Abn logo
Jun 18 2021 @ 23:04PM

నిమ్మరైతుకు ధరాఘాతం

రెండేళ్లుగా నష్టాలేనంటున్న రైతులు

ఖర్చులు రాక తోటలు తొలగింపు

పెదవేగి, జూన్‌ 18 : నిమ్మకాయల ధర లో పెరుగుదల లేకపోవడంతో ఆ ప్రభావం తోటల పెంపకంపై పడింది. ఏళ్ల తరబడి పెంచిన తోటలను నరికేస్తూ, తోట మధ్యలో వేసి తగులబెడుతున్నారు. రెండేళ్లుగా సరైన ధరలేక, నష్టాలను భరించలేక ప్రత్యామ్నా య పంటలసాగుకు రైతులు మొగ్గుతున్నారు. పెదవేగి మెట్టప్రాంతం కావడంతో ఉద్యాన పంటలవైపే రైతులు ఎక్కువగా మొగ్గుతుంటారు. నిమ్మ ఓ ప్రధానపంటగా రైతులు సాగుచేస్తుంటారు. మండలంలో 1300 హెక్టార్లలో నిమ్మసాగు జరుగుతోంది. నిమ్మసాగులో అంతరంగా మరోపంట వేయడానికి అవకాశం ఉండదు. దీంతో ధర లేకపోవడంతో ఆదాయానికి మరోదారి లేక తగ్గిన ధరతో జీవనం గడవక, పెంచిన చేతులతోనే తోటలను నిలువునా నరికేస్తున్నారు. దెందులూరు మార్కెట్‌ యార్డులో శుక్రవారం కిలో నిమ్మకాయలు మూడు రూపాయలకు విక్రయించారు. కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు దీనంగా వెనుదిరిగారు.


 కూలీల ఖర్చు రావడం లేదు

 తాతా రామారావు, రైతు, పెదవేగి.

పదేళ్లుగా నిమ్మసాగు చేస్తున్నాం. ప్రతి ఏడాదీ ధర పెరుగుతుందనే ఆశతో ముందుకు సాగాం.   పెట్టుబడికి తగ్గ రాబడి రావడం లేదు. రెండేళ్లుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. నిమ్మకాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే వ్యాపారులు లాలూచీతో ధరను ఆమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో కూలిఖర్చులు రావడం లేదు. తప్పనిసరి పరిస్థితిలో చెట్లను కొట్టేస్తున్నాం. 


 పెట్టుబడి రావడం లేదు..

 మేడికొండ మురళీకృష్ణ, రైతు, గార్లమడుగు. పెదవేగి మండలం

ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నా. నాకు ఉన్న పొలం లో శాశ్వత ఆదాయం వచ్చే పంటలసాగు చేపడితే ఉద్యోగ విరమణ తర్వాత ఆనందంగా గడపవచ్చని ఆశించా. ఏడేళ్ల కిందట 13 ఎకరాల్లో నిమ్మ సాగు చేపట్టాను. అందులోనే కొబ్బరి మొక్కలు వేశాను. నిమ్మ కాపుకొచ్చినా పెట్టుబడి రాని పరిస్థితి.  మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో గతేడాది కోకో మొక్కలు తీసుకొచ్చి మొత్తం తోట అంతా వేశాం. ప్రస్తుతం నిమ్మ కిలో మూడు రూపాయలకు పడిపోయింది. ఈ పరిస్థితిలో నిమ్మకు పెట్టుబడి పెట్టే స్థితి కానరాక తోటలోని నిమ్మచెట్లన్నీ నరికించేశా. కోకో, కొబ్బరి పంటలే ఆదుకుంటాయనే ఆశతో ఉన్నా. 


 నిమ్మ రైతులను ఆదుకోవాలి

ఏలూరు రూరల్‌, జూన్‌ 18: కొవిడ్‌ ప్రభావంతో మార్కెట్లో ధర లేక నష్ట పోతున్న నిమ్మ రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని చొదిమెళ్లలో నిమ్మ తోటలో రాలిపోతున్న నిమ్మకాయలను సంఘం నాయకులు పరిశీలించారు. కొవిడ్‌తో నష్టపోతున్నామంటూ నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర వారం కిలో నిమ్మకాయలకు మార్కెట్లో కేవలం రూ.3 మాత్రమే ధర రావ డంతో నిమ్మ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.