Abn logo
May 4 2021 @ 12:35PM

దేశంలో ఆక్సిజన్ కొరత.. కానీ కేరళలో మాత్రం సీన్ రివర్స్.. ఇంతకీ అక్కడేం జరుగుతోందంటే..

ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా కరోనా కేసులు, కరోనా మరణాలు, శవాల దిబ్బలు, ఆస్పత్రి బెడ్ల కోసం గొడవలు, ఆక్సిజన్ కోసం పడిగాపులు.. ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరికైనా కరోనా వచ్చిందంటే చాలు ఇంటి యజమానులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ బలవంతం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేక రోడ్ల పక్కన షెడ్లు వేసుకొని కొందరు పేషెంట్లు తలదాచుకుంటుంటే.. మరి కొందరు అంబులెన్సుల్లోనే ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. ఆక్సిజన్ అందక ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశరాజధాని ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. మహారాష్ట్రలో కనిపించే దృశ్యాలు మరింత ఘోరంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా ఆక్సిజన్ కావాలంటూ విదేశాలకు అభ్యర్థనలు చేస్తోంది. అలాంటిది మన దేశంలో ఒక రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రమే కేరళ. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అక్కడి మలయాళీ కమ్యూనిటీ అభ్యర్థన మేరకు ఢిల్లీకి కూడా ఆక్సిజన్ సరఫరా చేయడానికి కేరళ అంగీకరించింది.


దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో కొట్టుమిట్టాడుతుంటే కేరళ మాత్రం ఇలా ఆక్సిజన్ సప్లై చేసే స్థాయిలో ఎలా ఉంది? ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇక్కడేమైనా కరోనా కేసులు తక్కువా? అంటే అదేం లేదు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ నాలుగో స్థానంలో ఉంది. దీనికన్నా ముందు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాల్లా ఆక్సిజన్ కోసం కేరళ అల్లాడటం లేదు. దీనంతటికీ బీజాలు గతేడాది పడ్డాయి. గతేడాది దేశంలో కరోనా తొలికేసు వెలుగు చూసింది కేరళలోనే. వూహాన్ నుంచి తిరిగొచ్చిన ఒక కేరళ వాసి కరోనా పాజిటివ్‌గా తేలాడు.

గతేడాది రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరగొచ్చని ఈ టాస్క్‌ఫోర్స్ అంచనా వేసింది. అయితే దీనికంటే ముందే పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో).. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టింది. ఆక్సిజన్ ఉత్పత్తిచేసే పరిశ్రమలన్నింటికీ పెసో లేఖలు రాసింది. ప్రాణవాయువు ఉత్పత్తిని పెంచాలని ఆ లేఖల్లో సూచనలు చేసింది. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తికి నూతన ప్లాంట్ల ఏర్పాటు జరిగింది.


అలాగే 2020 మార్చిలో ఆక్సిజన్ ఉత్పత్తి దారులతో పెసో సమావేశమైంది. ఆ సమావేశంలో  రాష్ట్రంలో రోజూ ఎంత ప్రాణవాయువు ఉత్పత్తి జరుగుతోంది? ఎంత వాడుకుంటున్నాం? వంటి వివరాలన్ని ప్రభుత్వానికి అందజేయాలని కోరింది. అలాగే ఆస్పత్రుల్లో ప్లగ్గింగ్ లీకులు, ఆక్సిజన్ వృధాను పరిశీలించేందుకు తనిఖీలు జరిగాయి. ఇలా గతేడాదే ఆక్సిజన్‌పై కేరళ దృష్టి పెట్టింది. కేరళలో ఆక్సిజన్ ఉత్పత్తి గతేడాదిలోనే 60 శాతం పెరిగినట్లు అంచనా. ఇలాంటి చర్యలు తీసుకుంది కాబట్టే కరోనా సెకండ్ వేవ్‌ను కూడా ఈ రాష్ట్రం సులభంగా ఎదుర్కొంటోంది. ఇంతా ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. కేరళలో ప్రస్తుతం 23 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఏదీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదట.

గతేడాది రాష్ట్ర ఆక్సిజన్ అవసరాలు తీర్చడమే కష్టంగా భావించిన కేరళ.. ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఆక్సిజన్ అందే స్థాయికి ఎదగడం నిజంగా ఊహకందని విషయమే. ఇక్కడ రోజుకు 200 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తిని మరింత పెంచే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని పెసో అధికారులు వెల్లడించారు. ‘‘మేం ఆక్సిజన్ ఉత్పత్తిని ఇంకా పెంచగలం. అవసరాన్ని బట్టి దీన్ని పెంచుతాం. రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నాం’’ అని పెసో నోడల్ అధికారి ఆర్ వేణుగోపాల్ వివరించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కరోనా కేసులు మరింత భారీగా నమోదవుతున్నాయి. అయినా సరే మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ పరిస్థితి అంత భయంకరంగా లేదు.


కరోనా సెకండ్ వేవ్‌ను కేరళ ఇలా దీటుగా ఎదుర్కోవడానికి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం ఒక్కటే కారణం కాదు. గతేడాది కరోనా విపత్తు నుంచి పాఠాలు నేర్చుకున్న కేరళ.. కరోనా ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లకు ఆక్సిజన్ సప్లైను పెంచింది. ప్రస్తుతం కేరళలోని మెడికల్ కాలేజిలు, ఆస్పత్రుల్లోని అధికశాత బెడ్లకు ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం ఉంది. అలాగే కేరళకు కలిసొచ్చిన మరో అంశం ఆశా విధానం. పంచాయతి స్థాయిలో ఉన్న ఆశా వర్కర్లు స్థానికుల్లో ఎవరిలోనైనా చిన్నపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపించినా సరే వెంటనే కరోనా టెస్టులు చేయిస్తున్నారు. కరోనాను ముందుగా గుర్తించడం వల్ల ఆక్సిజన్ వాడకం, పేషెంట్ల నిర్వహణ సులభతరం అవుతుంది. అందుకే ఎలక్షన్ల తర్వాత కరోనా కేసులు పెరుగుతున్నా కూడా కర్ణాటక, తమిళనాడు, గోవా, ఢిల్లీ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుండటం విశేషం.

Advertisement
Advertisement
Advertisement