Abn logo
Aug 7 2020 @ 00:24AM

తరువాత ఏమిటి?

నరేంద్రమోదీ తన విజయప్రస్థానంలో సమకూర్చుకున్న ప్రతిష్ఠ, బుధవారం నాటి అయోధ్య కార్యక్రమంతో మరింత పెరిగింది. మోదీ అంటే అదీ, అనుకున్నది సాధిస్తాడు- అన్న ప్రశంస ఆయన అభిమానుల నోట, విముఖుల నోట కూడా వినిపించింది. రెండవ దఫా మరింత బలంతో అధికారం చేపట్టిన నరేంద్రుడు, రాగానే కశ్మీర్ ప్రతిపత్తి మీద దృష్టి పెట్టారు. గత ఏడాది ఆగస్టు 5వ తేదీనాడే జమ్మూకశ్మీర్ ప్రత్యేకత, సమగ్రత కూడా సమసిపోయాయి. రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజితం కావడంతో పాటు, ఆర్టికల్ 370 నిర్వీర్యం అయింది. ఏడాది కాలంగా కశ్మీరీ ప్రజలు తీవ్రమయిన కట్టడుల మధ్య, దిగ్బంధాల నడుమ జీవిస్తున్నారు. కానీ, దాదాపు తక్కిన భారతం అంతా, ఎవరో కొందరు మినహాయించి, గత ఏడాది ఆగస్టు 5 చర్యలతో అఖండభారత్ లక్ష్యం సిద్ధించిందని, ఒక సమస్యను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందని సంతోషించారు.


దేశభక్తికి ఫలసిద్ధి దొరికిందని పరవశించిపోయారు. ఈ ఏడాది, ఈ కరోనా సంక్షోభ సమయం నడుమ, అదే తేదీన జరిగిన రామాలయ భూమి పూజ- దేశవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆనందం కలిగించింది. రామాలయ నిర్మాణం వాస్తవ రూపం ధరించడానికి దారితీసిన పరిస్థితులను, వాటిలోని అవాంఛనీయ ధోరణులను వ్యతిరేకించే హిందువులలో కూడా కొందరు బుధవారం నాటి వేడుకకు సంబరపడ్డారు. అందుకు నరేంద్రమోదీ లక్ష్యశుద్ధిని ప్రశంసించారు. ఈ సానుకూల అభిప్రాయాలన్నీ రాజకీయంగా కూడా సానుకూలతలోకి అనువదితమవుతాయా అన్నది చూడాలి. రామభక్తికి, దేశభక్తికి నడుమ సున్నితమైన రేఖ కూడా తొలగిపోతున్న వేళ, అధిక సంఖ్యాకులైన సామాన్యులకు అంత స్పష్టత ఉండదు. దేశస్వాతంత్ర్య పోరాటంతో, రామజన్మభూమి ప్రయత్నాన్ని పోల్చి మాట్లాడినప్పుడు, తానొక సాహసోపేతమైన వ్యాఖ్య చేస్తున్న సంశయం ఏదీ మోదీ గొంతులో పలకలేదు. అటువంటి మాటలకు చెల్లుబాటు వచ్చిందన్న ధీమా మాత్రమే ధ్వనించింది. 


రామాలయం నిర్మాణ కీర్తిలో తమకూ వాటా ఉందని బేలగా, హాస్యాస్పదంగా అర్థిస్తున్న రాజీవ్ గాంధీ సంతానాన్ని చూసి, ఆగస్టు 5 ఘటనలు వాటి పర్యవసానాలకు ప్రాణభయంతో, ఉనికి భయంతో వణికిపోతున్నవారికి ఎటువంటి భరోసా దొరకదు. భయపడే వారు మాత్రమే కాదు, పోరాడేవారు, పోరాడవలసిన వాళ్లు, మరో గత్యంతరం లేనివాళ్లు- వీరందరూ రేపటి గురించి ఆలోచించవలసిందే. ‘‘అన్నిటికీ ఒకే పద్ధతి అవసరం పడదు, ఇటువంటి వాతావరణంలో ఇతర సమస్యల పరిష్కారం సులభసాధ్యం అవుతుంది’-’– కాశీ, మధుర వివాదాల విషయంలో కూడా ఇదే క్రమం ఉంటుందా అని అడిగినప్పుడు, సంఘ్ ప్రముఖుడు ఒకరు అట్లా సమాధానమిచ్చారట. ఇప్పుడు వారణాసి, మధుర సమస్యలు కావు. వాటికి ముప్పైఐదేళ్ల పోరాటమూ లిటిగేషనూ అవసరమే పడదు. ఇటువంటి వివాదాలను, వాటి పరిష్కారాలకు జరిగే ప్రయత్నాలను సక్రమంగా అర్థం చేసుకోవాలి. రాముడికి జన్మభూమి ఆలయం కావాలి, ప్రజలలోకి ఆ నినాదం వెళ్లింది, ప్రజలు దాన్ని కోరుకున్నారు. కానీ, ఆ నినాదాన్ని ముందుకు తెచ్చినవారికి వివాదం ఒక సాధనం. అది వారికి అధికారాన్ని ఇచ్చింది. ప్రజలకు ఆలయాన్ని ఇచ్చింది. ఆలయసాధన వల్ల అధికారం రెట్టింపు అవుతుంది. ఇప్పుడిక అధికారం కోసం ఉద్యమాలు అవసరం లేదు. అధికారమే తనను తాను దృఢపరుచుకుంటూ తక్కిన లక్ష్యాలను కూడా నెరవేరుస్తుంది. 2014 ఎన్నికల్లో అయితే, భారతీయ జనతాపార్టీ రామజన్మభూమి, 370, పౌరస్మృతి వంటి నినాదాల మీద దృష్టి పెట్టలేదు. 2019 ఎన్నికల్లో సైతం నినాదాలు అవి కావు. కానీ, ఆ మూడింటిలో రెండు నెరవేరాయి. మిగిలింది- ఉమ్మడి పౌరస్మృతి. బహుశా, దీనికి బలహీనపు మూలుగుల నిరసనలు కూడా వినిపించవు. అసమ్మతి వినిపించకపోవడమే అధికారపు ఆనవాలు. పౌరసత్వ చట్టం మాత్రం కరోనా ముగిశాక, క్షణమైనా ఆగుతుందా? 


అధికారపార్టీ నిర్దాక్షిణ్యాన్నో, నిరంకుశత్వాన్నో లేదా అధికార వైభవాన్నో చెప్పుకుంటున్నామంటే, ఎదురునిలబడతామని నమ్మించి నీరసించిన ప్రతిపక్షాల గురించి, శక్తి చాలకపోయినా సాహసించి చెరసాలల్లో మగ్గే సామాజిక శక్తుల గురించి వాటి భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకోవాలి. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని యాభై సంవత్సరాల పాటు పాలించిన పార్టీ అధోగతిలో ఉన్నది. కాంగ్రెస్ కుంభస్థలాన్ని మొదటగా ఢీకొన్న ప్రాంతీయ శక్తులు కూడా కునారిల్లుతున్నాయి, అవకాశవాదంతో కుళ్లిపోతున్నాయి. వాటికి రోజులు దగ్గరపడుతున్నాయి. మధ్యేవాద పార్టీలలో వామపక్షంలాగా అభినయిస్తూ సామాజికన్యాయం కోసం పోరాడగలమని మొదలయిన పార్టీలు అవినీతి దుర్గంధంలో కూరుకుపోయి, లోహియాను జయప్రకాశ్ నారాయణ్‌ను మరచిపోయాయి. చైనాలో సోషలిజాన్ని, ఆర్థిక సంస్కరణల్లో మంచిని, మతాచారాల్లో సానుకూలతను వెదుక్కుంటూ దారి మరచిపోయారు కమ్యూనిస్టులు. ఎవరు వస్తారు కనీసం ‘మరో’ మాట మాట్లాడేవాళ్లు? వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకోవడం పేరిట- ఎంత మంది వివేకులు ఇప్పుడిక మౌనులవుతారో, ఆవలివైపుకు జారిపోతారో?


రాజకీయాలంటే, ఎన్నికలలో పోటీపడేవాళ్ల చేష్టలు మాత్రమే కాదు. ప్రజలు ఎక్కడికక్కడ తమకు తాము ప్రాతినిధ్యం వహించుకుని చేసే చర్యలన్నీ రాజకీయాలే, మార్పు కోసం జరిగే ప్రతి ప్రయత్నమూ రాజకీయమే. దేశంలో అటువంటి ప్రయత్నాలకు కొదవలేదు. ఆ ప్రయత్నాల సాధకులలో సాహసానికీ త్యాగానికీ కూడా లోటు లేదు. కావలసిందల్లా, చెల్లాచెదురుగా, ద్వీపద్వీపాలుగా ఉన్న ప్రయత్నాలన్నిటి మధ్య ఒక సంభాషణ కావాలి. ఓపిక కావాలి. ఇటుక ఇటుక పేర్చాలి. ప్రజలలో ఉన్న యథాతథ విలువలను, భావోద్వేగాలను ఉపయోగించుకుని, ప్రశ్నార్థకమైన పద్ధతులలో లక్ష్యం సాధించారన్నమాట వాస్తవమే కావచ్చును కానీ, రామజన్మభూమి కోసం సాగిన ప్రయత్నంలో 


ఫలితం కోసం నిరీక్షించగలిగిన ఓపిక ఉన్నది. మనుషుల భావాలను ప్రభావితం చేస్తూ వచ్చిన ఒక నిరంతర కృషి ఉన్నది. వారిని అనుకరించడానికి కాదుకానీ, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవడానికి ఒక తులనాత్మక సమీక్ష అవసరం.

Advertisement
Advertisement
Advertisement