Abn logo
May 25 2020 @ 13:44PM

వరంగల్ డెత్ మిస్టరీ: తల్లీకూతుళ్లను మాత్రమే టార్గెట్ చేసుకోవాలనుకున్నారు.. కానీ..

పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన బీహార్‌ నిందితులు

ఘటన వెనుక  మక్సూద్‌ అల్లుడి  హస్తం ఉందని అనుమానం

కొనసాగుతున్న విచారణ.. పోలీసులు నేడు బయటపెట్టే అవకాశం

కొలిక్కి వస్తున్న గొర్రెకుంట మృతుల కేసు


వరంగల్‌ రూరల్ (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ రూరల్‌ జిల్లా గొర్రెకుంట బావిలో పడి మరణించిన వారి కేసు మిస్టరీ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనతో పోలీసులు రహస్యాన్ని ఛేదించేందుకు  ప్రయత్నించి సక్సెస్‌ అయినట్టు సమాచారం. పలువురిని విచారించిన పోలీసులు నిందితుల నుంచి హత్యకుగల కారణాలను రాబట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది.   గురువారం మక్సూద్‌(50)తో పాటు అతడి భార్య నిషా(5), కుమార్తె బూస్రా(22) మూడేళ్ల మనవడు బావిలో శవాలుగా లభ్యం కాగా, శుక్రవారం మక్సూద్‌ కుమారులైన షాబాజ్‌ ఆలం(21), సోహెల్‌ ఆలం(18)తో పాటు బిహార్‌కు చెందిన వలసకార్మికులు శ్యాం(20), శ్రీరాం(21), త్రిపురకు చెందిన షకీల్‌ (30) మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. నాలుగురు రోజులు పోలీసులు, క్లూస్‌ టీంలు ఘటనా స్థలంతోపాటు, పరిసరాలను నిశితంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం రిపోర్టులో ప్రాణం ఉండగానే బావిలో పడినట్టు తేల్చడంతో కేసు మరో మలుపు తిరిగింది. మృతుల్లో విష ఆహారం ఉన్నట్టు తేలడంతో ఇదిముమ్మాటికీ హత్యే అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు అనుమానితులను విచారించి ఎట్టకేలకే హత్యకుగల కారణాలను రాబట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది.


బీహారీల పనేనా..

మక్సూద్‌ కుటుంబంతోపాటుగా మరో ముగ్గురిని మట్టుబెట్టింది బీహార్‌కు చెందిన వారేనని తేటతెల్లమైంది. మరణాల వెనుక మక్సూద్‌ అల్లుడి ఖతూర్‌ హస్తం ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటుగా మరో మహిళను విచారించిన పోలీసులు.. ఇవి ఆత్మహత్యలు కావని, హత్యేననే నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. బీహార్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సంఘటన జరిగిన రోజే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా విచారించిన పోలీసులకు చివరికి గుట్టు తెలిసినట్లు సమాచారం. మక్సూద్‌కు సమీప బంధువైన మహిళను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. డబ్బుల లావాదేవీలతో పాటుగా వివాహేతర సంబంధాల కారణంగానే మొత్తం అందరినీ మట్టుబెట్టినట్టుగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ సంఘటనకు మక్సూద్‌ పెద్ద కుమారుడి పుట్టినరోజు వేడుక వేదికగా మార్చుకుని ఉంటారని అనుకుంటున్నారు. పోలీసుల అదుపులో ఉన్న బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి మక్సూద్‌ కుటుంబంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. మక్సూద్‌ కుమార్తెతో పాటుగా అతడి భార్య నిశా గోదాం పైగదిలో ఉంటున్న శ్యాం, శ్రీరాంలతో సన్నిహితంగా మెలగడం నచ్చకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కరీమాబాద్‌కు చెందిన ఇద్దరితో పాటుగా బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులను రెండు రోజులుగా టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో విచారించిన అనంతరం నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమను కాదని మరొకరితో సన్నిహితంగా మెలగడంతో పాటుగా తమకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో మక్సూద్‌ కుమార్తె బుస్రా, అతడి భార్య నిశాలు ఇవ్వకపోవడం, స్వగ్రామానికి వెళ్దామంటే డబ్బులు లేకపోవడం వంటి విషయాలతో వారిని మట్టుబెట్టినట్టు సమాచారం. అలాగే మక్సూద్‌ అల్లుడి ఖతూర్‌ ఆదేశాల మేరకు హత్యలు చేసినట్లు వారు పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. 


మత్తుమందు కోసం సెర్చ్‌

పోలీసుల అదుపులో ఉన్న సంజయ్‌ ఫోనులో మత్తుమందు ఫొటోలు లభ్యమైనట్టు తెలిసింది. ప్రాణాలు తీయాలంటే ఏ మందు వాడాలో తెలుసుకోవడానికి సంజయ్‌ తన మొబైల్‌లో గూగుల్‌ సెర్చ్‌ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన స్ర్కీన్‌ షాట్స్‌ను పోలీసులు స్వాఽధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం ఇద్దరి మహిళలను హతం చేయాలని భావించిన నిందితులు.. ఆ తర్వాత కూల్‌డ్రింక్‌లో మత్తు(స్లీపింగ్‌ పిల్స్‌)ను కలిపి పార్టీకి వచ్చిన వారందరికీ తాగించడంతో అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం వారిని కూడా బ్యాగుల్లో సర్ది గదిపైకి తీసుకెళ్లి పడేసినట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధాలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ వరుస హత్యలు జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారని సమాచారం. బర్త్‌ డే పార్టీకి అనుకోకుండా వచ్చిన షకీల్‌ సైతం కూల్‌ డ్రింక్‌ తాగడంతో అతడిని కూడా బావిలో పడేసినట్టు తెలిసింది. నిందితుల నుంచి మక్సూద్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.


నేడు మీడియా ముందుకు..

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన బావిలో వరుస మృతదేహాల స్వాధీనం కేసులో నిందితులను సోమవారం మీడియా ముందు ప్రవేశపె ట్టే అవకాశం ఉంది. మక్సూద్‌, ఆయన కుమార్తె బుస్రా ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా నిందితులను చాకచక్యంగా ముందుగానే పోలీసులు అదపులోకి తీసుకొని విచారించారు. వీరితో పాటుగా కరీమాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని, మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


క్లూస్‌టీం విస్తృత తనిఖీలు

గొర్రెకుంట సాయిదత్తా ట్రేడర్స్‌లో పాడుపడిన బావిలో పడి అనుమానాస్పద స్థితిలో 9 మంది మృతిచెందిన సంఘటన స్థలానికి ఆదివారం హైదారాబాద్‌ నుంచి ప్రత్యేక క్లూస్‌టీం, ఇంటలిజెన్స్‌ బృందం చేరుకొని పరిశీలించింది. పరిసర ప్రాంతాలను, స్థలానికి వచ్చే వివిధ దారులపై ఆరా తీశారు. స్థానిక పోలీసుల నుంచి సంఘటన వివరాలను సేకరించారు. మృతులు నివాసం ఉన్న గదులను నిశితంగా పరిశీలించారు. గదుల్లో ఉన్న దుస్తులను, నిత్యావసర వస్తువులను గోడలకు ఏవైనా రక్తపు మరకలు ఉన్నాయా అని పరిశీలించారు. ఇంటలిజెన్స్‌, స్పెషల్‌బ్రాంచి పోలీసులు సంఘటన స్థలం చుట్టుపక్కల సంఘటనకు సంబంధించి ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే ఆరా తీస్తున్నారు. ఇద్దరు ట్రైనీ ఐసీఎ్‌సలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసరాలు, మృతిచెందిన వారి గదుల్లోకి ఎవరినీ వెళ్లకుండా డీసీపీ వెంకటలక్ష్మి చర్యలు తీసుకున్నారు.


ఇంకా ఎంజీఎంలోనే మృతదేహాలు

వరంగల్‌ గొర్రెకుంట శివారులో గల పాడుబడిన బావిలో అనుమానాస్పద స్థితిలో లభించిన తొమ్మది మంది వలస కూలీల మృతదేహాలకు ఇంతవరకు అంత్యక్రియలు జరగలేదు. నాలుగు రోజులుగా వాటిని ఎంజీఎం మార్చురీలోనే ఉంచగా దుర్గంధం వ్యాపిస్తోంది. అయితే కేసు వివరాలు పూర్తి స్థాయిలో తెలిసేంత వరకు అంత్యక్రియలు జరుపద్దొనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని అలాగే ఉంచుతున్నారు. కాగా క్లూస్‌ టీం సిబ్బంది ఆదివారం మృతదేహాలను పరిశీలించి వేలిముద్రలను సేకరించారు.

Advertisement
Advertisement
Advertisement