Oct 14 2021 @ 20:21PM

హిమ్మత్ సింగ్ RAW ఏజెంట్‌గా ఎందుకు మారాడు ?

కరోనా కేసులు ఇప్పటికి తగ్గకపోవడంతో  థియేటర్లకు రావడానికి ఎవరూ కూడా ఆసక్తి చూపడం లేదు. వినోదాన్ని కోరుకునే వారు ఓటీటీ వేదికలనే ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు వెబ్ సిరీస్‌ల వైపు కన్నెత్తి చూడని వారు కూడా ప్రస్తుతం వాటిని చూడటానికి ఇష్టపడుతున్నారు. గత ఏడాది ‘‘ స్కామ్ 1992: హర్షద్ మెహతా స్టోరీ’’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. అంతటి ఘన విజయాన్ని సాధించిన  మరో వెబ్ సిరీస్ ‘‘ స్పెషల్ ఆప్స్ ’’.  ఆ సిరీస్ విజయం సాధించడంతో దీనిని కొనసాగిస్తామని  నిర్మాతలు గతంలోనే చెప్పారు. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. స్పెషల్ ఆప్స్‌కు ఫ్రీక్వెల్‌గా స్పెషల్ ఆప్స్ 1.5 తెరకెక్కిందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.    


స్పెషల్ ఆప్స్‌లో కేకే.మీనన్ కీలక పాత్రలో నటించారు. హిమ్మత్ సింగ్ అనే పాత్రలో ప్రేక్షకులకు ఆయన కనిపించారు. RAW(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రను ఆ సిరీస్‌లో పోషించారు. తాజాగా ఆ పాత్రను కొనసాగిస్తూ ‘‘ స్పెషల్ ఆప్స్ 1.5: హిమ్మత్ స్టోరీ’’ అనే టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్ 2001 బ్యాక్ డ్రాప్‌లో   కొనసాగుతుంది.  హిమ్మత్ ఎందుకు  RAW ఏజెంట్‌గా  మారాడు. అతడి జీవితంలో చోటుచేసుకున్న ఎటువంటి సంఘటనల వల్ల ఏజెంట్ గా మారాల్సి వచ్చిందనేది వివరిచంబోతున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఆప్స్ సిరీస్‌ లో గౌతమి కపూర్, వినయ్ పాఠక్, పర్మీత్ సేథీ, కేపీ. ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్పెషల్ ఆప్స్ 1.5లో అఫ్తాబ్ శివదాసానీ, అదిల్ ఖాన్ కొత్తగా చేరారు. 

 

స్పెషల్ ఆప్స్ వెబ్ సిరీస్ అనేది భారత్‌లో చోటుచేసుకున్న ఐదు ఉగ్రవాద దాడులను లింక్ చేస్తూ కొనసాగుతుంది. ఆ ఐదు ఉగ్రవాద దాడుల వెనుక ఇక్లాక్ ఖాన్ అనే వ్యక్తి    ఉన్నాడని హిమ్మత్‌కు తెలుస్తోంది. ఇక్లాక్‌ను ప్రత్యక్షంగా చూసినా, కలిసినా వ్యక్తి ఎవరూ ఉండరు. ఇక్లాక్ అనే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న చుట్టే స్పెషల్ ఆప్స్ వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. రాబోయే వెబ్ సిరీస్‌లో అటువంటి ఆసక్తికర ప్రశ్నలను కొనసాగిస్తారా అంటే స్పెషల్ 1.5 విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.  డిస్నీ+హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. బేబీ, స్పెషల్ 26, ఎమ్ఎస్. ధోని అన్ టోల్డ్ స్టోరీ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే ఈ సిరీస్‌లను డైరెక్షన్ చేస్తున్నారు. 



Bollywoodమరిన్ని...