Abn logo
May 13 2020 @ 03:25AM

వలస కూలీలు ఈ దేశ ప్రజలు కాదా?

దేశ గోడౌన్లలో ఆహారధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని బయటకు తీసి ప్రజలకు పంచేందుకు పాలకులు ఎందుకు సిద్ధంగా లేరు? వలస కూలీలు చేసిన నేరం ఏమిటి? వారిని ఖైదీల్లా బంధించడం ప్రభుత్వ నేరం కాదా? క్వారంటైన్‌కు పంపించినా అక్కడ కనీస సౌకర్యాలు లేవు, ఇందుకు బాధ్యత పాలకులది కాదా? నిజానికి, 200లక్షల కోట్ల జీడీపీ కలిగిన దేశం 60 వేల కోట్లు విడుదల చేసి తమ ప్రజల ప్రాణాలను, తమ దేశ శ్రమశక్తినీ కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కార్పొరేట్లకు కొమ్ముకాచే ఈ పాలకుల నుంచి పనిచేసే చేతులకు సాయం అందాలని ఆశించడం అత్యాశే అవుతుందని ఈ కరోనా నిరూపించింది. 


కరోనా విలయం మధ్య, ఈ అమానవీయ పాలనలో, వలస కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. కన్నతల్లినీ, ఉన్న ఊరును వదిలి, వందలు వేల కిలోమీటర్లు వలస వెళ్లి పనులు చేసుకుంటూ, వచ్చిన దాన్లో సగం ఇంటి వద్ద ఉండే వృద్ధులు పిల్లల పోషణకు పంపుతూ... ఇలా సాగుతున్న జీవితాల్లో కరోనా అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. ముందూ వెనుకా ఆలోచించకుండా మార్చి 24న మోదీ సర్కారు విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు స్తంభించాయి. రాష్ట్రాల సరిహద్దులు మూతపడ్డాయి. దీంతో రెక్కాడితేగానీడొక్కాడని వలస కూలీల బతుకులు రోడ్డునపడ్డాయి. కాంట్రా క్టర్లు మొహం చాటేశారు. స్థానికుల ఆసరాతో కొన్ని రోజులు గడిపిన వలసకూలీలు తమ స్వస్థలాలకు చేరుకోవాలని భావించి అధికారులను వేడుకుంటున్నా కనికరించేవారే కరవయ్యారు. దీంతో వేల కిలోమీటర్లు కాలినడకనే స్వస్థలాలకు బయల్దేరారు. దారిలోనే ప్రాణాలుపోయిన ఘటనలూ ఉన్నాయి.

ఆకలి రూపంలో మరణం మాటేసినప్పుడు, రోగం రూపంలో కాటేయ కూర్చున్నప్పుడు, ఆర్తనాదాలు పాలకులకు చెవికెక్కనప్పుడు పోరాటమొక్కటే నిండు ప్రాణాలను కాపాడగలదు. అందుకే వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించాలంటూ సుప్రీం కోర్టులో స్వామి అగ్నివేష్‌, ప్రశాంతభూషణ్‌ పిటిషన్‌ వేయగా, నేను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేసు వేశాను. దీంతో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో వలస కూలీలు తమ నిరసన ‘పాదయాత్ర’ కొనసాగించారు. దారిలో పోలీసులు వారిని అడ్డగించి బలవంతంగా నిర్బంధించారు. ఫలితంగా రోడ్డు మార్గాన కాకుండా రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లిన ఘటనలున్నాయి. ఈ క్రమం లోనే ఔరంగాబాద్‌ సమీపంలోని కర్మాడ్‌ వద్ద అలసిసొలసి పట్టాలపై నిద్రపోయిన కూలీలపైనుంచి గూడ్స్‌ రైలు దూసుకువెళ్లిన దుర్ఘటనలో 16మంది అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. మహారాష్ట్రలో పనుల కోసం వలస వచ్చారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే. ఇందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.

వలస కూలీలకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించడంలో మొహం చాటేసిన కాంట్రాక్టర్లు, ఆ కూలీలు స్వస్థలాలకు వెళ్లడాన్ని అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. అందుకు అధికార యంత్రాంగాన్ని, పోలీసులను వారు వాడుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే తిరిగి పనులు ప్రారంభించడానికి కూలీలు కావాలి కాబట్టి వారిని స్వస్థలాలకు పంపకూడదని వారి ఆలోచన. అందుకు రాజకీయ నేతలు సహకరించారు. ఉదాహరణకు సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటకలోని ఉత్తరభారతదేశ వలసకూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు మూడు రైళ్లను ఏర్పాటుచేశారు. అయితే కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి యడ్యూరప్ప వద్దకు వెళ్లి ఆ రైళ్లను రద్దు చేయిస్తూ రాజకీయం నడిపారు. విపక్షాల నుంచి వలసకూలీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆ రైళ్లు కదలక తప్పలేదు.

గుంటూరు నుంచి కర్నూలు 200 కిలోమీటర్లు నడిచి వెళుతున్న వలస కూలీలను ప్రకాశం జిల్లాలో అడ్డగించి తిరిగి గుంటూరుకు పంపారు. ఇక్కడ గతంలో వారు వేసుకున్న గుడిసెలను పీకివేయడంతో వారు నడిరోడ్డున పడ్డారు. కూడూ గూడూ లేదు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఇసుక ర్యాంపుల్లో పనిచేసే బీహార్‌, చత్తీస్‌ఘడ్‌ వలస కార్మికులను ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతో చేసేది లేక నడక బాట పట్టారు. రోడ్డు కం రైలు బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. చివరకు లాఠీచార్జికి దారితీయడంతో కూలీలతోపాటు ఒక పోలీస్‌ అధికారికి గాయా లయ్యాయి. చివరకు ఎస్పీ రెండు రోజుల్లో పంపించేందుకు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణింది. పోలవరం ప్రాజెక్టులో ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రా లకు చెందిన 200 మంది కార్మికులు ఎవరికీ తెలియకుండా కాపర్‌ డ్యాం నుంచి నడుచుకుంటూ తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమ పట్నం మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. ఇది తెలిసిన అధికారులు మిగిలిన వారు వెళ్లిపోకుండా కాపర్‌ డ్యాం ప్రాంతాన్ని మూసివేశారు.

ప్రజలను నియంత్రించడం, సమ్మోహనం చేయడంలో మాటల గారడీకి మించిన మంత్ర దండం లేదని భావించే ప్రధాని మోదీ ఈ సంక్షోభ సమయంలోనూ అదే నిర్లక్ష్యాన్ని, నియంత లక్షణాన్ని, బాధ్యతారాహిత్యాన్ని, దోపిడీ స్వభావాన్ని నిర్లజ్జగా, నిర్భీతిగా ప్రదర్శిస్తున్నారు. కరోనా నుంచి బయటపడాలంటే ముందు ఆకలి రోగానికి చికిత్స చేయాలనీ, అందుకు సకల వనరులు, సదుపాయాలూ ప్రభుత్వం దగ్గర నిండుగా ఉన్నాయనీ.. అన్ని రంగాలకు చెందిన ప్రజానుకూల మేధావులు, నాయకులూ నెత్తీనోరూ బాదుకుంటున్నా మోదీ పెడచెవిన పెట్టారు. దేశంలోని దాదాపు ఐదు కోట్ల మంది వలస కార్మికులను కడుపుకింత తిండి, నెత్తికింత నీడ, వొంటి కింత బట్టా.. అన్నిటికన్నా ముఖ్యంగా ‘మీకు మేం ఉన్నాం’ అన్న భరోసాను ప్రభుత్వం కల్పించడం విఫలమైంది. వారిని రోడ్లపాలు చేసింది. ఏ మాత్రం ప్రత్యామ్నాయ చర్యలు, ప్రణాళికాబద్ధ ఆచరణ లేకుండా అత్యంత బాధ్యతారహితంగా లాక్‌డౌన్‌ను ప్రకటించి, దేశం మొత్తాన్ని ఆరుబైలు జైలుగా మార్చింది. దీంతో వలసకూలీలు, పేదలు చావుకీ బతుక్కీ మధ్య సర్కస్‌ విన్యాసం చేస్తూ దినదిన గండం నూరేళ్లాయుష్షులా కాలం వెళ్లదీస్తున్నారు. పెట్టుబడిదారీ శక్తుల పెంపుడు బిడ్డలే అయినా ఇంకా మాన వీయ తడి ఆరని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, రిజర్వుబ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌లాంటివాళ్ళు.. లాక్‌డౌన్‌ ఇంకా ఇలాగే కొనసాగితే కోట్లాది అసంఘటితరంగ కార్మికులు, రోజు కూలీలు, కడు పేదలూ ఆకలి చావుల బారినపడే దుస్థితి నెలకుంటుందనీ, కరోనా మరణాల కన్నా ఆకలి చావులు అనేక రెట్లు అధికంగా ఉంటాయనీ, వీరి ప్రాణాలు కాపాడేందుకు తక్షణం 60 వేల కోట్లు విడుదల చేయాలనీ విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక చేస్తూన్నా పాలకులు పెడ చెవిన పెడుతున్నారు. దేశ గోడౌన్లలో ఆహారధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని బయటకు తీసి ప్రజలకు పంచేందుకు పాలకులు ఎందుకు సిద్ధంగా లేరు? వలస కూలీలు చేసిన నేరం ఏమిటి? వారిని ఖైదీల్లా బంధించడం ప్రభుత్వ నేరం కాదా? క్వారంటైన్‌కు పంపించినా అక్కడ కనీస సౌకర్యాలు లేవు, ఇందుకు బాధ్యత పాలకులది కాదా? నిజానికి, 200లక్షల కోట్ల జీడీపీ కలిగిన దేశం 60 వేల కోట్లు విడుదల చేసి తమ ప్రజల ప్రాణాలను, తమ దేశ శ్రమశక్తినీ కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కార్పొరేట్లకు కొమ్ముకాచే ఈ పాలకుల నుంచి పనిచేసే చేతులకు సాయం అందాలని ఆశించడం అత్యాశేనని ఈ కరోనా నిరూపించింది.

అసలు వలస కూలీల కోసమే గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టింది. వారున్న ప్రాంతాల్లో పనులు కల్పించడమే కదా ఆ పథకం ఉద్దేశం. కోట్లాది రూపాయలు పథకం పేరుతో ఖర్చుపెడుతున్నా ఈ వలస బాధలు ఏమిటి? ఆ పథకం కింద పనులు కల్పిస్తే ఇంతమంది వలస వెళ్లే వారు కాదా కదా? లాక్‌డౌన్‌ పుణ్యమా అని వలస కూలీలు లక్షల్లో ఉన్నారని తెలిసింది. వీరికి ఎటువంటి రక్షణ చర్యలులేవు, హక్కులులేవు, ప్రాంతంకాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు చెప్పినట్టు వెట్టి చాకిరి చేయాల్సిందే. రోజుకు 12 – 16 గంటలు పనిచేయించుకుంటున్న సంస్థలు ఉన్నాయి. వారికి న్యాయమైన కూలీ అందడం లేదు. ఇందుకు ఉదాహరణ పోలవరం ప్రాజెక్టులో లాక్‌డౌన్‌లో కూడా ప్రాజెక్టులో నిర్బంధంగా పనిచేయించడమే. వీరి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావల్సిన అవసరం ఉంది. అందుకు అఖిలపక్షంగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. 

కె. రామకృష్ణ 

కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ

Advertisement
Advertisement
Advertisement