Abn logo
Oct 20 2020 @ 00:12AM

నీళ్లున్నా.. కన్నీళ్లే !

Kaakateeya

 జలాశయాల్లో చేరిన 61.396 టీఎంసీలు

 అసంపూర్తిగా సాగునీటి కాలువలు

 పులివెందుల బ్రాంచి కెనాల్‌ అధునికీకరణకు రూ.186 కోట్లు వ్యయం

 నూతన అయకట్టు అభివృద్ధిలో నిర్లక్ష్యం

 గండికోటలో 17.500 టీఎంసీలు నిల్వ చేసినా ఆయకట్టుకు నీళ్లివ్వలేని దైన్యం

 తెలుగుగంగ ప్రాజెక్టుది అదే పరిస్థితి పరిస్థితి

 రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టారు

 సాగునీరు అందించే కాలువలు తవ్వకాల్లో అంతులేని జాప్యం


కరువు నేలకు కృష్ణా జలాలు మళ్లించాలనే లక్ష్యంగా రూ.వేల కోట్లు ప్రజాధనం వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించారు. వాటిని రైతులకు అంకితం చేశారు. ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువల నిర్మాణం.. ఆధునికీకరణలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఫలితంగా ఆయా జలాశయాల్లో 61.396 టీఎంసీలు నింపినా కాలువలు లేకపోవడం వల్ల మెట్టచేలకు సాగునీరు ఇవ్వలేని దైన్యపరిస్థితి ఉంది. తాళ్లప్రొద్దుటూరు బీసీ, ఎస్సీ కాలనీలను ముంచి గండికోటలో 17.500 టీఎంసీలు నిల్వ చేశారు. కాలువలు లేకపోవడంతో సర్వరాజసాగర్‌, వామికొండ జలాశయాల పరిధిలో సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. నీళ్లున్నా.. రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): 

జిల్లాలో గండికోట, బ్రహ్మంసాగర్‌, మైలవరం, వెలిగల్లు, అన్నమయ్య (చెయ్యేరు) ప్రాజెక్టు.. ఇలా చిన్నా పెద్ద ప్రాజెక్టులు 14 ఉన్నాయి. ఆయా రిజర్వాయర్ల సామర్థ్యం 84.217 టీఎంసీలు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడం, కృష్ణాకు భారీగా వరదలు రావడంతో ఇప్పటికే 61.396 టీఎంసీలు నిల్వ చేశారు. భారీ వర్షాలు కురవడంతో పాపాఘ్ని, పెన్నా, పింఛా, చెయ్యేరు నదులకు వరద ఉప్పొంగింది. దీంతో చెయ్యేరు, వెలిగల్లు, పింఛా ప్రాజెక్టుల్లో ఆశాజనకంగా నీరు చేరింది. 2007 తరువాత బ్రహ్మంసాగర్‌లో తొలిసారిగా 12.175 టీఎంసీలు నిల్వ చేశారు.


వరద జలాలతో జలాశయాలు కళకళలాడతున్నాయి. కరువు నేలకు సాగునీరు చేరి.. పచ్చని పైర్లతో మెట్టప్రాంతం సస్యశ్యామలం అవుతుందని.. కష్టాలు తీరుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. సాగునీరు అందించే పంట కాలువలు అసంపూర్తిగా ఉండడమే ప్రధాన కారణం. నీటిని నింపేందుకు చొరవ చూపిన నేతలు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలో 6.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిస్థాయిలో సాగునీరు అందించే అవకాశం ఉన్నా.. సగం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఇంజనీర్లే అంటున్నారు. 


గండికోటలో 17.500 టీఎంసీలు నిల్వ చేసినా..?:

గండికోట జలాశయం సామర్థ్యం 26.850 టీఎంసీలు. గత ప్రభుత్వం 12 టీఎంసీల నీటిని నిల్వ చేసింది.. మేము అంతకంటే ఎక్కవ నిల్వ చేయాలనే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళ్లింది. తాళ్లప్రొద్దుటూరు బీసీ, ఎస్సీ కాలనీలను ముంచి 17.50 టీఎంసీలు నిల్వ చేశారు. జలాశయాల్లో నీటిని నిల్వ చేయడం మంచిదే. మెట్టచేలు సస్యశామలం చేయవచ్చు. అందుకు సరిపడా సాగునీటి కాలువలు ఉన్నాయా..? ఆయకట్టుకు సాగునీరు మళ్లించే పంట కాలువలు అభివృద్ధి చేశారా..? అంటే లేదనే ఇంజనీర్లు సమాధానం చెబుతున్నారు. జీఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు ఫేజ్‌-2లో భాగంగా చేపట్టిన ప్రధాన కాలువలే పూర్తి కాలేదు.


గండికోట జలాశయం నుంచి వామికొండ, సర్వరాజసాగర్‌కు నీటిని మళ్లించేందుకు ప్రధాన కాలువ ఉన్నా.. ఆ రిజర్వాయర్ల నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించే పంట కాలువలు ఏళ్లు గడిచిపోతున్నా అసంపూర్తిగానే ఉన్నాయి. సర్వరాజసాగర్‌ రైట్‌ మెయిన్‌ కెనాల్‌ 16.65 కి.మీలకు గానూ 9 కి.మీలే తవ్వారు. మిలిగిన 7.65 కి.మీలు తవ్వాలి. లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ 9.3 కి.మీలకు గానూ 8 కి.మీలు పూర్తి చేస్తే.. 1.30 కి.మీలు తవ్వాలి. ప్రధాన కాలువ కింద తూములు, డ్రాపులు, డిస్ర్టిబ్యూటర్లు, కల్వర్టులు వంటి స్ట్రక్టర్స్‌ నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టరు విన్నపం మేరకు పనులు రద్దు చేశారు. రీఎస్టిమేషన్‌ తయారీలో నిమగ్నం అయ్యారు. అంటే.. ఈ ఏడాది సాగునీరు ప్రశ్నార్థకమే. 


రూ.186 కోట్లు ఖర్చు చేసినా కన్నీళ్లే...

గండికోట నుంచి చిత్రావతి రిజర్వాయర్‌కు 10 టీఎంసీలు, పైడిపాలెం జలాశయానికి 6 టీఎంసీలు ఎత్తిపోసి సీఎం జగన్‌ స్వంత నియోజకవర్గం పులివెందుల ప్రాంతంలో 42 వేల ఎకరాలు పాత ఆయకట్లు, 72 వేల ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. ప్రస్తుతం చిత్రావతిలో 7.304 టీఎంసీలు, పైడిపాలెంలో 5.770 టీఎంసీలు నిల్వ చేశారు. అయినా.. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని దైన్యం. కారణం.. పంటకాలువలు అభివృద్ధి చేయకపోవడమే.


2006లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పీబీసీ ఆధునికీకరణకు రూ.253 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.186 కోట్లు ఖర్చు చేశారు. పంట కాలువలు అసంపూర్తిగా ఉండడంతో నూతన అయకట్టు అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉంది. దీంతో చెరువులకు నీటిని వదులుతున్నారు. కాలువల పక్కనే ఉన్న రైతులు మోటార్ల ద్వారా పంటను తడుపుతున్నారు. 



నాలుగేళ్ల వరకు నిధులు లేవు

బ్రహ్మంసాగర్‌ సామర్ధ్యం 17.740 టీఎంసీలు. 2007లో 13 టీఎంసీలు నిల్వ చేస్తే లీకేజీలు వచ్చాయి. 2010లో 11.84 టీఎంసీలు నింపితే మళ్లీ లీకులు వచ్చాయి. నాటి నుంచి 8-10 టీఎంసీలకు మించి నిల్వ చేయలేదు. తొలిసారిగా 12.175 టీఎంసీలు నిల్వ చేశారు. కాలువలు అసంపూర్తి వల్ల నీళ్లున్నా పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి.


బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ కాలువల నిర్మాణం, సీసీ లైనింగ్‌ కోసం రూ.641 కోట్లు కేటాయించారు. 95 శాతం పనులు పూర్తి చేసి రూ.600 కోట్లు వెచ్చించారు. 5 శాతం పనులు పెండింగ్‌ వల్ల చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి. రైట్‌ కెనాల్‌ అట్లూరు సమీపంలో 700 మీటర్లు ఆక్విడెక్ట్‌ అసంపూర్తిగా ఉండడంతో 8-10 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎస్‌ఆర్‌-1 పరిధిలో బ్లాక్‌ 45, 47 పరిధిలో అసంపూర్తి పనులు వల్ల 7-8 వేల ఎకరాలకు నీరు అందడం లేదు. ఇలాంటి ఎన్నో లోపాలు.

కాగా.. పనులు చేసిన కాంట్రాక్ట్‌ సంస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అలాగే.. ఈ కాలువ మరమ్మతులు, అసంపూర్తి పనులకు నాలుగేళ్ల వరకు ఎలాంటి నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


రూ.100 కోట్లు కావాలి 

- శారద, ఎస్‌ఈ, తెలుగుగంగ ప్రాజెక్టు, కడప

టీజీపీ పరిధిలో 5 శాతం అసంపూర్తి పనుల వల్ల చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని మాట వాస్తవమే. రూ.100 కోట్లు ప్రభుత్వం ఇస్తే పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వవచ్చు. కాంట్రాక్టరు విన్నపం మేరకు పనులు రద్దు చేస్తూ.. మరో నాలుగేళ్ల వరకు ఎలాంటి పనులు చేయవద్దని ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో అసంపూర్తి కాలువ పనులు చేయలేకపోతున్నాం.


ఆయా రిజర్వాయర్ల సామర్థ్యం, ప్రస్తుత నిల్వ (టీఎంసీలు):  

 

జలాశయం సామర్థ్యం ప్రస్తుత నిల్వ

 

గండికోట 26.850 17.500

బ్రహ్మంసాగర్‌ 17.00 12.075

ఎస్‌ఆర్‌-1 2.133 1.711

ఎస్‌ఆర్‌-2 2.444 1.938

చిత్రావతి 10.00 7.304

పైడిపాలెం 6.000 5.770

మైలవరం 6.500 6.500

అన్నమయ్య 2.240 2.126

పింఛా  0.330 0.327

లోయర్‌ సగిలేరు 0.170 0.066

వెలిగల్లు  4.64 2.894

బుగ్గవంక 0.510 0.473

వామికొండ 1.680 1.648

సర్వరాయసాగర్‌ 3.060 1.064

------------------------------------------------------

మొత్తం 84.214 61.396

-------------------------------------------------------


Advertisement
Advertisement