Abn logo
May 19 2020 @ 00:48AM

‘చివరి గింజనూ’ కొనేది మాటవరసకేనా?

పండిన ప్రతి గింజను కొంటామంటున్న ప్రభుత్వం  ఆ దిశగా చర్యలు తీసుకోవటంలో విఫలమైంది.  ఇటీవల చైర్మన్‌ ఎన్నికలలో భారీ డబ్బుతో గెలిచిన అనేకమంది మిల్లర్లు, ప్రభుత్వంలో కీలక పదవులలో వుండి, ప్రభావితం చేసే ఆర్థిక శక్తికలవారు కావడమే రైతుల దుస్థితికి కారణం. ఉద్దేశ్యపూర్వకంగా మిల్లర్లు అనేక ఆటంకాలు సృష్టించి, ధాన్యంలో వివిద రకాల వంకలుపెట్టి, కోతలు కోసి, దోపిడీ రేటు, లాభాల రేటు పెంచుకోవడానికి, తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అన్‌లోడ్‌ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి,  ప్రతిరోజు అవసరమైనన్ని లారీలు రైతాంగానికి అందుబాటులో వుంచాలి. 


ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు రబీ ధాన్య సేకరణలో ప్రతి చిట్టచివరి గింజ కూడా కొంటామంటూ ప్రతిరోజూ టీవీల ముందు చెప్పే మాటలు ప్రజల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. 85లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యసేకరణలో నేటికీ 45లక్షల మెగా టన్నుల ధాన్యమే సేకరించారు. ఇంకా 40లక్షల మెగాటన్నుల ధాన్యం వుంది. మొదటి గింజను దించడం నుండే మిల్లర్లు కూడబలుక్కొని అనేక ఆటంకాలు పెడుతున్నారు. తప్ప, తాలు పేరిట ప్రారంభంలో వడ్లు క్వి.కు 3 కి.గ్రా నుంచి 8 కి.గ్రా వరకు కట్‌ చేసారు. రైతుల తీవ్ర ఆగ్రహంతో మిల్లుల ముందు ప్రత్యక్ష ఆందోళనలకు దిగటంతో కటింగ్‌ కొంత తగ్గింది. నేటికి బహిరంగంగా ప్రతి 40 కిలోల బస్తాకు 1కి.గ్రా నుండి 2కి.గ్రా అంతకుపైగానే అదనంగా కట్‌ చేస్తు న్నారు.


ఈ వాటాలలో పాక్స్‌ ప్రభుత్వ సహకార సంఘాల నేతలది ఈ వాటాలలో కీలక పాత్ర. ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యాన్ని పంపించినా మిల్లర్లు వాటిని సాధారణ రకంగా నిర్ధారించి రైతులను దోపిడీ చేస్తున్నారు. కొన్ని మిల్లులు ఏకంగా ఇది ‘ఏ’ గ్రేడ్‌ కాదు ‘బి’ గ్రేడ్‌ ధాన్యమనీ, మిల్లుకుచేరిన సరుకు లారీ వెనక్కు పంపమంటారా దించమంటారా అనీ.. ఫోన్‌లు చేసి రైతులను, సెంటర్‌ ఇన్‌చార్జ్‌లను హెచ్చరిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు ప్రతి క్వి.కు కేవలం గ్రేడ్‌ పేరిట రూ.20 నిట్ట నిలువు దోపిడీకీ గురవుతున్నారు. కమాన్‌పూర్‌ ఆదిత్య రైస్‌ మిల్లు యాజమాన్యం ఇలా చిన్నకారు, కౌలురైతుల కుత్తుకలను కత్తిరించింది. ఇలా అనేక సంఘటనలు. ఉద్దేశపూర్వకంగా కొండీలు పెట్టి నిరాకరిస్తే, రైతు అన్నకాడికి అంగీకరిస్తాడని వీళ్ల ఉద్దేశం.


ధాన్యం కేంద్రం నుంచి మిల్లుకు లారీల్లో వచ్చిన ధాన్యాన్ని దించుకోవడం రైతులకు భూగోళమంత పెనుసమస్యగా మారింది. పొరుగు ప్రాంతాల నుంచి చౌకగా వచ్చే శ్రమతో సంపద పెంపుకు అలవాటుపడ్డ మిల్లు యాజమాన్యాలు, హమాలీల కొరత సాకుతో వడ్లు దించుకోక మొండికేస్తున్నాయి. మెజారిటీ మిల్లుల ముందు 20–-30పైగా లారీలు రోజూ ఉంటు న్నాయి. ప్రతి లారీ 4 నుండి వారం రోజుల పాటు మిల్లు ముందు పడిగాపులు గాస్తుంది. ఒక్కసారి వడ్లు అన్‌లోడ్‌ అయ్యి, రైతు వద్దకు లారీ వెళితే, ప్రతి లారీ ప్రతి రోజూ రైతుల వడ్లను మిల్లుకు నిరాటకంగా చేరుస్తుంది. అలాకాక, ఒక లారీ మిల్లు ముందే నిలిచిపోతే, అలా నిలిచిపోయినన్ని రోజులపాటు అన్ని లారీల వడ్లు మిల్లుకు చేరే రవాణా వ్యవస్థ నిలిచిపోయినట్టే. ప్రతి మిల్లుముందు 20–30 లారీలు 5రోజులు ఆగితే, ఆయా ధాన్యం సెంటర్లలో అన్ని లారీల వడ్లను, మిల్లుకు చేర్చే రవాణా కుప్పకూలిందని అర్థం.


ఈ లారీల అన్‌లోడింగ్ సమస్య పెనుభూతమై మొత్తంగా జిల్లాల్లో రాష్ట్ర రైతాంగం పట్ల జీవన్మరణ సమస్యగా మారింది. లారీవాళ్ళకు, డ్రైవర్లకు బతుకు భారమైంది. శీతోష్ణస్థితి మార్పులతో అకాలవర్షాలు ఎక్కువై రాష్ట్రమంతా ధాన్యం వానకు తడిసి, ఎండకు ఎండుతోంది. అశాంతితో రైతు గుండె చెరువవుతోంది. కరోనాతో ఇతర రాష్ట్రాల శ్రామికులు తిరిగి వెళ్ళిపోవడంవల్లే, లారీలు మిల్లుల్లో దించుకునే వ్యవస్థ నిలిచిందని మిల్లర్లు కుంటి సాకులు చెబుతున్నారు. కరోనాతో పని కరువై స్థానిక నిరుపేద యువ హమాలీలు పనికి సిద్ధంగా ఉన్నా, మిల్లు యాజమానులు పనిలోకి తీసుకోక మొండికేస్తున్నారు. కొరడా ఝుళిపించని ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు ఈ ఘటనలు విదితమే. ఇలా పనిలోకి తీసుకోని మిల్లులపై ప్రభుత్వ చర్యలు ఏవి? ఐదు నుంచి వారం రోజులపాటు లారీలు మిల్లు దగ్గరే ఆగడం వల్ల గతంలో ఎన్నడూ లేని విపత్కర పరిస్థితులు తలెత్తాయి.


ఒక లోడు కిరాయి 5వేల రూపాయలైతే, ఆ లారీ 5 నుంచి వారం రోజులాగితే, ఎదురు లారీ యజమాని నష్టపోతున్నాడు. డ్రైవర్‌ క్లీనర్లు 5 రోజులు తిండి ఎక్కడ తినాలి? అవి ఎవరు ఇస్తారు? ప్రతి 40 కిలోల బస్తాకు రూ.2 నుండి 5 వరకు రైతుల వద్ద ఎక్కువ చోట్ల వసూలు చేస్తున్నారు. ప్రతి లారీ పోయినరోజే దించుకుంటే ఏ రైతు పైసా చెల్లించడు. ఏ లారీ యజమాని పైసా అడగడు. లారీలు అధికంగా పెట్టండి అని లారీవాళ్ల కుత్తుకలపై కత్తిపెట్టిన ప్రభుత్వం, మిల్లులకు వచ్చిన లారీలు అదే రోజు దించేటట్టు చేయడంలో ఎందుకు ఘోరంగా విఫలవమవుతోంది. ప్రతి చివరి గింజను కొంటామంటున్న వారు, మిల్లు వద్ద దించడంలో ప్రతి రైతు పడుతున్న మరణవేదనను ఎందుకు తొలగించడం లేదు. అన్‌లోడ్‌ సమస్య వల్ల లారీవాళ్లకు కూడా బతుకు భారంగా మారింది. మెజారిటీ లారీ వాళ్ళు సామాన్యులు. చక్రాలు నడిస్తేనే, వారి బతుకుచక్రం నడుస్తుంది. లారీ యజమానుల బతుకులు (ముఖ్యంగా ఒకటిరెండు లారీలే ఉన్నవారివి) సంకటంగా మారాయి.


వందశాతం నాణ్యమైన, ప్రభుత్వ ప్రమాణాలున్న, వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్నికూడా అదనంగా తూకం వేయాలని రైతాంగం నెత్తిపై మిల్లర్లు పెట్టిన ఒత్తిడికి ఒకటిన్నర నుండి 2కి. తూకం సార్వత్రికమైంది. ప్రభుత్వం తేమ 17శాతం నిర్ధారించింది. మండే ఎండలకు, మిల్లులకు వెళ్ళే ఏ ధాన్యమైనా 10 నుంచి 13 శాతం తేమ దాటడం లేదు. బాయిల్‌ మిల్లులో ఉడికి ఉబ్బిన తేమ తగ్గిన ప్రతి గింజ యజమాని నిజ సంపదను పెంచుతుంది. చాలా కలిసివస్తుంది. మళ్ళీ మిల్లర్లు కూడా బాయిల్డ్‌ బియ్యాన్ని 17శాతం తేమలోనే వుంచుతారు. గోనెసంచులు స్థానికంగా ఉత్పత్తికావు. కొరత తీవ్రంగావుంది. సుదూరం నుండి రావాలి. కరోనాతో ఉత్పత్తి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.


మిల్లులు ఖాళీవున్నా, స్థలం లేదనే సాకుతో వడ్లు దించడంలేదు. నిలువచేసే గోడౌన్‌లలో ఏ మౌలిక సదుపాయాలు లేవు. ఏళ్లు గడుస్తున్నా, ఉత్పత్తి పెరుగుతున్నా, పరిష్కరించే ప్రణాళిక లేదు. పండిన ప్రతి చివరి గింజను కొంటామంటున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటంలో మాత్రం విఫలమైంది. మిల్లర్లు రైతులను పెట్టే బాధలను నిలువరించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఇటీవల చైర్మన్‌ ఎన్నికలలో భారీ డబ్బుతో గెలిచిన అనేకమంది మిల్లర్లు, ప్రభుత్వంలో కీలక పదవులలో వుండి, ప్రభావితం చేసే ఆర్థిక శక్తికలవారు కావడమే రైతుల దుస్థితికి కారణం. ఉద్దేశ్యపూర్వకంగా మిల్లర్లు అనేక ఆటంకాలు సృష్టించి, ధాన్యంలో వివిద రకాల వంకలుపెట్టి, కోతలు కోసి, దోపిడీ రేటు, లాభాల రేటు పెంచుకోవడానికి, తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.


రబీ సీజన్‌లో 40లక్షల ఎకరాలలో వరి పంట పండిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రాణహిత, కాళేశ్వరం నుండి ఈ వర్షాకాలంలో సముద్రంలో కలిసిన నీళ్లు సుమారు 3500టియంసిలకు పైగానే. వర్షాకాలంలో వరద సమయంలో కాళేశ్వరం నుండి ఒక్కచుక్క నీరు కూడా ఎత్తిపోయలేదు. అందులో కాళేశ్వరం నుండి ఎత్తిపోసింది 55నుంచి 60టీయంసీల లోపే. వ్యవ సాయేతర అవసరాలకే ఇందులో చాలా నీటిని తరలించారు. గత దశాబ్దకాలంగా ఎప్పుడు నిండని భారీ గ్రావిటీ ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్‌, నాగర్జున సాగర్‌, శ్రీశైలం మరియు మధ్యతరహా చి.త. ప్రాజెక్టులు నిండడం వల్ల నేడు ధాన్యం అధికంగా మనకు కనబడుతుంది. 40 లక్షల ఎకరాల మాగాణి సాగైతే వచ్చే వరి ధాన్యాన్ని కొనడానికే ఇన్ని యమయాతనలు పడుతుంటే, ప్రభుత్వం చెప్పే కోటి ఎకరాల మాగాణి సాగైతే, నేటి ధాన్యం కాకుండా, ఇంకా ఒకటిన్నర రెట్లు అధికంగా (60లక్షల ఎకలాలకు) ధాన్యం దిగుబడి వస్తే ఆ దుస్థితి ఏమిటి? వడ్ల కేంద్రం నుంచి కదలడానికి గింజపడే కష్టాలు చూస్తూ ప్రతిరైతు గుండెలు కరుగుతున్నాయి. కోటి ఎకరాల మాగాణైతే సేకరణ వ్యవస్థ, రైతుల గతి ఏంకావాలి?


ధాన్యసేకరణకు ఒక సమగ్ర విధానం లేదు. ఓ చట్టమూ రూపమూ లేదు. పరిస్థితి స్తంభించినపుడు ముందుకు నడిపే ప్రణాళిక లేదు. మొత్తం ధాన్య సేకరణ స్తంభిస్తున్నా, రైతాంగం అశాంతికి కారణమవుతున్న అతి చిన్న అన్‌లోడింగ్ సమస్యను కూడా నేటి సేకరణ విధానం నెల దాటినా పరిష్కరించదు. 30రోజులకు 720గంటలు... ఇంత సమయంలో రైతాంగానికి మరణప్రాయమైన సమస్యలకు మార్గం దొరకదా? స్వంత బిడ్డకు చిన్నదెబ్బ తాకితే తల్లడిల్లిపోతాం. ఎవుసంచేసే 60శాతం జనం ఆయువులు పట్టవా ఎవరికి? ఉన్నతాధికారులు ధాన్య సేకరణపై ఆఫీసు గదుల్లో అనేక వర్గాలతో నరాలు చిట్లిపోయే ఎన్ని యుద్ధాలు చేసినా, చివరికి వడ్ల కుప్పల మైదానంలో అవి సఫలం కావడంలేదు.


రైతాంగానికి అశాంతి ఆందోళనే మిగులుతుంది. సేకరణలో ఏ అధికారి కూడా సంతోషంగా సుఖంగా లేరు. దీనికి ఉన్నత స్థాయిలో రూపొందిన అసమగ్ర సేకరణ విధానమే కారణం. ప్రజల చెవుల్లో గింగిర్లుకొట్టే మాటల గాంభీర్యాలు వేలవేల కేంద్రాలలో ధాన్యాన్ని మిల్లుకు చేర్చడంలేదు. నడిపించే వ్యవస్థలు స్తంభించాయి. అందుకే గింజ గ్రౌండు నుంచి కదలదు, మిల్లులో దిగదు. అన్‌లోడ్‌ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి, ప్రతిరోజు అవసరమైనన్ని లారీలు రైతాంగానికి అందుబాటులో వుంచాలి.

నైనాల గోవర్థన్‌

Advertisement
Advertisement
Advertisement