Abn logo
Jan 18 2021 @ 05:00AM

గద్దలాడతండాయి మార్మిక సంకేతాల హెచ్చరిక

రాయలసీమ గ్రామీణ పరిభాషలో గద్దలాడ్డమనేది ఒక సంకేతం. అది ఒక సాంకేతిక పదం. మెతుకు దొరకని ఆకలి గడ్డ కాబట్టి సీమ కరువు బతుకులపై ఎప్పుడూ డేగకళ్ళు పడుతుంటాయి. బడుగు జీవులైన రైతులూ రైతుకూలీల కష్టార్జితాన్ని కాజెయ్యడానికి, వాళ్ళ ధనమానప్రాణాల్ని కొల్లగొట్టడానికి అడుగడుగునా గద్దలాడుతుంటాయి. ఇక్కడి నిచ్చెనమెట్ల సమాజంలో నువు రైతైనా రైతుకూలీ ఐనా ఆడమనిషివైనా మనుగడ సాగించడం అంత సలీసు కాదు. ఇక్కడ బతకాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. గద్దలు ఆడుతున్నాయంటే నీ ఇంటి ముందు తిరుగుతున్న కోడిపిల్లల్ని తన్నుకుపోతాయి జాగ్రత్త అని ఒక హెచ్చరిక. ఒకచోట గద్దలు ఆడుతున్నాయంటే పీక్కు తింటానికి అక్కడ ఒక వేట పడి ఉండాలి. ఒక చచ్చిన శవం పడుండాలి. డేగకళ్ళు ఉత్తినే పడవు మరి. గద్దలు ఊరికే ఆడవు మరి. నీ రెక్కల కష్టం వెచ్చించి మాంసం ముక్కలు కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటున్నపుడు వాటిని గద్దలు తన్నుకుపోకుండా నువు చాలా జాగ్రత్తగా ఉండాలి. గద్దచూపు ఒక్క కోడిపిల్లపై మాత్రమే ఉంటుంది. మాంసం ముక్కపై మాత్రమే ఉంటుంది. అది దొరికితే దాని ఆకలి తీరిపోతుంది. కానీ మనిషిచూపు అనే గద్దచూపుకు అదనంగా స్వార్థం ఉంటుంది. దానికి గతం గుర్తుంటుంది. పగ ప్రతీకారేచ్ఛ రగులుతుంటుంది. అందువల్ల అది చాలా ప్రమాదకారి. దీన్ని సంకేతిస్తూ జాగ్రత్తగా బతకమని సందేశిస్తూ సీమ మాండలికంలో బండి నారాయణస్వామి రాసిన ‘గద్దలాడతండాయి’ నవల మళ్ళీ మళ్ళీ పఠనీయం, చర్చనీయం అయింది.   


గద్దలాడతండాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్ళ నాటి సీమ సామాజిక జీవితంలో వచ్చిన అలజళ్ళను, పొంతనలేని వైరుధ్యాలను కథనం చేసింది. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉంటూ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యస్థానంలో ఉండేది. ఇతర సామాజికవర్గాలు, రెడ్లలోనే అవకాశాలు రానివాళ్లూ దిక్కు తెలియని ఒక శూన్యతలో నిరాశానిస్పృహల్లో ఉండేవాళ్ళు. అప్పుడున్న రాజకీయపరమైన ఖాళీని పూరించిన తెలుగుదేశం పార్టీ రూపంలో ఒక ఆసరా దొరికేసరికి వాళ్ళంతా అందులోకి దూకారు. అప్పటికీ అవకాశాలు రానివాళ్ళు పదే పదే పార్టీలు మార్చారు. ఈ ఉరవళ్ళలో ఎప్పుడూ కరువు తాండవించే అనంతపురంజిల్లా సామాజిక జీవితంలో ఒక సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితుల్ని కథనం చెయ్యాలని రచయిత అనుకోవడం వల్ల గద్దలాడతండాయి ఇతివృత్తం అనివార్యంగా సాంఘికేతివృత్తం అయ్యింది. అందువల్ల ఇందులో మనకు ఒక నాయకుడు, ఒక నాయిక అంటూ కనబడరు. సామాజిక జీవితం ఎలా ముక్కలుగా ఉంటుందో అలా ఇతివృత్తం కూడా శకలాలు శకలాలుగా ఉంటుంది. ఆనాటి సమాజం అంతటినీ ఒక కట్టకట్టి ఒక చిన్న నవలికగా మలచడం నారాయణస్వామికే సాధ్యమైంది.  ప్రసిద్థ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి గారు తనకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు తెచ్చిపెట్టిన ‘మన నవలలు మన కథానికలు’ గ్రంథంలో మొదటి వ్యాసం నారాయణస్వామి గారి గద్దలాడతండాయి పైనే రాశారు. ‘నిచ్చెనమెట్ల సమాజానికి నిలువెత్తు రూపం గద్దలాడతండాయి’ అనే శీర్షికతో ఉన్న ఆ వ్యాసంలో చంద్రశేఖర్‌ రెడ్డి గారు నవలని చక్కగా విశ్లేషించారు. ఈ వ్యాసం చదివి, నవలని చదివితే నవలపైనా రచయితపైనా కొన్ని సందేహాలు, ప్రశ్నలు పాఠకునికి కలుగుతాయి. 


నవల్లో ప్రస్తావితమైన సమస్యలకు రచయిత పరిష్కారాలు చూపించాడా? అనేది దీనిని చదివినవాళ్ళకు వచ్చే మొదటి సందేహం. నిజమే గద్దలాడతండాయిలో చిలుకూరి దేవపుత్ర గారి ‘పంచమం’లో లాగా, ‘అద్దంలో చందమామ’లో లాగా చైతన్యం ఉన్న పాత్రలు గానీ, ఉద్యమించిన పాత్రలు గానీ లేవు. స్కూలు అయ్యవారిలో కొంచెం చైతన్యం ఉన్నా అతడు అనుభవం చాలని పిల్లయ్యవారు. ‘‘ఎంత కష్టం జేసినా కడుపు కోసరమే కదా, అయ్యవారూ!, కడుపు నిండినంక యాల కష్టపడల్ల?’’ లాంటి మాదిగల భౌతికవాద తాత్వికత ముందు అతడు డంగైపోతుంటాడు. ఆర్‌.డి.టి. వాలంటీరుగా పల్లెల్లో చైతన్యం తీసుకురావడానికే వచ్చిన చలపతి స్ర్తీవ్యామోహంలో పడి కొట్టుకుపోతాడు. అతడు చైతన్యం తీసుకు వచ్చే దిశగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా రచయిత చూపలేదు. ఆ ప్రయత్నాలు ఆచరణలో ఇలా వ్యక్తిగత బలహీనతలవల్ల విఫలం చెందుతాయి అని చూపడానికే రచయిత పరిమితమయ్యారు. ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ నవల ఉద్దేశం దాని పేర్లోనే ఉంది. ఎదురుగా నిలబడి దోచుకుంటూ ఉండి కూడా కనిపించని సమస్యని దాని చీకటి ముడులు విప్పి వేలెత్తి చూపడమే దాని పని. జాగర్త అని హెచ్చరించడమే దాని కర్తవ్యం. ఆ ఆడుతున్న గద్దల బారిన పడకుండా తన పిల్లల్ని కాచుకోవడం వాటి తల్లికోడి పని. వాటి యజమాని పని. రచయిత ఈ నవల్లో ఏ సామాజిక వర్గం వైపూ పూర్తిస్థాయిలో మొగ్గిన దాఖలాలు కూడా లేవు. నిమ్మకు నీరెత్తినట్లు కనబడ్డారు. అటు ఆధిపత్య కులాలదైన సంపన్న వర్గానికీ, ఇటు అట్టడుగు వర్గానికీ చెందని రచయితల్లో ఇలాంటి బహుళతాత్వికమైన ఊగిసలాట సహజమే.  


1984, 85 ప్రాంతాల్లో పెద్ద కులాలవాళ్ళు, అధికారులూ దళితుల పట్ల ఈ నవల్లో మాట్లాడుకున్నంత పచ్చిగా మాట్లాడతారా? అనేది మనకు కలిగే రెండవ సందేహం. దీనికి 1984, 85 కాదు కదా, ఎస్సి ఎస్టి అట్రాసిటీస్‌ చట్టంపై గొప్ప చైతన్యం వచ్చి, దాని వినియోగ దుర్వినియోగాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ కాలంలో ఈ 2020, 21ల్లో మన పల్లెసీమలకు పోయినా కూడా సమాధానం దొరుకుతుంది. చలపతి కట్నం సంగతి మరిచిపోయి జయమ్మని లేపుకుపోవడం ఎలా కుదురుతుంది? అనేది పాఠకునికి సందేహం కలిగించే మరో సంఘటన. దీనికి సమాధానం సులభంగానే ఊహించుకోవచ్చు. తండ్రి వద్ద దెబ్బలు తిన్న జయమ్మ ఆవేశంలో చలపతి వద్దకు పోయి తను వట్టి మోసకారి అనీ, కట్నాన్ని తప్ప తనను చూడ్డం లేదనీ ఎనెన్నో నిందలు వేసుంటుంది. తన నిజాయితీని నిరూపించుకోడానికి ఆ ఆవేశంలో చలపతి జయమ్మని లేపుకుపోయాడు. ఇది చాలా ప్రేమ వ్యవహారాల్లో జరిగేదే. నిత్యం పేపర్లో వచ్చేదే. విమర్శకులతో బాటు పాఠకులు కూడా దీన్ని పసిగట్టగలంతటి గడుసర్లే అని రచయిత భావించాడు. అందుకే దాన్ని వాచ్యం చెయ్యలేదు.   


వెంకటేశులు భార్య రాములమ్మ శంకరరెడ్డికి లొంగిపోయినట్లు చెప్పడం, లింగప్ప కోడలు గౌరమ్మ అత్తమామలు, మొగుడు బాధపడలేక బళ్లారిలో డ్రైవర్‌ తో లేచిపోయిందని చెప్పడం కథలో ఎంతో అవసరం. కాని వడ్డె లింగప్పకు ఈడిగ రంగమ్మకు మధ్య ఒక గడ్డిమోపు కోసం వివాహేతర సంబంధం కల్పించడం ద్వారా రచయిత ఏ నైతిక విలువల్ని ప్రతిపాదించదలచుకున్నాడు?  అనేది పాఠకుని వచ్చే మరో సందేహం. ఈడిగ రంగమ్మ లింగప్పతో సంబంధం పెట్టుకోవడంలో చాలా అవసరాలున్నాయి. లింగప్పతో సంబంధం వల్ల గడ్డికట్ట లాభంగా వస్తుంది (ఒక్కటి కాదు రోజుకొక్కటి). చాలా చిన్నదే ఐనా కరువు కాలంలో అది ఎంతో ప్రయోజనం. రంగమ్మ భర్త ప్రవాసంలో ఉన్నాడు. లింగప్ప భార్య ప్రవాసంలో ఉంది. అందువల్ల రంగమ్మకే కాకుండా లింగప్పకు కూడా శారీరకావసరం ఉంది. ఇది అసలు కారణం. ఇంతకన్నా పెద్దదైన సాహిత్యావసరం ఒకటి రచయితకున్నది. దీని ద్వారా సీమ బతుకుల్లోని న్యూనస్థితిని సూచించవచ్చు. దానితోనే ముందు ముందు నాగేంద్రప్ప లాంటి గద్ద చేతిలో లింగప్ప లాంటివాడు కోడిపిల్లై ఐదువందలు అప్పనంగా ముట్టజెప్పి బలి కావడాన్ని కథనం చెయ్యొచ్చు. అందువల్ల నవల్లో రంగమ్మ రంకు వ్యర్థం కాదు. అనర్థం అంతకన్నా కాదు. నవలకు ఉన్న ఆయువుపట్టుల్లాంటి అనేక సంఘటనల్లో ఇదీ ఒకటి. నాగేంద్రప్ప చెయ్యని నేరానికి అపరాధం వసూలు చేసి తన్నుకుపోయిన ఈలగద్ద లింగప్ప ఐతే, ఆ గద్దని ఆడించిన నెఱజాణ రంగమ్మ. అది నిజమైన నెఱజాణతనం కాదు. అది కరువు బతుకుల్లోని ఒక నిస్సహాయతలోంచి, ఒక అనివార్యతలోంచి పుట్టుకొచ్చింది. అందుకే రంగమ్మ చావు దెబ్బలు తిని అభాసుపాలయ్యింది. తనూ తన మొగుడు శీనప్పా సిగ్గూశరం లేని లండబతుకు బతకాల్సి వచ్చింది. ఇలాంటివి చూడ్డానికి ఆభాసాలుగా కనబడుతున్నా అవి సీమబతుకుల్లో భాగమై ఉన్నాయి. అవి అనుకోకుండా రచయిత దృష్టిలో పడుతున్నాయి. అందుకే స్వామి రచనల్లో చిన్నచిన్న అవసరాలకోసం చేలగట్లలో, గడ్డివాముల్లో, ధాన్యపు గరిసెల్లో కొంగు పరచిన నిస్సహాయ స్ర్తీల ఉదంతాలు తరచుగా కనబడుతుంటాయి. 


రచయిత తన తాత్త్విక దృక్పథాన్ని ఎందుకు బయట పెట్టలేదు? తాను ఏ పాత్రలోనూ కనబడకుండా ఎందుకు అంత అంతర్ముఖీనం అయ్యాడు? అనే ప్రశ్నలు కూడా సందిగ్థావస్థలో పడేస్తాయి. ఐతే ప్రభుత్వం నిమ్నకులాలకు చేేస సాయంపై విభిన్న కులాలవాళ్ళు వ్యక్తం చేేస అభిప్రాయాల్లో రచయిత ఉన్నాడు. ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము తినడంలో ‘‘తిక్కోని పెండ్లిలో తినిండేవాడే బుద్థిమంతుడు’’ అంటూ శంకర్‌ రెడ్డి లాంటి రెడ్లు, ‘‘సర్కారు సైడు మాదిరి నాలుగు ఎకరాలు ఉన్నోల్లంతా లక్షాధికారులు కారు’’ అని నాగేంద్రప్ప లాంటి బీసీలు చెప్పుకునే సమర్థనల్లో ఉన్నాడు. బావులు బోర్లు నీళ్ళు లేక ఎండిపోవడంపై, ప్రభుత్వం బి.టి. ప్రాజెక్టు కట్టిన ఉద్దేశంపై, వాన రాకడపై, కరువుపై, కూలివలసలపై, అడవులు తరిగిపోవడంపై, జంతుజాలం కనుమరుగైపోవడంపై చేసే చర్చల్లో ఉన్నాడు. పొలాలు తోటలూ కలిగి ఉండడం, ేసద్యాలు చెయ్యడం, అవి గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకోవాల్సి రావడం లాంటి బాదరాబందీలు లేకుండా ఎప్పటికప్పుడు కూలి చేసుకుని ఉన్నంతలో తింటూ నిమ్మలంగా బతకడం అలవాటుగా ఆచారంగా చేసుకున్న మాదిగల తాత్వికత లో రచయిత తాత్విక దృక్పథం ఇమిడి ఉంది. దాన్ని అర్థం చేసుకుని తమ ఉద్యోగాల్ని నిలుపుకోవడం కోసం హరిజనుల్ని బలవంతంగా చదివించి పాడు చెయ్యరాదు అనుకొన్న స్కూలు అయ్యవారులో రచయిత దాగి ఉన్నాడు. రెడ్లు చేసే రాజకీయాల్లో వారి కనుసన్నల్లో జరిగే ఎన్నికల ప్రక్రియని వర్ణించడంలో రచయిత వ్యంగ్య తాత్వికత దృశ్యమానం అవుతున్నది. రైతు పండించిన పంటల ధరలపై జరిగే చర్చల్లో రచయిత కనబడుతున్నాడు. రైతుకు లాభించని పంటలు వ్యాపారులకు ఎలా అంతలేసి లాభాలు తెచ్చిపెడుతున్నాయి? అని చేసే తర్కాల్లో కనబడుతున్నాడు. రెడ్ల ఆధిపత్యంపై బోయల్లో జరిగే చర్చల్లో ముఖ్యంగా భీమన్న మాటల్లో కనబడుతున్నాడు. రచయిత తత్వానికీ అతడు బహిర్గతం కావడానికీ ఇంతకన్నా సాక్ష్యాలు అవసరం లేదు.  


నవల చివర్లో జయమ్మ శవం పిల్లను ప్రసవించినట్లు చెప్పడం ద్వారా రచయిత ఏమి చెప్పదలచుకున్నాడు? ఆ సంఘటనతో నవలను ముగించాడంటే రచయిత దృష్టిలో దానికి చాలా ప్రాముఖ్యత ఉండాలి కదా! మరి దానిని ఎందుకు ఎస్టాబ్లిష్‌ చెయ్యలేదు? అన్న సందేహం పాఠకునికి తప్పకుండా కలుగుతుంది. నిజమే కథాంతంలో జయమ్మ వికృతమైన శవం పిల్లని కంటుంది (ఇలా చచ్చిన బిడ్డని కనడాన్ని యాస్కపోయింది అంటారు సీమపల్లెల్లో). ఇది ఎందుకని పాఠకులకు సందేహం రావడం సహజమే. కానీ దాని వెనుక ఒక నిగూఢమైన మర్మికార్థం దాగి ఉంది. అదే ఈ నవలకు ఆయువుపట్టు. అదే ఈ నవల ఇచ్చిన సందేశం. ఎలా అంటే... అంతకు మునుపు కథ మధ్యలో వెంకటేశులు నాటిన వంగచెట్లు విత్తనాల వ్యాపారి చేసిన మోసం వల్ల చిన్న చిన్న గోలీకాయల్లాంటి కాయల్ని కాసి అతనికి తీరని నష్టం కలిగించాయి (వాటిని ‘కుక్కమూతి పిందెలు’ అంటారు). అది అతని వ్యక్తిగత నష్టమే ఐనా దేశంలోని రైతులందరికీ వెంకటేశులు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇక ఇక్కడ కథాంత ఉదంతంలో జయమ్మలోని ‘జయ’ శబ్దాన్ని తీసుకుంటే దానికి భారతం అని అర్థం. జయమ్మ తన తండ్రికి సమ్మతం కాని వాడితో లేచిపోయి, గతిలేక ఇంటికి తిరిగివచ్చి కన్నది వికృతమైన బిడ్డని. ఆ చచ్చిన పిల్ల కోసం కూడా పల్లెపై గద్దలు ఆడుతూ ఉన్నాయి. బడుగువర్గాల అభ్యున్నతి కోసం ప్రజా సమ్మతి లేకుండా దేశస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ క్షేత్రస్థాయిలో చిత్తశుద్థి లేని యంత్రాంగం వల్ల శవంపిల్ల లాంటి వికృతమైన ఫలితాలనే ఇస్తున్నాయనీ, ఆ వికృతమైన ఫలితాల్ని కూడా తన్నుకుపోడానికి అసాంఘిక శక్తులు కాచుకుని ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని స్వామి హెచ్చరిస్తున్నారు. ఇదీ చరమార్థం. జయమ్మ పేరు వెనుక ఇంత మార్మికార్థం దాగుందా? దాన్ని రచయిత ఉద్దేశపూర్వకంగానే పెట్టారా? లేక అది యాదృచ్ఛికంగా జరిగిందా? అనేది రచయితకే తెలియాలి. ఐనా మనకు దానితో పనిలేదు. అది అలా జరిగింది. అది ఇచ్చిన మిగతా అంతర్లీనమైన సందేశం అక్షరాలా వాస్తవం. కథాస్థలం పేరు పాపంపల్లె కాబట్టి దాని పాపం పండి జయమ్మ కనిన శవంపిల్లతో ఇక రాబోయే అనర్థాలకు ముందస్తు అపశకునంగా కూడా సంప్రదాయవాదులు భావించవచ్చు. ఇలాంటి కళాత్మకమైన వస్తు శిల్పాల్ని రచయితలు కథనంలో అంతర్లీనం చెయ్యడం, వాటిని విమర్శకులు గుర్తించి వెల్లడి చెయ్యడం కొత్త కాకపోయినప్పటికీ శ్రీరామకవచం సాగర్‌ వాటిని ‘ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు’ అని  ప్రతిపాదిస్తూ ఒక విమర్శా గ్రంథం రాశారు. వారి ప్రతిపాదనని మనసారా స్వాగతిద్దాం. 

కవితశ్రీ 

94946969900

Advertisement
Advertisement
Advertisement