Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రమ దోపిడీలో ‘వాటా’ కోరుతున్నారా?

‘కార్ల్ మార్క్స్ క్షమించు గాక!’ అనే పేరుతో, శ్రీనివాస్ ద్వయం (సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్) రాసినది చూశాక, విజయనగరం జిల్లాలో, ఓబీసీలలో అత్యంత ‘వెనకబడిన’ (మోస్ట్ బ్యాక్‌వర్డ్) కుటుంబం లో పుట్టిన వ్యక్తిగానే కాకుండా, గత 40 ఏళ్ళగా (ఇప్పుడు నా వయస్సు 75 సంవత్సరాలు) రంగనాయకమ్మ రచనల పాఠకుడిగా నా అభిప్రాయం రాయాలనిపించింది.


రంగనాయకమ్మని ‘ఉలిపికట్టె’గానూ, అణచివేతకు గురైన కులాలకు ‘అడ్డుపడే’ వ్యక్తిగానూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మధ్య కొట్లాటలు రావాలని ‘కల’గనే వ్యక్తిగానూ, ప్రభుత్వం తలపెట్టిన రాజ్యాంగ సవరణ ఆమె ఆశయాలకు దగ్గరగా ఉండొచ్చుననీ మొదటి వాక్యం నుండి చివరి వాక్యం దాకా రంగనాయకమ్మ పట్ల ద్వేషాన్ని వెళ్ళగక్కారు. 


రంగనాయకమ్మకి ‘ప్రజాస్వామ్యం’ మీద నమ్మకం లేదని ఒక ఆరోపణ. ఆర్ధిక వనరులు అన్ని కులాలలోనూ ఉన్న జనాభాకి సమంగా లేని చోట ప్రజాస్వామ్యం గురించి శ్రీనివాస్ ద్వయం మాట్లాడటం హాస్యాస్పదం. రాజకీయ రంగంలో ఓబీసీలకి సమానమైన ‘వాటా’ లేని చోట వీరికి ప్రజాస్వామ్యం కనిపించడం మరీ పెద్ద జోకు. కొద్దిమందికే పరిమితమైన ప్రజాస్వామ్యం (‘డెమోక్రసీ ఫర్ ది ఫ్యూ’) మీద నమ్మకం లేనందుకు రంగనాయకమ్మని అభినందించాలి గానీ, అభిశంసించడం కాదు. 


ఈ రాజ్యాంగం, ‘సమానత్వం’ కల్పిస్తే, 70 ఏళ్ళ తర్వాత, ఆ రాజ్యాంగ యంత్రం లోకి ప్రవేశించడానికి, ఈ ‘వాటా’ పోరాటాలు చెయ్యాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 


‘కులం ఉపరితల అంశమని, దానిని పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు’ అని ఒక ఆరోపణ! ఆ అన్నది ఎవరో, ‘కర్త’ లేదు ఆ వాక్యంలో. విమర్శ అంతా రంగనాయకమ్మమీదే సాగింది కాబట్టి, ఆ మాటలు అన్నది ఆమే అనే అర్ధం వస్తుంది. ‘కులాల గురించి మార్క్సు అవగాహన’ అనే వ్యాసంలో ఆమె చాలా స్పష్టంగా, అది పునాదికి సంబంధించిన విషయంగా ఇలా పేర్కొన్నారు. ‘కులాల నిర్మాణం శ్రమలతో సంబంధం లేకుండా, శ్రమ సంబంధాలకు అతీతంగా ఏర్పడిన నిర్మాణం కాదు. ఇది, శ్రమ సంబంధాల దోపిడీ స్వభావం తోటీ, దాని శ్రమ విభజన తోటీ, దాని ఆస్తి హక్కుల తోటీ పెనవేసుకుని ఉన్న సమస్య’ అని! రంగనాయకమ్మ మీద చేసే విమర్శలో, పాపం మార్క్సుని తీసుకొచ్చి అతన్ని కూడా మందలించారు, శ్రీనివాస్ ద్వయం. రైల్వేల వల్ల భారతదేశంలో ‘ప్రత్యేక అసమానతలు’ పోతాయి అని అన్నాడట! అదే వ్యాసంలో, మార్క్సు ఇంకా ఏమన్నాడో, రంగనాయకమ్మ వ్యాసం చదివితే తెలిసేది. ‘ఇది కేవలం ఉత్పాదక శక్తుల అభివృద్ధి పైనే గాక, ప్రధానంగా వాటిని ప్రజలు స్వాధీనం చేసుకోవడం పైనే ఆధారపడి వుంటుంది’ అని చాలా స్పష్టంగా చెప్పాడు. 


‘రంగనాయకమ్మ చెబుతున్న మార్క్సిజం ఎలాంటి మార్క్సిజమో అర్ధం కావటం లేదు’ అని వాపోతున్నారు. అది తెలుసుకోవడం ఒక సమస్యా? మార్క్సు రచనలు, ముఖ్యంగా ‘కాపిటల్’ పుస్తకం తెలుగు అనువాదమూ వుంది; దానికి రంగనాయకమ్మ రాసిన ‘పరిచయం’ కూడా వుంది. దేనినైనా తెలుసుకుని విమర్శించాలనే బాధ్యతాయుతమైన వైఖరి ఉంటే, అదేమంత కష్టం కాదు. 


‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసే పనిచేస్తున్నాం. మా మధ్య కొట్లాటలు రావు’ అని ఒక అబద్ధపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలలో ఉపకులాల మధ్య కొట్లాటలూ; ఎస్టీలలో ఫలానా తెగ వారే అన్నీ ఎగరేసుకుపోతున్నారనే ఆందోళనలూ; ఓబీసీలలో, పైస్థాయి వారికీ, ఎంబీసీలకూ మధ్య విభేదాలూ; మైనారిటీలలో భిన్న విశ్వాసుల మధ్య కొట్లాటలూ మొదలైన వాస్తవాలకు వీపు తిప్పితే అది ఆత్మ వంచన అవుతుంది. ఆత్మవిమర్శ మానేసి, రంగనాయకమ్మకి దురుద్దేశాలు అంటగట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. ‘పాలసీల నిర్ధారణకూ’, ‘వాటా డిమాండు చేయడానికీ’ కులగనణన అనివార్యం అంటున్నారు. ఏ పాలసీలు తీసుకొస్తారూ? పాకీ పనీ, జంతుకళేబరాల్ని తొలగించే పనీ, వంటి మురికి శ్రమలు అన్ని కులాల వారూ చేసి తీరాలి – అనే పాలసీలు తెస్తారా? అన్ని రంగాల్లో వాటా కావాలా? దేనిలో వాటా? అగ్ర కుల బూర్జువాల వలే, బహుజన బూర్జువాలు కూడా శ్రమ దోపిడీ సాగించడంలోనూ, దానికి అడ్డంకులు లేకుండా చేసే ప్రభుత్వ పాలనలోనూ వాటానా కోరవలిసింది?

బి.ఎ. నారాయణరావు

Advertisement
Advertisement