Abn logo
Oct 23 2021 @ 00:24AM

మరో 14 వేల మంది

ప్రాథమిక పాఠశాలల నుంచి హైస్కూళ్లకు విద్యార్థులు

మూడు నుంచి పదో తరగతి వరకు విస్తరణ

ఫౌండేషన్‌ స్కూళ్లకు 3,365 మంది చిన్నారులు.. రెండు రోజుల్లో సమావేశం

ఒకటో తేదీ నుంచి నూతన విద్యా విధానం


ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 22 : జిల్లాలోని 225 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న 14 వేల మంది బాల బాలికలు ఇకపై సమీప 250 మీటర్ల పరిధిలో ఉన్న 193 హైస్కూళ్లకు వెళ్లాలి. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్న నూతన విద్యా విధానం అమలులో భాగంగా జిల్లా విద్యాశాఖ, ఐసీడీఎస్‌ విలీన ప్రక్రియ, విద్యార్థుల తరలింపు తదితర అంశాలపై ప్రాఽథమిక కసరత్తు పూర్తి చేశాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫౌండేషన్‌ స్కూళ్లను 225 ప్రాఽథమిక పాఠశాలల స్థానే ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రారంభమయ్యే ఫౌండేషన్‌ స్కూళ్లల్లో సమీప అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (పీపీ – 1, 2) తరగతులు చదువుతున్న 3,365 మంది చిన్నారులతో పాటు, 1, 2 తరగతుల విద్యార్థులు ఉంటారు. హైస్కూళ్లల్లోకి విలీనం చేసే 3, 4, 5 తరగతుల విద్యార్థులకు బోధించేందుకు ప్రాథమిక పాఠశాలల నుంచి ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్‌ టీచర్లు) పోస్టులను అదనంగా చేరుస్తున్నారు. ఇకపై హైస్కూళ్లన్నీ మూడు నుంచి పదో తరగతి వరకు ఉంటాయి. హైస్కూళ్లకు ఎస్జీటీల బదలాయింపులో జూనియర్లను ఫౌండేషన్‌ స్కూళ్లల్లోనే ఉంచుతారు. ఫౌండేషన్‌ స్కూళ్లల్లోకి ప్రీ ప్రైమరీ (పీపీ–1, 2) చిన్నారుల తరలింపు, అంగన్‌వాడీ కేంద్రాల ఎత్తివేత సంఖ్యలపై నెలకొన్న సాంకేతిక అవరోధాలను పరిష్కరించేందుకు రెండు రోజుల్లో జిల్లా విద్యాశాఖ, ఐసీడీఎస్‌ అధికారులతో సమన్వయ సమావేశం జరగనుంది. హైస్కూళ్లల్లోకి 3, 4, 5 తరగతుల బాల బాలికలు వస్తున్నందున తరగతి గదుల కొరత ఎక్కడైనా తలెత్తితే నాడు–నేడు రెండో విడత కార్యక్రమంలో సంబంధిత ఉన్నత పాఠశాలలను చేర్చి కొత్తగా అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. ఇలా ఎన్ని హైస్కూళ్లల్లో అదనపు తరగతి గదులు అవసరమవుతాయో తేలాలి. మొత్తం మీద 20 మంది విద్యార్థులకు ఒక తరగతి గది ఉండేలా ఎన్ని హైస్కూళ్లల్లో వసతులు ఉన్నాయో కొద్ది రోజుల్లో తేల్చనున్నారు.