Abn logo
Sep 27 2021 @ 00:01AM

మార్పు ఎప్పుడో?

కొత్త కేబినెట్‌లో ఎవరు 

బాలినేని ప్రకటనతో వైసీపీలో ప్రకంపనలు 

జిల్లాలో ఎవరికి అవకాశం అనే అంశంపై చర్చలు

పావులు కదుపుతున్న ఆశావహులు 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్ర మంత్రివర్గంలో చేర్పులు, మార్పులపై జిల్లాకు చెందిన మంత్రి బాలినేని చేసిన ప్రకటన వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది. అవునా.. ఇది నిజమేనా! బాలినేనిని కూడా తప్పిస్తే జిల్లాలో మంత్రిగా ఎవరికి ఛాన్స్‌ వస్తుంది.. అంటూ వైసీపీ నాయకులు అంచనాలు వేయడం ప్రారంభించారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలలో పలువురు ఆశావహులు మంత్రి పదవి కోసం పావులు కదపడం ఆరంభించారు. ఇవన్నీ ఇలా ఉంటే మంత్రివర్గంలో చేర్పులు, మార్పులు ఎప్పుడు ఉంటాయి?  బాలినేని ఈ విషయాన్ని బయటపెట్టడంలోని ఆంతర్యం ఏమిటి? అన్న అంశం కూడా చర్చనీయాంశమైంది.  

మాజీలయ్యే వారికి పార్టీ బాధ్యతలు 

రాష్ట్ర మంత్రివర్గం మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రక్షాళన చేయబోతున్నారని అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజానికి జగన్‌ మంత్రివర్గ ఏర్పాటు రోజే రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రస్తుత మంత్రులలో 90 శాతం మందిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తామని, మాజీలు పార్టీ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం మంత్రులను తొలగించబోతున్నారు. అదే జరిగితే జిల్లాలో ఇప్పటివరకు మంత్రులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు మాజీలవుతారు. వీరిలో మంత్రి బాలినేనికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రీజియన్‌ పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తున్నారు. మరోమంత్రి ఆదిమూలపు సురేష్‌కి ఇతరత్రా ఏవైనా బాధ్యతలు అప్పగిస్తారా లేక ఎమ్మెల్యే పదవికే పరిమితం చేస్తారా అనేది చూడాల్సి ఉంది. 

కొత్తమంత్రి ఎవరు ? 

జిల్లాలో వైసీపీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో ప్రస్తుత మంత్రులు బాలినేని, సురేష్‌లను పక్కనబెడితే ఇక మిగిలింది ఏడుగురు. వీరిలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కి ఇటీవల టీటీడీ పాలకమండలి సభ్యత్వాన్ని ఇచ్చారు. దీంతో కొత్తగా ఏర్పడే మంత్రివర్గంలో ఆయన పేరు పరిశీలనకు రాకపోవచ్చని భావిస్తున్నారు. మిగిలిన వారిలో సీనియర్‌ అయిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఏడాది క్రితం టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అంతేగాక ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ సామాజికవర్గం నుంచి ఒకరికే అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అంతకుమించి ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపించటం లేదు. అందువలన బలరాం పేరును పరిశీలనలోకి తీసుకోకపోవచ్చనే భావనే ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఆ తర్వాత కందుకూరు ఎమ్మెల్యే మహీధరరెడ్డి సీనియర్‌. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే పార్టీ నాయకత్వంతో చివరికి ముఖ్యమంత్రితో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవనే వాదన అధికంగా ఉంది.  గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలలో ఎవరికి అవకాశం లభిస్తుందన్న అంశం వైసీపీ నేతల్లో చర్చనీయాంశమైంది. తొలిసారి గెలుపొందిన మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం నుంచి అధికమంది పోటీలో ఉండటం సమస్యయ్యే అవకాశం లేకపోలేదు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇప్పటికే మంత్రి పదవిని దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతున్నట్లు సమాచారం. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తొలినుంచి సీఎం, ఇతర రాష్ట్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల గ్రేటర్‌ రాయలసీమ పేరుతో ఆరు జిల్లాల కాపు సామాజికవర్గ నాయకులను సమీకరించటం లాంటి కార్యక్రమంలో ముందున్నారు. సామాజికవర్గంతోపాటు తనకున్న విద్యార్హతలు, స్థానిక పరిస్థితులు కలిసొస్తాయని భావిస్తున్నట్లు తెలిసింది. ఇంకోవైపు సంతనూతలపాడు శాసనసభ్యుడు సుధాకర్‌బాబు దళిత సామాజికవర్గం కోటాలో అవకాశం కోసం వేచి ఉన్నారు. పార్టీలో అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందిన ఆయన నియోజకవర్గంలో ఎలా ఉన్నా రాష్ట్ర నాయకులతో సన్నిహిత సంబంధాలతో కొనసాగుతున్నారు. ఇలా ఎవరికి వారు వారివారి కోణ ంలో ఆలోచించుకుని పావులు కదుపుతున్నారు.  

ఇంతకీ విస్తరణ  ఎప్పుడు? 

మంత్రివర్గంలో చేర్పులు, మార్పులకు సీఎం జగన్‌ ఎప్పుడు శ్రీకారం పలకవచ్చన్న విషయంలో కూడా స్పష్టత లేదు. వచ్చే నెలలో  దసరా సందర్భంగా జరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అప్పుడు ఉండదని, సంక్రాంతికి కావచ్చని మరికొందరు అంటున్నారు. అయితే అందిన సమాచారం మేరకు మంత్రివర్గంలోని పలువురు ఇచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులతో సీఎం జగన్‌ వచ్చే సంవత్సరం మార్చి లేక మే వరకూ ఈ మంత్రివర్గాన్ని కొనసాగించవచ్చని తెలుస్తోంది. అయితే జగన్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని చెప్పలేమని మంత్రివర్గంలో చేర్పులు, మార్పులు ఏక్షణంలోనైనా జరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.