Abn logo
May 15 2020 @ 00:35AM

మద్య నియంత్రణ ఏమైంది?

మే 17 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించిన సందర్భంలో స్వయంగా ప్రధాన మంత్రే మద్యం షాపులు తెరిచేందుకు సడలింపులు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటి? ఈ చర్య నైతికమైనదేనా? ప్రధాని నిర్ణయం వెలువడిన వెన్వెంటనే రాష్ట్రంలో ఆగమేఘాలమీద మద్యం షాపులను తెరవడమేకాదు ఏకంగా 75 శాతం మేరకు ధర పెంచారు! ధర పెంపుదల మద్యం అలవాటు తగ్గించడానికేనని పాలకులు చెప్పడం ఎంతవరకు నైతికం?


మద్యపానం మంచి చెడులపై చర్చ పురాతనమైనది. కారణాలు ఏమైనప్పటికీ నేడు అనేకమంది జీవనవిధానంలో మద్యం అంతర్భాగమైపోయింది. దీనికితోడు కార్పొరేట్‌ కంపెనీల బ్రాండ్లతో ఉన్నత వర్గాలకు గౌరవహోదా, చీప్ లిక్కరుతో పేదలకు అవమానం భావజాలపరంగా లభిస్తోంది. ఇక ప్రజలకు కలిగే అనారోగ్యం, ఆర్థికహీనత, సామాజిక రుగ్మతలు, రోడ్డు ప్రమాదాలు, గృహహింస, నేరాలు లాంటి అనేక అంశాలపై విశ్లేషణలు మద్యం కేంద్రంగా నడుస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్యంపైన ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, వాటి నైతికత చర్చ అనివార్యమవుతోంది. 


కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు కనురెప్పవాల్చకుండా ప్రపంచం శతవిధాల పోరాడుతోంది. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనూహ్యంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. అంతకు ముందురోజు వరకూ పార్లమెంటు సమావేశాలు జరిగినప్పటికీ లాక్‌డౌన్‌ విషయాన్ని కనీస మాత్రంగా కూడా ఆయన సభలో ప్రస్తావించలేదు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్ విధింపు విషయమై ఏకపక్షంగా నిర్ణయం చేసారు. ఫలితంగా కోట్లాది వలస కార్మికులు తమ స్వస్థానాలకు చేరేందుకు మార్గంలేక అనేకచోట్ల సామూహికంగా ఆందోళనలు చేస్తున్నారు. కనీస సదుపాయాలు లేని చిన్నచిన్న గదుల్లో పదుల సంఖ్యలో కిక్కిరిసి జీవిస్తున్నారు. పోలీసులకు భీతిల్లి ప్రయివేటు వాహనాల్లో పశువులకంటే దారుణంగా నక్కినక్కి ప్రయాణిస్తున్నారు. వందల కిలోమీటర్లు నడుస్తూ మార్గమధ్యలో ప్రాణాలుసైతం విడుస్తున్న భయంకరస్థితి వలస కార్మికులది. ఇప్పటికే 70 మందికిపైగా మరణించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ కరోనాను ఎదుర్కోవాలనే లాక్‌డౌన్‌ లక్ష్యానికి వలస కార్మిలకుల అనిశ్చితి కొంతమేర నష్టంచేసిందని చెప్పక తప్పదు. అయినా దేశప్రజలు, డాక్టర్లు, నర్సులు, సఫాయి కార్మికులు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, మీడియా నిరంతరంగా ప్రాణాలు ఎదురొడ్ది కరోనాపై పోరాటంలో నిమగ్నమయ్యారు.


లాక్‌డౌన్‌లో భాగంగా భౌతిక దూరం పాటించడం లాంటి చర్యలు సీరియస్‌గా అమలవుతున్న సమయంలో, కరోనా కేసులు ఇంకా తగ్గకముందే ప్రధాని మోదీ అనూహ్యంగా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు షాపులు తెరుచుకునేందుకు సడలింపులు ఇచ్చారు. ఇది మరో ఏకపక్ష నిర్ణయం. దీనిపై ‘మొదట చప్పట్లూ, తర్వాత దీపాలు, ఇప్పుడు తీర్థం’ అంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 45 రోజుల గ్యాప్‌ తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో వేలాది మద్యం ప్రియులు భౌతికదూరం వదిలేసి క్యూలు కట్టారు. ఇది ప్రభుత్వాలకు ఊహకందనిదని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వం. 


లాక్‌డౌన్‌ను, భౌతికదూరాన్ని సీరియస్‌గా పాటిస్తూ కరోనాను కట్టడిచేసే పోరాటంలో కొంతమేరకు విజయం సాధించామని, ఇతర దేశాలతో పోలిస్తే కేసుల సంఖ్యను, మరణాలరేటును తగ్గించుకోగలిగామని భరోసాతో వున్న భారత ప్రజలకు మద్యంషాపుల తెరవడమనే నిర్ణయం నిర్ఘాంతపోయేలా చేసింది. కరోనాపై ప్రజలు చేస్తోన్న పోరాటానికి ప్రభుత్వమే ప్రత్యక్షంగా తూట్లు పొడిచినట్లు అయింది.


నిజానికి మద్యం షాపులు వెంటనే తెరవాలని దేశంలో ఎక్కడా మద్యంప్రియులు ఆందోళనలు చేయలేదు. కరోనా భయంతోనో,అందుబాటులోలేకో తమ వ్యసనాన్ని, అలవాటును అదిమిపట్టుకుని నెమ్మదిగా జీవించేందుకు అలవాటు పడుతున్నారు. మద్యం షాపులు వెంటనే తెరవాలని మద్యం ప్రియులు కోరనట్టే మద్యం షాపులు ఎప్పటికీ తెరవొద్దనికూడా ఎవరూ అనలేదు. దేశమంతా మద్యం షాపులు ఉన్నాయని అవి లాక్‌డౌన్ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తెరుచుకుంటాయని అందరికీ తెలుసు. ఇక్కడ చర్చల్లా మద్యంషాపులను ఎప్పుడు? ఎలా? ఏ సందర్భంలో తెరవాలనేది ప్రభుత్వాల విచక్షణకు, బాధ్యతకు, నైతికతకు సంబందించినది.


ఒకవైపు భౌతిక దూరం పాటించడమొక్కటే మార్గమని, దీనికితోడు శరీరశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని, మద్యం సేవిస్తే ఇమ్యూనిటీ తగ్గే అవకాశాలు వున్నందున మద్యం సేవించడం సరికాదని మీడియా, డాక్టర్లు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు; ఈ మేరకు వందలకోట్లు ఖర్చుచేసి ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తున్నాయి; మరోవైపు వలసకార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపేందుకు బస్సులు,రైళ్లు లాంటి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఇంకా అందుబాటులో లేదు; అన్నిటికీ మించి మే 17 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించిన సందర్భంలో స్వయంగా ప్రధాన మంత్రే మద్యం షాపులు తెరిచేందుకు సడలింపులు ఇవ్వడంలోని ఔచిత్యం ఏమిటి ? ఈ చర్య నైతికమైనదేనా?


ప్రజలనుంచి ప్రశ్నలు, విమర్శలు తలెత్తడంతో కొందరు బిజెపి నేతలు నెపం రాష్ట్రాలవైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.పలు రాష్ట్రాలనుండి డిమాండ్‌ రావడం వల్లనే ప్రధాని మద్యం షాపులకు అనుమతి ఇచ్చారని ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి అయితే మద్యం షాపులు తెరిపించింది ప్రధాని, షాపుల దగ్గరకు డబ్బులిచ్చి జనాలను పంపింది ప్రతిపక్షనేత అని సింపుల్‌గా చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. సమయ సందర్భాలపై విచక్షణ లేకుండా మద్యం షాపులు తెరిచిన నిర్ణయాన్ని బలపర్చుకునే వాదనలు వింటుంటే కరోనాపై పోరాడడంలో ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధిపై సందేహం కలుగుతోంది.


ఆంధ్రప్రదేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయిస్తోంది. దశలవారీగా నియంత్రణచేసి మద్యనిషేదం అమలుచేస్తామని వైకాపా తన మానిఫెస్టోలో హామీనిచ్చింది. ఇప్పటికే వైకాపా పాలన మొదలై ఏడాది కావస్తోంది. నియంత్రణ కాలం ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు. నిజంగా మద్య నిషేధమే అంతిమలక్ష్యం అయితే తన హామీని నిలుపుకోడానికి ఈ 45 రోజుల లాక్‌డౌన్‌కు మించిన చారిత్రక సందర్భం మరోటి వుండదు. కరోనా విపత్తు మద్య నియంత్రణకు సమయాన్ని ఇచ్చింది. అయినా ఆగమేఘాలమీద మద్యం షాపులను ఎందుకు తెరిచినట్టు? తెరవడమేకాదు ఏకంగా 75 శాతం ధరలను ఎందుకు పెంచినట్టు?ఒకవైపు లాక్‌డౌన్‌ కష్టాలనుంచి ప్రజలను ఆదుకునేందుకు నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా హెచ్చరికలు చేస్తూ, పేదలకు ఆర్థికసాయం, రేషను సాయం అందిస్తున్న ప్రభుత్వం మద్యంపైన మాత్రం 75శాతం ధర పెంచి దాన్ని మద్యం అలవాటు తగ్గించడానికి ‘షాక్‌’ కొట్టే విధానమని చెప్పడం ఎంతవరకూ నైతికం? ప్రజల అలవాటును డిమాండ్‌ ఉన్నప్పుడే సొమ్ముచేసుకునే దిగజారుడు దోపిడీ వ్యాపార విధానం కాక మరేమిటి? సినిమా రిలీజ్‌ రోజు అధిక ధరలకు బ్లాక్‌లో టికెట్‌లను అమ్మడం అందరికీ తెలుసు కానీ బ్లాక్‌ ధరను కౌంటర్‌లోనే అమ్మినట్టు వుంది ఎపి ప్రభుత్వ అతితెలివి. ఇది రాజ్యాంగబద్దంగా నడుచుకునే ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఈ చర్యలు రాజ్యాంగంలోని అర్టికల్‌ 47ని పూర్తిగా ధిక్కరించడం కాదా?


కరోనా నియంత్రణ విషయంలో ఎపి ప్రభుత్వ తీరు మొదటనుంచీ సందేహాస్పదంగానే వుంది. నా నవరత్నాల్లో కరోనా లేదుగా అన్నట్లు వైకాపా వ్యవహరిస్తోందనే విమర్శలు వున్నాయి. నేటికీ ఎపిలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. మద్యంషాపులు తెరవడమనేది కరోనా వ్యాప్తికి మరింత దోహదంచేస్తుందని గ్రహింపులేకపోవడం ప్రజాఆరోగ్యంపట్ల బాధ్యతను విస్మరించడమే. 45 రోజులపాటు మద్యం లేకుండా బతకగలమని మద్యం ప్రియులు నిరూపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మద్యం అమ్మకుండా బతకలేమన్నట్లు వ్యవహరిస్తున్నాయి! ఆంధ్రప్రదేశ్‌లో 2019–-20 సంవత్సరంలో రూ.20,843 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తే 3,208 కోట్ల వ్యయం పోగా ప్రభుత్వానికి 17,626 ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. 75శాతం పెంచిన ధరల కారణంగా 30 వేల కోట్ల వరకూ మద్యంపై ఆదాయం పెరగనుందని అం చనా. మరోవైపు నియంత్రణలో భాగంగా 33 శాతం మద్యం షాపులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఏం జరగబోతోందో పెరుమాళ్ల కెరుక. మద్యాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే ఈ లాక్‌డౌన్‌ను, కరోనాను చారిత్రక సందర్భంగా భావించి వెంటనే నిషేధం విధించాలి. నియంత్రణ పేరుతో, అధిక ధరలపేరుతో మరో పాలుగేళ్లు మద్యం ప్రియులను ఆర్థికంగా దోపిడీ చేయాలనుకోవడం మాత్రం సరికాదు.కనీసం కరోనా ఉధృతి పెరుగుతున్న సమయంలోనైనా మద్యం షాపులు తెరవడం శ్రేయస్కరమూ కాదు.


ఇక ఎపిలో దొరికే రకరకాల కొత్త బ్రాండ్లు ఎంతవరకూ ఆరోగ్యకరమైనవో ప్రశ్నార్థకమే. వాటి తయారీ, సరఫరా వెనక ఎన్నివేల కోట్ల రూపాయల కమీషన్లు చేతులు మారుతున్నాయో ఎవరికీ అంతుపట్టడంలేదు. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో తమకు నచ్చిన మద్యం కొనుక్కునే స్వేచ్ఛను ప్రభుత్వం బలవంతంగా తొలగించడంతోపాటు, మద్యం ప్రియుల పట్ల అనైతికంగా, ఆర్థికదోపిడీతో వ్యవహరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మద్యానికి అలవాటుపడిన పేదల కడుపులపైన, గుండెలపైనా కనిపించని గునపం గుచ్చుతోంది. ఇదే నిజమైన ‘షాక్‌.’ఈ చర్చ మద్యం ప్రియులకు మాత్రమే సంబంధించినది కాదు. మద్యం సేవించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా చేస్తున్న ఈ అనైతిక, ఆర్థిక దోపిడీలపై అందరూ మౌనం వీడాల్సిన అవసరం ఎంతైనా వున్నది.

జంగా గౌతమ్‌

సామాజిక, రాజకీయ విశ్లేషకుడు

Advertisement
Advertisement
Advertisement