Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్ఆర్‌హెచ్ నుంచి రషీద్ ఖాన్ ఎందుకు బయటకొచ్చాడు?

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ టాప్ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) నుంచి బయటకు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. రషీద్ కనీసం రూ. 16 కోట్లు ఆశించాడని, కానీ హైదరాబాద్ మాత్రం రూ. 11 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు మొగ్గు చూపడం వల్లే అతడు బయటకు వచ్చినట్టు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 


ఈ నేపథ్యంలో రషీద్ ఎందుకు బయటకు వెళ్లిపోయాడన్న విషయాన్ని హైదరాబాద్ ఫ్రాంచైజీ వెల్లడించింది. రషీద్ తన ఇష్ట ప్రకారమే బయటకు వెళ్లిపోయాడని, మరింత అధిక ధర ఆశిస్తుండడంతో వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడని ఎస్ఆర్‌హెచ్ సీఈవో కె.షమ్మి తెలిపారు. అతడి నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించినట్టు చెప్పారు.


రషీద్‌ను 2017లో హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకు దక్కించుకుంది. ఆ సీజన్‌లో అతడు అద్భుతంగా రాణించడంతో 2018 వేలంలో అతడి ధర అమాంతం పెరిగింది. అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 9 కోట్లకు బిడ్ దాఖలు చేసినప్పటికీ, ఎస్ఆర్‌హెచ్ తమ రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డును ఉపయోగించుకుని అంతే ధరకు అతడిని దక్కించుకుంది. హైదరాబాద్ తరపున ఇప్పటి వరకు 76 మ్యాచ్‌లు ఆడిన రషీద్ 6.33 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టాడు. 


ఇక, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకున్న హైదరాబాద్.. అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్లయిన అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను చెరో రూ. 4 కోట్లతో అట్టే పెట్టుకుంది. 

Advertisement
Advertisement