగిలో రైతుబజా రును త్వరగా ఏర్పాటు చేయాలి. రోడ్డుపై ఇరుకు స్థలంలో నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మార్కెట్‌శాఖ అధికారులు త్వరగా చొరవ చూపాలి. రైతు బజారులో వ్యాపారులకు కాకుండా రైతులకు అవకాశం ఇవ్వాలి.


రైతు బజారులోనే చేపల మార్కెట్‌ ఉండాలి..ఆనెం ఆంజనేయులు, పరిగి

పరిగిలో ఏర్పాటు చేసే రైతుబజారులో చేపల మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయాలి. పరిగి ప్రాంతంలో మత్స్యకారులు చాలా ఎక్కువగా ఉంటారు. రైతుబజారును త్వరగా పూర్తిచేసి.. అందులో మత్స్యకారులకు ప్రత్యే కంగా షెడ్‌లను పూర్తి చేయాలి.

Advertisement
Advertisement