Advertisement
Advertisement
Abn logo
Advertisement

చైనా డిమాండ్లకు తలొగ్గిన యాపిల్.. ఏకంగా సీఈవో టిమ్ కుక్ వెళ్లి మరీ రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం వెనుక..

యాపిల్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికాలో పుట్టిన ఈ సంస్థ.. దినాదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ప్రపంచంలోని నలుమూలలకూ సంస్థ ఉత్పత్తులను విస్తరించింది. అంతటి ఖ్యాతి గడించిన యాపిల్ కంపెనీ.. చైనా డిమాండ్లకు తలొగ్గిందట. ఏకంగా ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్.. చైనా వెళ్లి, అక్కడ రూ.20లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం.. సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళితే...

యాపిల్‌ సంస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త విక్రయాల్లో ఐదో వంతు వాటా చైనాదే ఉంది. ఈ క్రమంలో 2016లో నియంత్రణా చర్యల పేరుతో యాపిల్‌ సంస్థపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో యాపిల్ వ్యాపారం చాలా వరకు దెబ్బతింది. దీంతో రంగంలోకి దిగిన సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌.. వెంటనే బీజింగ్‌కు బయలుదేరారని సమాచారం. ఈ సందర్భంగా చైనా ద్వారా యాపిల్ సంస్థకు వచ్చే లాభాల అంశాన్ని అక్కడి అధికారులు.. టిమ్‌ కుక్ దృష్టికి తెచ్చారట. తమ దేశం ద్వారా లాభాలు ఆర్జిస్తున్న యాపిల్ సంస్థ.. చైనా అభివృద్ధికి మాత్రం సహకరించడం లేదని గుర్తు చేశారట. ఈ అంశాన్ని యాపిల్ సంస్థ అధికారికంగా ప్రకటించకున్నా.. పలు అంతర్జాతీయ మీడియాల్లో మాత్రం కథనాలు ప్రచురితమయ్యాయి.

చైనా డిమాండ్లకు దిగొచ్చిన యాపిల్ సంస్థ.. ఐదేళ్లకు గానూ 275 బిలియన్‌ డాలర్ల (రూ.20 లక్షల కోట్లు) ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. తద్వారా చైనాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు యాపిల్ సంస్థ సీఈవో టిమ్‌ కుక్ అంగీకరించారట. యాపిల్‌ పరికరాలకు కావాల్సిన విడిభాగాలను చైనా సరఫరాదారుల నుంచి మరింత ఎక్కువగా కొనుగోలు చేయడం, ఉద్యోగులకు నాణ్యమైన శిక్షణను అందించడం, చైనా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేయడం, చైనాలో గతంలో ఉన్న యాపిల్ పెట్టుబడులను మరింత పెంచడం, కొత్తగా రిటైల్‌ స్టోర్లు, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం, చైనా 13వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలకు తోడ్పాటు అందించడం వంటి అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలోని చాలా అంశాలను యాపిల్‌ ఇప్పటికే అమలు చేసినట్లు తెలుస్తోంది.

పవన విద్యుత్‌కు సంబంధించి షింజియాంగ్‌ గోల్డ్‌విండ్‌ అనే కంపెనీతో 2016లో యాపిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఐక్లౌడ్‌ కార్యకలాపాలన్నింటినీ చైనాకు మార్చేలా 2017లో ప్రణాళికలను సిద్ధం చేశారు. అదేవిధంగా చైనాలో స్వచ్ఛ ఇంధన రంగంలో 300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇదిలావుండగా యాపిల్ వాచ్‌ల విక్రయాలకు చైనాలో అనుమతి ఇవ్వడానికి.. మరో కండీషన్ కూడా పెట్టారట. చైనా, జపాన్ దేశాలు.. తమవే అంటూ ప్రకటించుకుంటున్న పలు దీవులను, యాపిల్ మ్యాప్‌లో పెద్దవిగా చూపించాలని నిబంధన పెట్టారట. తమ సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగాలనే ఉద్దేశంతో అన్ని డిమాండ్లకు.. యూపిల్ సీఈవో అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement