Abn logo
Oct 20 2021 @ 23:40PM

టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

మాట్లాడుతున్న రవీంద్ర

విశాఖ పార్లమెంట్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర


పెదవాల్తేరు, అక్టోబరు 20: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయాలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర అన్నారు. బుధవారం లాసన్స్‌ బే కాలనీలోని నగర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడతూ ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు కూడా  ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై  వ్యక్తిగతంగా విమర్శిస్తూ, ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని చట్టపరంగా, న్యాయస్థానాల ద్వారానో లేదా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలని, కానీ అధికార పార్టీ  భౌతిక దాడులకు పాల్పడడం  సరికాదన్నారు. రెండు పార్టీల నేతలు సంయమనం పాటించాలని, గతంలో వైసీపీ నేతలు ప్రతిపక్షాలను పత్రికాముఖంగా దుర్భాషలాడినప్పుడు కూడా బీజేపీ ఖండించిందన్నారు.  అధికార, ప్రతిపక్ష పార్టీల తీరు  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టుందని, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని  విష సంస్కృతిని చూస్తున్నామన్నారు. ఇప్పటికే ఆర్థికంగా దిగజారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరముందని, ఇలాంటి చిల్లర రాజకీయాలను మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.