Abn logo
Apr 26 2020 @ 01:33AM

ఆదివాసీ టీచర్లపై చిన్న చూపు ఏల?

ఐదవ షెడ్యుల్‌ ప్రాంతాలలోని పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలలో ఎస్టీలకు 100% రిజర్వేషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా  లేదు. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి.


ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి షెడ్యూల్డ్ తెగలకు (ఎస్.టి.) చెందిన వారికి ప్రభుత్వం కల్పించిన 100% రిజర్వేషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 22న తీర్పు ఇచ్చింది. ఐదుగురు సభ్యులు గల సుప్రీం కోర్టు ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ఆదివాసులు కష్టపడి సాధించుకున్న హక్కులకు విఘాతం కలిగిస్తుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఈ విధమైన రిజర్వేషన్ కల్పించడం న్యాయ సమ్మతమైన, సహేతుకమైన చర్య మాత్రమే కాదు, అది ముమ్మాటికీ రాజ్యాంగ బద్ధమైన చర్య. ఈ రిజర్వేషన్ రాజ్యాంగం పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు భావించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో టీచర్ల పోస్టులకు ఎస్.టి.లకు నూరు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000లో జారీ చేసిన జీఓ 3 ప్రభుత్వ దుందుడుకు చర్య ఏమాత్రం కాదు. ప్రభుత్వం ఏ సామాజిక, చారిత్రక నేపథ్యంలో ఈ జీ.ఓ.ను జారీ చేసిందో సుప్రీంకోర్టు అర్ధం చేసుకున్నట్టు లేదు.


‘రాజ్యాంగంలోని రాజ్యాంగం’గా భావించబడే ఐదవ షెడ్యూల్ స్వరూప స్వభావాలు, ప్రాధాన్యతల పట్ల న్యాయమూర్తులకు అవగాహన లేనట్టుగా ఆ 152 పేజీల తీర్పు చదివితే అనిపిస్తుంది. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల ప్రత్యేక హోదాను ఈ తీర్పు మౌలికంగా ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆదివాసులను రక్షించడం, వారి సంస్కృతిని కాపాడటం, వారికి స్వయం ప్రతిపత్తి కల్పించడం, వారు సాధికారత సాధించేందుకు వీలు కల్పించడం చాలా అవసరమని రాజ్యాంగకర్తలు భావించారు కాబట్టే ఆదివాసుల కోసం ప్రత్యేకంగా ఈ ఐదవ షెడ్యూల్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పీఠిక ప్రకటించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం సాకారం కావడానికి, ఆ ప్రాంతంలో శాంతి, సుపరిపాలన సాధించడానికి ఐదవ షెడ్యూల్ ఏర్పాటు అవసరమని వారు గట్టిగా భావించారు. సుప్రీంకోర్టుకు ఈ స్ఫూర్తి పూర్తిగా అవగాహన కాలేదు.


షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించడం అంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రమైన 46వ అధికరణాన్ని అమలు చేయడమే. ఈ అధికరణం ప్రకారం రాజ్యం బలహీనవర్గాల ప్రజల, అందునా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి ఆర్ధిక ప్రయోజనాలను కాపాడటం, వారికి విద్య అందుబాటులోకి తేవడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారిని అన్ని రకాల సామాజిక దోపిడీ, -పీడనల నుండి విముక్తి చేయాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో విద్యా సంస్థల పని తీరుని మెరుగుపరిచి, తద్వారా ఆదివాసులకు విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో స్థానిక ఎస్.టి.లకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీ.ఓ. జారీ చేసింది. మారుమూల ప్రాంతాల్లోని బడులలో పరాకాష్టకు చేరుకున్న టీచర్ల గైర్హాజరీ సమస్యను ఎదుర్కొనడానికి, ఆ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ జి.ఓ. చాలా ఉపయోగపడింది. టీచర్లు స్థానిక ఆదివాసులే కాబట్టి గైర్హాజరీ సమస్యను పరిష్కరించగలిగారు. అందువల్ల ఆదివాసీ విద్యార్థుల విద్యా బోధన కూడా నిరాటంకంగా సాగింది.


రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లోని అంశాలను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసులకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ 1986 మొదలు అనేక జి.ఓ.లు జారీ చేసింది. ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి గల కారణం ఏమిటంటే ఆదివాసుల పట్ల ఏమాత్రం సానుభూతి లేని ఆదివాసీయేతరులు ఆదివాసుల సంక్షేమం కోసం కృషి చేస్తారనే నమ్మకం లేకపోవడం. అందుకే షెడ్యూల్డ్ ప్రాంతంలోని టీచర్ల పోస్టులకు స్థానిక షెడ్యూల్డ్ తెగల వారికే నూరు శాతం రిజర్వేషన్ కల్పించారు. ఆదివాసీయేతర అభ్యర్థులు ఈ రిజర్వేషన్లను రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుండి సుప్రీం కోర్టు వరకు ఎప్పటికప్పుడు సవాలు చేస్తూ పోయారు. ఆఖరుకు 15 ఏళ్ల తరువాత 2001 నవంబరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రిజర్వేషన్ సబబేనని తీర్పు వెల్లడించి ఈ వివాదానికి తెరదించింది. ఆదివాసులకు ఏంతో మేలు చేసే ఈ తీర్పు వెనక హక్కుల ఉద్యమకారుడు, న్యాయవాది బాలగోపాల్ కృషి మరువలేనిది. రెండు దశాబ్దల తరువాత ఇప్పుడు ఈ ఐదుగురు న్యాయమూర్తులు గల సుప్రీం కోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన ఇందిరా సహానీ తీర్పు (మండల్ కేసు) ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదని, 100% రిజర్వేషన్లు అమలు చేయడం ఇందిరా సహానీ తీర్పుకి విరుద్ధమని అంటోంది. ఈ నిర్ధారణ సరైనది కాదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 2000 నాటి జి.ఓ. 3 కింద ప్రవేశపెట్టిన రిజర్వేషన్ 16(4) అధికరణం పరిధిలోకి రాదు. ఇది ఆదేశిక సూత్రమైన 46 అధికరణాన్ని అమలు పర్చడానికి తీసుకువచ్చింది కాబట్టి అది 16(1) అధికరణం పరిధిలోకి వస్తుంది. ఇది సామాజిక వెనుకబాటు తనాన్ని ఉద్దేశించి తీసుకు వచ్చిన రిజర్వేషన్ కాదు కాబట్టి దీనికి ఇందిరా సహానీ తీర్పు కానీ, బాలాజీ తీర్పు కానీ, ఆ తీర్పులలోని 50% పరిమితి కానీ వర్తించవు.


ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు రాజ్యాంగంలోని పదవ భాగం, ఐదవ షెడ్యూలు రాజ్యాంగ మౌలిక అంశాలలో (బేసిక్ స్ట్రక్చర్) భాగమే. బేసిక్ స్ట్రక్చర్‌లో భాగమైన సమానత్వ హక్కు 5వ షెడ్యూల్‌లో ఇమిడివుంది. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి, సంక్షేమ సాధన కోసం రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రాంతంలో పరిపాలన ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా, వినూత్న పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉందని భావించారు. అందుకే ఈ ప్రాంత పరిపాలనా బాధ్యతలు రాష్ట్ర గవర్నర్లకు అప్పగించారు.


సాధారణ ప్రజలందరికీ వర్తించే చట్టాలనే ఆదివాసులకు వర్తింపచేస్తే వారికి తీరని అన్యాయం జరుగుతుందనే స్పృహ రాజ్యాంగకర్తలకు ఉండబట్టే వారు రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌ను చేర్చారు. అక్కడ అందరికీ వర్తించే సాధారణ చట్టాలు, సాధారణ ప్రభుత్వ విధానాలు అమలు చేస్తే ఆదివాసులకు తీరని అన్యాయం చేసిన వారిమే అవుతామని, వారిపై ఆదివాసీయేతరుల దోపిడీ కొనసాగుతుందని ఈ ప్రయత్నం చేశారు. వారి ప్రత్యేక సమస్యలను గుర్తించే రాష్ట్ర గవర్నర్లకు షెడ్యూల్డ్ ప్రాంతాలుగా నోటిఫై అయిన చోట్ల వారికి శాసనాలు చేసే, ఉన్న శాసనాలను సవరించే అధికారాన్ని ఇచ్చారు. అందుకనే అంటున్నాము జి.ఓ. 3 జారీ చేయడానికి రాష్ట్ర గవర్నర్‌కి సర్వాధికారాలూ ఉన్నాయని. గవర్నర్లు తమ అధికారాలు దుర్వినియోగం చేసుకోకుండా ఉండటం కోసం 5 షెడ్యూల్ ప్రాంతంలో తీసుకునే చర్యలపై రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండాలనే నియమం పెట్టారు. రాష్ట్రపతి గవర్నర్ చర్యలను సమీక్షిస్తారు కాబట్టి గవర్నర్ అధికారంపై ఒక చెక్ ఉంటుంది. ఆదివాసుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో 5వ షెడ్యూల్‌లో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ కేసులో అర్ధం చేసుకోలేకపోయారు.


ఈ తీర్పు చదివిన తరువాత రాబోయే కాలంలో ఏం జరగనుందా అనే ఆందోళన కలగకమానదు. ఆదివాసీల భూములను ఆదివాసీయేతరుల కబ్జా నుండి కాపాడే 1/70 చట్టం ఎందుకు ఎత్తేయకూడదనే వాదనలకు ప్రభుత్వాలు, కోర్టులు వత్తాసు పలుకుతాయా? లేదంటే కనీస ప్రాతినిధ్యం పేరిట మాత్రం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయాలంటారా? జి.ఒ. 3 కల్పించిన ఈ రిజర్వేషన్ గురించి చేసిన.. ‘ఇది హేతువుకి లొంగని చర్య. ఎంత ఏకపక్షంగా తీసుకున్న చర్యో? సంపూర్ణ రిజర్వేషన్ అమలు చేసే పేరిట ప్రతిభను కాదనలేము’ వంటి వ్యాఖ్యానాలు చదివితే ఈ అనుమానాలు కలగక మానదు. 


‘ఆదివాసులకు ఆదివాసులే పాఠాలు చెప్పడం...’ అని ఈ న్యాయమూర్తులకు ‘విడ్డూరం’ అనిపించింది. ఇది విడ్డూరం ఎందుకు అనిపించాలి? ఆదివాసీ ప్రజలను అందరితో కలిపి చూడకూడదని, వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రాజ్యాంగకర్తలే గుర్తించారు. ఆదివాసీ టీచర్లు ఆదివాసీ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసిమెలిసి అవసరమైతే అదే గ్రామంలో ఉండిపోతూ, వారికి అర్ధమయ్యే రీతిలో, అర్ధమయ్యే భాషలో పాఠాలు చెబుతూ వస్తున్నారు. ఇది నడుస్తున్న చరిత్ర. ఆదివాసీ టీచర్ల పని తీరు సమీక్షించే ప్రయత్నం చేయకుండా ఈ జి.ఓ. వారి ప్రతిభని దెబ్బతీస్తుందని అనడం ఇన్ని దశాబ్దాలుగా ఏంతో శ్రద్ధ తీసుకుని పాఠాలు చెబుతున్న ఆదివాసీ టీచర్ల కృషిని సుప్రీంకోర్టు గుర్తించనట్లే.


మనం అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పాలన సాగుతున్న కాలంలో బతుకుతున్నాము. రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తూ సమానత్వ హక్కును తుంగలోకి తొక్కుతూ వస్తున్నా తీర్పులు వారికి జత అవుతున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఒక దాని తరువాత మరొకటి సమానత్వ హక్కుకి విఘాతం కలిగించే తీర్పులు ఇస్తూ పోతున్నది. గత ఏడాది ఫిబ్రవరిలో అటవీ హక్కులు నిరూపించుకోలేని కొన్ని లక్షల మంది ఆదివాసులను, ఇతర అటవీవాసులను అడవి నుంచి తరిమేయాలని తీర్పు ఇచ్చింది. మరోసారి ఎస్.సి.,ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం, 1989 దుర్వినియోగం అవుతున్నదని తీర్పు ఇచ్చింది. 498ఏ దుర్వినియోగం అవుతోందని వాపోయింది. ఇదంతా చూస్తుంటే సమానత్వ హక్కుపై వారికి కనీస అవగాహన కొరవడిందా అనే అనుమానం కలుగక మానదు.


రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని పునఃసమీక్షించుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. ఈ తీర్పుని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ తీర్పుకి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, ప్రజా ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఆదివాసులకు అందరమూ రక్షణగా నిలవాలి.

వి.ఎస్. కృష్ణ 

ఎస్. జీవన్‌కుమార్

ఏ.పి., టి.ఎస్. సమన్వయ కమిటీ సభ్యులు,

మానవ హక్కుల వేదిక (HRF) 

Advertisement
Advertisement
Advertisement