Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆకలి వేస్తేనే తినాలా? ఆకలితో సంబంధం లేకుండా తినాలా? ఏది మంచిది..

ఆంధ్రజ్యోతి(19-11-2021)

ప్రశ్న: కొందరు ఆకలి వేస్తేనే తినాలి అంటారు... మరికొందరు సమయానికి ఆకలితో సంబంధం లేకుండా తినాలి అంటారు. ఏది ఆరోగ్యానికి సరైన విధానం? 


- హరనాథ్‌ బాబు, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: మన శరీరానికి అవసరమైన శక్తి లేదా కెలోరీలను అందించేందుకు ఎంత ఆహారం, ఏ సమయాల్లో కావాలో తెలియచేసేందుకు కొన్ని హార్మోనులు పని చేస్తాయి. ఇవే మన ఆహార పరిమాణాన్ని నియంత్రిస్తాయి. వీటిని హంగర్‌ (ఆకలి) హార్మోన్స్‌ అంటారు. సాధారణంగా ఆరోగ్యవంతులు, సక్రమమైన జీవన విధానం ఉన్న వారిలో ఈ హార్మోనుల పనితీరు బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది సమయానికి తినడం లేదు. ఆకలిని గుర్తించకుండా అధికంగా ఆహారం తీసుకుంటున్నారు. నిద్రను అశ్రద్ధ చేయడం, శారీరక శ్రమ లేక పోవడం, థైరాయిడ్‌, ఇన్సులిన్‌, మొదలైన హార్మోనుల అసమతుల్యత తదితర కారణాల వల్ల ఆకలిని నియంత్రించే హార్మోనుల పని తీరు కూడా మారిపోతోంది. ఈ ఆకలి హార్మోనుల పని తీరును మెరుగు పరిస్తే సమయానికి ఆకలి వేయడం, తగినంత ఆహారం తీసుకోగానే ఆకలి తగ్గిపోవడం, తృప్తి చెందడం లాంటివి సహజంగా జరుగుతాయి. హంగర్‌ హార్మోనులైన లెప్టిన్‌, ఘ్రెలిన్‌ల పని తీరు సరిగా ఉండేందుకు ఆహారంలో ప్రొటీన్‌ తగినంత తీసుకోవాలి. శారీరక శ్రమ లేదా వ్యాయామం తప్పని సరి. ఆందోళన తగ్గించుకోవాలి. తగినంత నిద్ర అవసరం. మంచి కొవ్వులను అందించే బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు తీసుకోవాలి. ఆ హార్మోనులు మెరుగయ్యే వరకు ఆకలి వేసినప్పుడు ముందుగా కొంచెం నీళ్లు తాగి ఆ తరువాతే ఆహారం తినడం, తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం లాంటివి చేయవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...