Abn logo
Oct 9 2020 @ 13:18PM

భర్తను చంపాలని అన్నంలో నిద్రమాత్రలు.. కానీ ప్లాన్ ఫెయిలవడంతో భార్య మరో స్కెచ్..!

Kaakateeya

మాజీ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య 

ఈనెల 1న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వ్యక్తి కేసును ఛేదించిన ఘట్‌కేసర్‌ పోలీసులు 

పథకం ప్రకారం హత్య చేసినట్లు నిర్దారణ 

రోకలిబండతో బాది హతమార్చిన వైనం 

వివరాలు వెల్లడించిన ఘట్‌కేసర్‌ పోలీసులు 


ఘట్‌కేసర్‌ రూరల్(ఆంధ్రజ్యోతి): ఈనెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మాజీ ప్రియుడితో కలిసి భర్తను అతిదారుణంగా రోకలిబండతో బాది హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ చంద్రబాబు, క్రైం ఇన్‌స్పెక్టర్‌ జంగయ్య గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లా ఎన్‌ఎ్‌ఫసినగర్‌, బి-1 కాలనీలో గంగపురం అంజయ్య(57), గంగపురం భవానిలు కుమారుడు లక్ష్మీకాంత్‌తో కలిసి గతమూడేళ్ళ నుంచి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అంజయ్య ఘట్‌కేసర్‌ పట్టణంలో దర్జీగా పనిచేస్తున్నాడు. రోజువారీగా వచ్చే డబ్బులతో అంజయ్య నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, కుమారుడితో గొడవపడేవాడు. కొన్ని సందర్భాల్లో మద్యం మత్తులో పక్కలోనే మలమూత్ర విసర్జన చేసేవాడు. పెళ్లి అయినప్పటి నుంచి అంజయ్య భార్యను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఈనేపథ్యంలో గత నెల 29న భార్యను చితకబాదడంతో  విసుగెత్తిన భార్య గతంలో అన్నోజిగూడలోని రాజీవ్‌గృహకల్పలో ఉన్న సమయంలో పరిచయమైన మాజీ ప్రియుడు అయుర్వేద వైద్యుడు గోపి సతీష్ కుమార్‌తో భర్త చేసే విషయాలన్నీ తెలిపింది. 


ఎలాగైనా వదిలించుకోవాలని గోపి సతీష్ కుమార్‌తో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మరుసటి రోజు గత 30న రాత్రి అన్నంలో మత్తుమందు వేసి తిన్న తరువాత దిండుతో ముఖంపై అదిమిపెట్టి ఊపిరిఆడకుండా చంపాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే అన్నంలో మత్తుమాత్రలు కలిపి పెట్టింది. మత్తుమందు పనిచేయకపోవడంతో అంజయ్య మరునాడు ఉదయం ఈనెల 1న లేచి కాలకృత్యాలు తీర్చుకుని, మళ్లీ పడుకున్నాడని భార్య గోపి సతీష్ కుమార్‌కు చెప్పింది. తన కుమారుడు 8గంటలకు ఉద్యోగానికి వెళ్ళగానే రమ్మని భార్య భవాని గోపీసతీష్‌కు ఫోన్‌లో చెప్పింది. కుమారుడు వెళ్ళగానే ప్రియురాలు చెప్పిన విధంగా గోపీసతీష్ కుమార్‌ ఇంటికి వచ్చాడు. నిద్రిస్తున్న భర్తను దిండుతో ముఖంపై అదిమిపెట్టి చంపడానికి ప్రయత్నించగా అంజయ్య మేల్కొని వారిని ప్రతిఘటించి గుర్తుపట్టాడు. దీంతో భయపడిన భార్య వంటగదిలో ఉన్న రోకలితో భర్త అంజయ్య తలపై రెండుసార్లు బలంగా కొట్టినట్లు తెలిపారు. గోపిసతీష్ కుమార్‌  అంజయ్య తలపై, కాళ్లు, చేతులపై బలంగా కొట్టడంతో తీవ్రరక్తస్రావమై అంజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. రక్తపు మరకలను శుభ్రం చేసి, రోకలిని కడిగి వంటగదిలో పెట్టింది. రక్తపు బట్టలను మాజీప్రియుడు గోపిసతీష్‌ కుమార్‌కు ఇచ్చి పడేయాలని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించింది.


ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం 

 హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి నిందితురాలు తన కొడుకుకు ఫోన్‌ చేసి మీనాన్నకు ప్రమాదం జరిగి తలకు బలమైన గాయమై ఇంటికి వచ్చాడని, ఏమైందో అడిగేలోపే  చనిపోయాడని సమాచారం అందించిందని పోలీసులు వివరించారు. అలాగే 100 నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిందని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. పోలీసుల విచారణలో భార్య భవాని మాజీ ప్రియుడు గోపిసతీష్ కుమార్‌తో కలిసి భర్త అంజయ్యను హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. రోకలి, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని భవాని, గోపిసతీ్‌షకుమార్‌లను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు తెలిపారు. 

Advertisement
Advertisement