Abn logo
Oct 20 2020 @ 02:19AM

వేర్‌హౌస్‌ యజమాని కుచ్చుటోపీ

 రూ.4 కోట్లు పైగా ఐపీ 

 న్యాయం చేయాలని కలెక్టర్‌కు రైతుల వినతి

 ఆదోని, అక్టోబరు 19: మార్కెట్‌లో ధర లేక రైతులు శనగలను వేర్‌హౌస్‌లో నిల్వ ఉంచారు. దాని యజమాని రైతులకు బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చాడు. ప్రస్తుతం ధర ఒక్కసారిగా పెరగడంతో శనగలు అమ్ముకోడానికి రైతులు ముందుకొచ్చారు. తీరా  వేర్‌హౌస్‌ యజమాని ఇంటికి తాళం వేసి ఉడాయించినట్లు తెలుసుకొని నిర్ఘాంత పోయారు. చిప్పగిరిలోని ఓ వేర్‌హౌస్‌లో అదే మండలానికి చెందిన రైతులు తమ శనగ పంట దిగుబడులను జనవరి, ఫిబ్రవరి మాసాలలో నిల్వ చేశారు. దాని యజమాని రైతులకు బాండ్‌ పేపర్‌పైన సంతకాలు చేసి ఇచ్చారు.


వేర్‌హౌస్‌లో దాదాపు రూ.4 కోట్లకు పైగా సరుకు నిల్వ ఉంది. రైతులు 20 రోజుల కింద వ్యాపారికి క్వింటం శనగలు రూ.6 వేలు ప్రకారం విక్రయించారు. కానీ సరుకు ఇంకా వేర్‌ హౌస్‌లోనే ఉంది. కొనుగోలు చేసిన వ్యాపారికి అందజేయలేదు. వేర్‌హౌస్‌ యజమాని కోసం 20 రోజులుగా తిరుగుతున్నా కనిపించలేదు. ఇంటికి తాళం వేసి ఉంది. ముందుజాగ్రత్తగా వేర్‌ హౌస్‌ యజమాని ఐపీ నోటీసులు పంపించాడు. ఈ సంగతి తెలిసి రైతులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా వినతిపత్రం పంపించారు.


అయితే ఓ నాయకుడి వద్ద సదరు వేర్‌హౌస్‌ యజమాని ఆశ్రయం పొందినట్లు సమాచారం. రైతులే న్యాయం కోసం వస్తారని, అప్పుడు ఎంతో కొంత ఇచ్చి రాజీ చేస్తానని సదరు నాయకుడు నమ్మబలకడంతోనే యజమాని ఇలా ఈవిధంగా ఐపీ నోటీసులు పంపించారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఇందులో అధికార పార్టీ బడా నేత హస్తం ఉందని అంటున్నారు. 


Advertisement
Advertisement