Abn logo
Aug 6 2021 @ 12:54PM

బార్లీ ఉపయోగాలేమిటి?

ఆంధ్రజ్యోతి(06-08-2021)

ప్రశ్న: జావ అనగానే బార్లీనే గుర్తుకువస్తుంది. బార్లీ పోషక విలువలు తెలియజేస్తారా?


- శ్రావణి, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: బార్లీ గింజలలో చాలా పోషకపదార్థాలు ఉంటాయి. 100గ్రా ఉడికించని బార్లీలో 350 కెలరీలు, 75గ్రాముల పిండిపదార్థాలు, 13గ్రా ప్రొటీన్లు, 17గ్రా పీచుపదార్థాలు, కేవలం 2గ్రాముల కొవ్వులు ఉంటాయి. మన శరీరానికి శక్తిని అందించే బి విటమిన్లు, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, సెలీనియం లాంటి ఖనిజాలు కూడా ఎక్కువే. బార్లీని నీళ్లలో ఉడికించి జావగాకాస్తే, గింజలలోని కొన్ని పోషకపదార్థాలు ఆ జావ లోకి చేరతాయి. జ్వరం ఉన్నప్పుడు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి పీచుపదార్థాలు తక్కువ, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే బార్లీ నీళ్లు తాగాలని చెబుతారు. కానీ జ్వరం లేనప్పుడు వట్టి నీళ్లను తాగడం కంటే ఉడికించి బార్లీ గింజలనే అన్నం బదులుగా కానీ, గింజలు తొలగించని జావను అల్పాహారంగా కానీ తీసుకోవచ్చు. ఈ గింజలలో అధికమోతాదులో ఉండే బీటా గ్లూకాన్‌ అనే పీచుపదార్థం చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది, పెద్దపేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఉపయోగపడుతుంది. ముడి బార్లీ గింజలలో ఉండే విటమిన్‌- ఇ, బీటా కెరొటిన్‌, ల్యూటిన్‌, జియాగాంగ్టిన్‌ అనే యాంటీఆక్సిడెంట్లు జీవకణాల మరమ్మతులకు దోహదం చేస్తాయి. కనుక ఉడికించిన బార్లీ గింజలను అన్ని వయస్సుల వారు తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

[email protected] కు పంపవచ్చు)

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

ప్రత్యేకం మరిన్ని...