Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘వరి అన్నం తిన్నట్టుగా మాకు కలలు వస్తాయి’

ఏడుదశాబ్దాల క్రితం తెలంగాణ ప్రజలు పాడుకున్న ‘పాలుమరచీ ఎన్నాళ్ళయ్యిందో’ అనే పాట నేటికీ తమిళనాడులోని బాల బానిసల విషాద బతుకులకి వర్తిస్తుంది. నలభై ఏళ్ళ క్రితం తెలుగు ప్రాంతాల్లో విన్న గాథలు తమిళనాట ఇంకా వినిపిస్తున్నాయి. 2021 డిసెంబర్‌లో బయటపడ్డ ఆదివాసుల విషాద ఉదంతాలే అందుకు నిదర్శనాలు. ఆత్మగౌరవ ఉద్యమ పితామహుడు పెరియార్ ఇ.వి.రామస్వామి నాయకర్ పుట్టినరోజు సెప్టెంబరు 17ని ప్రతి సంవత్సరం ‘సామాజిక న్యాయదినం’గా పాటించాలని తమిళనాడు శాసనసభ గత సెప్టెంబర్ 6న ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొంది. బీజేపీ, పీఎంకేలతో పాటు అన్ని పార్టీలూ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపాదనను బలపరిచాయి. దళితులతో కులాంతర వివాహాలను నిషేధించాలని డిమాండ్ చేసిన, అలా ప్రేమ వివాహాలు చేసుకున్న దళితులను వేటాడిన చరిత్ర ఉన్న పార్టీ పీఎంకే. ఇటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ద్రవిడ పార్టీలు ఏనాడూ సంకోచించలేదు. ప్రస్తుతం అన్నాడిఎంకెతో పాటు భారతీయ జనతా పార్టీ పీఎంకేకు మిత్రపక్షాలుగా ఉన్నాయి. తీర్మానాలే కదా, ఆచరణ ఎవరు చూడొచ్చారు అనేది ఆ పార్టీల ధీమా కాబోలు.


ఒకే కుటుంబానికి చెందిన (6 నుంచి 9 ఏళ్ల వయస్సులో ఉన్న) నలుగురు పసివాళ్లను ఇటీవల నిర్బంధ వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేశారు. తలకు రూ.25వేల చొప్పున తన ఇద్దరు పిల్లల్ని తండ్రి సుందర్రాజు మేకల యజమాని గోవింద రాజన్‌కి విక్రయించాడు. మరో ఇద్దరు చిన్నారులను రూ.6వేల చొప్పున వెట్టిచాకిరీకి కుదిర్చాడు. 500 మేకలని కాయటం వారి పని. ‘ఏమిటిలా చేశారు’ అని అడిగితే ‘మన్నించాలి సార్’ అన్నదొకటే సుందర్రాజు జవాబు. ఇదెక్కడ జరిగిందో తెలుసా? మారుమూల కొండకోనల్లో కాదు, కావేరీ డెల్టా జిల్లాల్లో! తంజావూరుకు చేరువలోని ఒక గ్రామంలో ఏడేళ్ల క్రితం వెట్టిచాకిరీ నుంచి విముక్తి అయిన మూడు కుటుంబాల్లో సుందర్రాజు కుటుంబం కూడా ఒకటి. అయితే సరైన జీవనాధారంలేక, మళ్ళీ వెట్టిబతుకే గత్యంతరమయింది. మళ్ళీ గర్భం దాల్చిన భార్య, ఏడాది పసిబిడ్డల కోసం తనకు ఇది తప్పలేదని సుందర్రాజు చాలా మామూలుగా చెప్పాడు. వెయ్యి రూపాయలు, బియ్యం మూట తనకు ఇచ్చారనీ, సంక్షేమ సౌకర్యాలకు కావల్సిన గుర్తింపు కార్డులేవీ తనకి లేవని, సంచార జీవితం తమకు మామూలేనని అతడు అన్నాడు. ఈ వెట్టి శ్రామికులలో చాలామంది కర్ర బొగ్గు తయారు చేస్తుంటారు. తంజావూరులోనే కాక, రామనాథపురం, తిరుచానూరు, విల్లుపురం, కడలూరు, ధర్మపురి, క్రిష్ణగిరి జిల్లాల్లోనూ ఇలాంటి వారు చాలామంది ఉన్నారు.


మూడేళ్ళలో 60 మంది పిల్లల్ని విముక్తి చేసినట్టు తమిళనాడు కార్మికశాఖ వెల్లడించింది. అయితే అక్కడి క్రూరమైన వెట్టిచాకిరీ గురించి బయటపడింది చాలా స్వల్పమని కొన్ని ఎన్జీవోలు పేర్కొన్నాయి. ‘మేమే 40 మంది పిల్లల్ని విడిపించాం’ అని ఒక స్వచ్ఛంద సంస్థ చెప్పింది. నెలల తరబడి పగలంతా మేకలని మేపటం, రోజూ 10 కిలో మీటర్ల నడక, ఆరుబయలు నిద్ర, కాళ్లు చేతులపై గాయాలు, ఒక్క మేక తప్పిపోయినా తప్పని హింసలు, యజమాని కొట్టిన దెబ్బలు, ఏళ్ళ తరబడి తల్లిదండ్రులకి దూరంగా ఉండటం... ఇదీ, ఆ వెట్టిబాలల బతుకు. వారి ఒంటిమీద చిత్రహింసల గుర్తులే వారు ఈడుస్తున్న బతుకుకు సాక్ష్యం. గంజి గటకే వారి ఆహారం. ‘వరి అన్నం తిన్నట్టుగా మాకు కలలు వస్తుంటాయని’ ఆ పిల్లలు చెప్పారు. యాభై సంవత్సరాల క్రితం ‘రూపాయికే అన్నా బియ్యం’ పథకం ప్రవేశపెట్టిన తమిళనాడులో, అందునా ధాన్యాగారమైన సుసంపన్న కావేరీ డెల్టా ప్రాంతం తంజావూరు జిల్లాలో వర్తమాన దారుణం ఇది. రెండేళ్ళకు సరిపడ బియ్యం భారత ఆహార సంస్థ గోదాములలో ముక్కిపోతున్నాయి. స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకుంటున్న నవ భారతదేశంలోని దీనుల స్థితి ఇది. 


ఈ యాతనలు, వేదనలు అన్నీ తమకి మామూలే అన్నట్టుగా ఆ అభాగ్య తల్లిదండ్రులు మాట్లాడారు, కాదు, నిట్టూర్చారు. వారిలో చాలామంది 1990లలో సంభవించిన సంఘటనల ఆధారంగా నిర్మించిన ‘జైభీం’ సినిమాలో చూపిన ‘ఇరుల’ ఇత్యాది తెగలకు చెందిన వారే. మూడు దశాబ్దాల తర్వాత -‘రాజులు మారినా, రోజులు మారినా’ వారి బతుకులు మారలేదు. ‘ఎనిమిదేళ్ళలో- రామనాథపురంలోనే- ఆరుగురు యజమానుల చేతులు మారాను’ అని ఒక వెట్టి బాలుడు చెప్పాడు. ఆ ఆరుగురు యజమానుల పేర్లు కూడా తెలిపాడు. ‘నేను, ఇతర పిల్లలతో కలిసి మూడేళ్ళు వెయ్యి మేకల యజమాని వద్ద పనిచేశానని’ అని ముని రామన్ అన్న బాలుడు చెప్పాడు. ‘మా కుటుంబం గురించి ఆలోచనే మానేశాను, నా తల్లిదండ్రుల ముఖాల్ని క్రమంగా మరచి పోయాను’ అని కూడా ఆ నిర్భాగ్యుడు అన్నాడు. ‘మా అమ్మ జబ్బుపడితే రూ.40 వేలు అప్పిచ్చిన యజమాని వద్ద నా పిల్లవాణ్ణి పెట్టానని’ అన్నాడో తండ్రి. ‘మా పాప వైద్యానికి 10 వేలు తీసుకున్నాం. 5 వేలు అడ్వాన్సు ఇస్తే మా 11 ఏళ్ళ కరుప్పు సామిని పనిలో కుదిర్చాను’ ఆ వెట్టి బాలుడి తండ్రి బాబు అన్నాడు. అతడి తలిదండ్రులు ముళ్ళపొదల మధ్యన పాలిథిన్ పైకప్పుగల ఒక గుడిసెలో ఉంటారు. ‘రేషన్ కార్డు, ఇంటిపట్టా కోసం ఇంకా ఎదురు చూస్తున్నామని’ బాబు తండ్రి రామన్ చెప్పాడు. 2014లో ‘మూడు తరాల వెట్టి’ నుంచి విముక్తమైన కుటుంబాలలో రామన్‌ది కూడా ఒకటి. ‘కొవిడ్‌తో బతుకు ఇంకా దుర్భరమైంది. అలాంటి రోజుల్లోనే గోవిందరాజన్‌కి మా పిల్లల్ని ఇచ్చేశాం’ అని చెప్పారు. పోషణకు సరైన ఏర్పాట్లు లేని కారణంగా కొందరు పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించలేక, హాస్టల్లో పెట్టామని అధికారులు అన్నారు. ఏళ్ల తరబడి సమాజానికి దూరంగా అడవిలో ఉండటం వల్ల సామాజిక నైపుణ్యాలు, చొరవ, సంభాషణా శక్తి కోల్పోయిన పిల్లలు వాళ్ళు! మాటల్లో సామాజిక న్యాయం - ఆచరణలో దోపిడీ దౌర్జన్యాలు, వెట్టిచాకిరీ, వివక్ష... ఇదీ నేటి తమిళనాడులో కనిపించే ఒక మహా విషాదం. పాత ఫ్యూడల్ వర్గాలు పట్టణాలకు, ఇతర వృత్తులకూ వెళ్లిపోయారు. ప్రస్తావిత యజమానులు కొత్త భూస్వామ్య వర్గాలవారు; నిజానికి రిజర్వేషన్లు పొందుతున్నది మధ్య కులాలవారే; నేడు అధికారంలో వారిదే అధిక వాటా. బీహార్‌లో యాదవ సేనలూ, కుర్మీసేనలూ ఏర్పాటు చేసింది ఇలాటి వర్గాలే. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉన్నా అత్యధికులకు, ఇలాటి పీడితవర్గాలకు ఒరిగిందేమీ లేదు. లాభపడినవారు ఒరగబెట్టిందీ లేదు. ఇలాటి వర్గాలే గత కొన్ని దశాబ్దాలుగా– ఆత్మగౌరవ ఉద్యమం పేరిట – తమిళనాడుని శాసిస్తున్నాయి. ఎన్నోచోట్ల దళిత సర్పంచులను తమ కుర్చీల్లో కూర్చోనివ్వని, వారి భూములను కాజేస్తున్న, ఇంకా రెండు గ్లాసుల పద్ధతి వంటివాటినీ కొనసాగిస్తున్న కొత్త దొరలు వారు. తెలుగు ప్రాంతాల్లోని అంబేడ్కర్‌ – ఫూలే – పెరియార్ వాదులూ వాటి గురించి మాట్లాడరు. సామాజిక న్యాయం అంటూ ‘గాలిలో సిద్ధాంత పోరాటాలు’ చేస్తూ, ‘రాజ్యాంగ అధి కారం’ పేరిట వాస్తవంలో అధికారంలో తమ వాటాకోసం ‘భూపాలుర చుట్టూ’, ఆ పేదల్లాగే ‘మూడు తరాలుగా’ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎం. జయలక్ష్మి

Advertisement
Advertisement