Abn logo
Oct 23 2021 @ 00:28AM

నోటీసులు ఇవ్వాల్సిందే

కేసు నమోదైనా, కాకపోయినా సెక్షన్‌ 41(ఏ) కింద ఇవ్వాలి

వ్యక్తుల నిర్బంధం ప్రాథమిక సూత్రాల ఉల్లంఘనే

సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం 

ఆకివీడు ఎస్‌హెచ్‌వో జైలు శిక్ష 15 రోజులకు కుదింపు 


అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కౌన్సెలింగ్‌ పేరిట వ్యక్తులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించడం, అక్రమంగా నిర్బంధించడం అర్నేశ్‌ కుమార్‌ కేసులో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేసు నమోదైనా, కాకపోయినా సంబంధిత వ్యక్తులకు ముందుగా సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు నమోదు చేయలేదనే కారణంతో తమ ఆదేశాలను అమలు చేయకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. ఎలాంటి నేరం నమోదు కాకుండా వ్యక్తులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించడం, నిర్బంధించడం ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కరణ అప్పీల్‌లో సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే ఈ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో అశోక్‌కుమార్‌కు సింగిల్‌ జడ్జి విధించిన 3 నెలల జైలు శిక్షను 15 రోజులకు కుదించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ బి.త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. వివరాలు.. తమ విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలు పాటించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆకివీడు ఎస్‌హెచ్‌వో అశోక్‌కుమార్‌ ఉల్లంఘించారంటూ విశాఖపట్నానికి చెందిన ఎంఏ.ఖలిక్‌, అతని తల్లిదండ్రులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు.. ఎస్‌హెచ్‌వో అశోక్‌కుమార్‌కు మూడు నెలలు జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. ఎస్‌హెచ్‌వోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలను సవాల్‌ చేస్తూ అశోక్‌కుమార్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఆ అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం పిటిషనర్‌పై ఎలాంటి కేసు నమోదు చేయనందున సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు వర్తించవని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఎంఏ.ఖలిక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పీల్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. 


 41(ఏ) నోటీసులు అంటే..

ఏడేళ్లు అంతకంటే తక్కువ శిక్షపడే కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను నేరుగా అరెస్టు చేయకుండా, ఆ వ్యక్తి వివరణ కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద పోలీసులు నోటీసులు ఇస్తారు. ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ అర్నేశ్‌కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది.