Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమలలో గదుల కోసం గంటల తరబడి నిరీక్షణ

పారిశుధ్య పనుల్లో జాప్యంతోనే సమస్య


తిరుమల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న భక్తులు బుధవారం గదుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ తక్కువగానే ఉన్నప్పటికీ గదులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో దాదాపు 1500 గదులు మరమ్మతు పనుల్లో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగులకు, కార్యాలయాలకు శాశ్వత కేటాయింపులు కింద దాదాపు వెయ్యి గదులు పోగా, మిగిలింది 4,500 గదులు మాత్రమే.గదుల్లో పారిశుధ్య పనులు చేసే కార్మికులు తమను టీటీడీ కార్పోరేషన్‌లో కలపాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతిలో కొంతకాలంగా ఆందోళన చేపట్టారు. దీంతో మిగిలిన సిబ్బందితోనే గదులను శుభ్రం చేయిస్తున్నారు. ఈ క్రమంలో పారిశుధ్య పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గదుల కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధానంగా గదులు కేటాయించే సీఆర్వో ఆఫీస్‌, టీబీ కౌంటర్‌, ముందస్తు రిజర్వేషన్‌ కౌంటర్‌, ఎంబీసీ కౌంటర్‌ వద్ద భక్తులు గంటలకొద్దీ పడిగాపులు కాచారు. ఉదయం 7 గంటలకు వచ్చిన భక్తులకు మఽధ్యాహ్న సమయంలో గదులు లభించాయి. దీంతో చాలామంది భక్తులు  రోడ్ల పక్కన, షెడ్ల కింద, కార్యాలయాల ముందు బారులు తీరారు. గదుల కోసం రిజిస్ర్టేషన్‌ చేసుకున్న 4 గంటల సమయానికి కూడా తమకు గదులు లభించలేదని, పిల్లలు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఉదయం నుంచి ఏం తినలేదని, స్నానం చేయకుండా దర్శనానికి ఎలా వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో వున్న సిబ్బంది కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా తిరుమలలో ఎన్నడూ లేనివిధంగా పారిశుధ్య లోపం కనిపించింది. సాధారణంగా తిరుమలలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. అయితే తిరుమల క్షేత్రంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, కాటేజీలు చెట్లకొమ్మల ఆకులు, చెత్తాచెదారంతో కన్పించాయి. 

కాటేజీల ముందు పడివున్న చెట్లకొమ్మల ఆకులు


Advertisement
Advertisement