Abn logo
May 21 2020 @ 16:12PM

హెచ్1బీ వీసాదారుల వల్ల లాభమే తప్ప నష్టం లేదు: స్టడీ

వాషింగ్టన్: అమెరికాలో హెచ్1బీ వీసాదారుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం అంటుంటారు. అంతేకాకుండా ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హెచ్1బీ వీసాల జారీలో అనేక ఆంక్షలు పెడుతూ వచ్చారు. ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల్లో హెచ్1బీ వీసాలపై మరిన్ని ఆంక్షలు జారీ చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో హెచ్1బీ వీసాదారుల ప్రభావం అమెరికన్లపై అనుకూలంగానే తప్ప వ్యతిరేకంగా లేనట్టు తమ పరిశోధనలో తేలిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలిసి వెల్లడించింది. హెచ్1బీ వీసాదారుల కారణంగా అమెరికన్ వర్కర్లకు హాని కలుగుతుందా అన్నదానిపై నేషనల్ ఫౌండేషన్ పరిశోధన జరిపింది. 2005 నుంచి 2018 వరకు 22 వృత్తులలో పనిచేస్తూ వస్తున్న హెచ్1బీ వీసాదారుల ప్రభావం అమెరికా నిరుద్యోగ, ఆదాయ వృద్ది రేటుపై ఎలా ఉందనే దానిపై పరోశోధన చేసింది. ఏ వృత్తిలో అయితే హెచ్1బీ వీసాదారులు పెరుగుతూ వచ్చారో.. ఆ వృత్తిలో నిరుద్యోగ రేటు తగ్గుతూ వచ్చినట్టు ఈ పరిశోధనలో తేలింది. ఒక వృత్తిలో హెచ్1బీ వీసాదారుల రేటు ఒక శాతం పాయింట్లు పెరిగితే.. ఆ వృత్తిలో నిరుద్యోగ రేటు 0.2 శాతం పాయింట్లు తగ్గుతూ వచ్చింది. అంటే.. హెచ్1బీ వీసాదారుల కారణంగా ఉపాధి పెరుగుతూ వచ్చినట్టు పరిశోధనలో తెలిసింది.


మరోపక్క హెచ్1బీ వీసాదారుల కారణంగా అమెరికన్ల వేతనాలు, వేతన వృద్ధి తగ్గుతూ వస్తోందని ఆందోళన చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ.. పరిశోధనలో మాత్రం హెచ్1బీ వీసాదారులు పెరుగుతూ వస్తుంటే.. అమెరికన్ల వేతనాలు, వేతన వృద్ధి కూడా పెరుగుతూ రావడం కనిపించింది. అంతేకాకుండా హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ అమెరికాలోని కాలేజ్ గ్రాడ్యుయేట్ వర్క్‌ఫోర్స్‌పై ఎటువంటి ప్రభావం చూపించడం లేదని పేర్కొంది. కాలేజ్ గ్రాడ్యుయేట్ వర్క్‌ఫోర్స్‌ ముందు హెచో1బీ వీసా ప్రోగ్రామ్ చాలా చిన్నదని నేషనల్ ఫౌండేషన్ తెలిపింది.  ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసాదారులు అత్యధికంగా ఐటీ వృత్తిలోనే పనిచేస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే ఆ వృత్తిలో హెచ్1బీ వీసాదారుల షేర్ తక్కువ స్థాయిలోనే ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, కంపెనీలకు హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ ఎంతో అవసరమని నేషనల్ ఫౌండేషన్ పేర్కొంది. కాగా.. ఇతర దేశాలకు చెందిన వారు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ప్రతి ఏడాది 85 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది. ఇందులో అత్యధిక వీసాలు భారతీయులే దక్కించుకుంటున్నారు. ఈ ఏడాది హెచ్1బీ వీసా కోసం 2,75,000 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 67 శాతం దరఖాస్తులు భారతీయులవే కావడం విశేషం. 

Advertisement
Advertisement
Advertisement