Abn logo
May 21 2020 @ 00:35AM

ఆపన్నుల కోసమేనా ‘పిఎం కేర్స్‌’?

కరోనా బాధితుల సహాయార్థం మార్చి 28న ప్రధాని ఓ కొత్త నిధిని ఏర్పరిచారు. ప్రధాని రక్షిస్తారు అన్న అర్థం వచ్చేట్లుగా ‘పిఎం కేర్స్’ అనే సంక్షిప్త నామకరణం చేశారు. దేశవిభజన శరణార్థుల సహాయార్థం నెహ్రూ 1948 జనవరిలో ‘ప్రధాని జాతీయ ఉపశమన నిధి (పిఎం.ఎన్.ఆర్.ఎఫ్.) ఏర్పరిచారు. దీన్ని ప్రకృతి విపత్తుల, ఘోర ప్రమాదాల, ఆందోళనల, మహిళా బాధితుల సహాయానికి వినియోగిస్తున్నారు. ఈ నిధి చందాలకు ఆదాయపన్ను రాయితీ ఉంది. ప్రభుత్వరంగ సంస్థల నుండి దీనికి చందాలు స్వీకరించరు. గత ఐదేళ్లలో ఈ నిధి విరాళాలు రూ.2,119 కోట్లు. ఖర్చు రూ.1,594.87 కోట్లు. బిజెపి పాలనలో ఈ నిధి వసూళ్లు అత్యధికం, ఖర్చు అత్యల్పం. డిసెంబర్ 2019 నాటికి ఇందులో రూ.3,800 కోట్లు ఉంది. అందుకే, కొత్త నిధి అవసరమేమిటని పూర్వ కేంద్ర సమాచార కమిషనర్ శైలేశ్ గాంధీ ప్రశ్నించారు.


కరోనా కట్టడికి, భవిష్యత్తు విశ్వమారుల నిరోధానికి ఏర్పరిచిన పిఎం కేర్స్‌కు ప్రధాని అధ్యక్షుడు. రక్షణ, గృహ, ఆర్థిక మంత్రులు సభ్యులు. పరిశోధన, ఆరోగ్య, విజ్ఞానశాస్త్ర, సాంఘికసేవ, శాసన, ప్రజాపాలన, దాతృత్వ రంగాల నుండి ముగ్గురు ధర్మకర్తలను నియమించే అధికారం ఆయనకు ఉన్నా ఇంకా యోగ్యసభ్యులు దొరకలేదు. అలవాటుగానే ఇందులో ప్రతిపక్షాలు, పౌరసంఘాలను పక్కన పెట్టారు. మోదీ నిధి చందాలకు ఆదాయపన్ను మినహాయింపుతో పాటు, కార్పొరేట్ సామాజిక బాధ్యతల ఖర్చు కింద లెక్కవేస్తారు. ఇది ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకం. ఈ పద్దు కింద ఇచ్చిన విరాళాలకు కార్పొరేట్లు రెట్టింపు ‘పన్ను ప్రోత్సాహకాలు’ పొందుతారు. కొత్త నిధికి విదేశీ చందాల క్రమబద్ధీకరణ చట్ట మినహాయింపు కూడా ఉంది. వాటికి ప్రత్యేక ఖాతా తెరిచారు. మోదీ ప్రభుత్వం కేరళ వరదల్లో విదేశీ సహాయాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. మొదటి వారంలోనే పీఎం కేర్స్‌కు రూ.6,500 కోట్లు అందాయి. తర్వాత ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలు, సైన్యంతో సహా లక్షలాది ఉద్యోగులు, పింఛనుదార్లు విరాళాలిచ్చారు. కొన్ని సంస్థల నిధులు అనుమతి లేకుండానే బదిలీచేశారు. రక్షణశాఖ నుండి రూ.500 కోట్లు, టాటా, రిలయన్స్‌ల నుండి రూ.500 కోట్ల చొప్పున అందాయి. రైల్వే ఉద్యోగులు రూ.151 కోట్లు ఇచ్చారు. కానీ, ఈ శాఖ వలస కార్మికుల రైల్ ఛార్జీలు భరించదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు మార్చ్, 2021 వరకు ప్రతి నెల ఒక రోజు వేతనం తప్పనిసరిగా ఈ నిధికి ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టిన కంపెనీలు పీఎం కేర్స్‌కు కోట్లు ధారపోసి పాలకుల కరుణాకటాక్షం పొందాయి. చందాల వివరాలు తెలపడానికి ప్రధాని కార్యాలయం తిరస్కరించింది. ఈ నిధి కాగ్‌ తనిఖీ కింద లేదు. ధర్మకర్తలు నియమించిన స్వతంత్ర ఆడిటర్లు ఈ నిధి తనిఖీ చేస్తారని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ నిధులను కాగ్‌ తనిఖీ నుండి తప్పించటం రాజ్యాంగవిరుద్ధం. ప్రభుత్వ సంస్థల నిధులు, పార్లమెంటు సభ్యుల ప్రాంతీయ అభివృద్ధి నిధులను ఈ పీఎం కేర్స్‌కు మరలించారు. కాగ్‌ తనిఖీ లేని ఈ నిధిలో ప్రభుత్వ (ప్రజల) సొమ్ము, భారత ప్రభుత్వ ఏకీకృత నిధుల దురుపయోగం జరుగుతుంది. ప్రాంతీయ అభివృద్ధి కుంటుపడుతుంది.


రాజులు గత రాచరిక గుర్తులను రూపుమాపుతారు. ముందుతరం పాలకులు చరిత్రహీనులనీ, వారి పనులు పనికిమాలినవనీ రుజువుచేయటానికి చరిత్రను వక్రీకరిస్తారు. నెహ్రూ పట్ల నేటి పాలకుల ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన ఆరంభించిన పిఎం.ఎన్.ఆర్.ఎఫ్.ను పక్కనపెట్టడంలో రాజకీయం ఇదే. ఇక, స్వావలంబన భారత్ గురించి ప్రధాని ఇటీవల గొప్పగా చెప్పారు. మన తయారీలు స్థానికం నుండి జాతీయానికి, జాతీయం నుండి అంతర్జాతీయానికి ఎదగాలన్నారు. కపూర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీ వెంటీలేటర్లను రూ.10 వేలకు, ఐఐటి రూర్కీ డిజిటల్ వెంటీలేటర్లను రూ.25 వేలకు, బెంగళూరు డైనమిక్ టెక్నాలజీస్ విద్యుత్తు లేకుండా పనిచేసే వెంటిలేటర్లను రూ.2,500లకే సరఫరా చేస్తామన్నాయి. మోదీ ప్రభుత్వం వీటికి జవాబివ్వకుండా రూ.4లక్షల చొప్పున 50,000 స్వదేశీ వెంటీలేటర్లను రూ.2,000కోట్లు పెట్టి కొన్నది. కరోనా దెబ్బకు కుదేలైన అనేక రంగాలను, మరీ ముఖ్యంగా వలస కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, రైతులు ఇత్యాది వర్గాలను ఆదుకోవడానికి వేలకోట్ల పీఎం కేర్స్‌ నిధిని ఎందుకు వాడటం లేదు?

సంగిరెడ్డి హనుమంత రెడ్డి

Advertisement
Advertisement
Advertisement