Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 9 2021 @ 02:13AM

వీవీఐపీల హెలికాప్టర్‌

రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల తరలింపునకు వాడే చాపర్లివే

వాయుసేన అమ్ములపొదిలోనే

శక్తిమంతమైనవిగా ప్రఖ్యాతి

సర్జికల్‌ స్ట్రైక్స్‌లో వాడింది వీటినే


‘‘జనరల్‌ రావత్‌ వెళ్లింది అత్యంత సురక్షితమైన వాయుసేన హెలికాప్టర్‌లో. ఎంఐ-17వీ5 హెలికాప్టర్లు నమ్మకమైనవి, స్థిరమైనవి, పెద్దవి. వాయుసేన ఎక్కువగా వినియోగించేది వీటినే. ప్రతికూల వాతావరణాల్లోనూ వినియోగించేందుకు వీలుగా ఉంటాయి కాబట్టి రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు వీఐపీల ప్రయాణానికి కూడా ఉపయోగిస్తారు’’


..మహాదళపతి బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్లపై పలువురు మాజీ సైనికాధికారుల మాట ఇది. వారు అంతగా మెచ్చుకొంటున్న ఆ హెలికాప్టర్ల ప్రత్యేకతలేంటి? నిజంగా అవి అంత సురక్షితమైనవా? గతంలో ఎప్పుడూ ఈ మోడల్‌ హెలికాప్టర్లకు ఎలాంటి ప్రమాదాలూ జరగలేదా? తదితర అంశాలపై ప్రత్యేక కథనం..


చెన్నై, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రష్యాకు చెందిన ‘కజన్‌ హెలికాప్టర్స్‌’ సంస్థ ఎంఐ-17వీ5 హెలికాప్టర్లను తయారుచేస్తోంది. రవాణా నిమిత్తం తయారైన ఎంఐ-17 హెలికాప్టర్లకు అధునాతన వెర్షన్‌ ఈ హెలికాప్టర్లు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 110 దేశాలకు 12 వేలకు పైగా ఎంఐ-17 హెలికాప్టర్లను విక్రయించారు. రష్యన్‌ తయారీ అయిన ఈ హెలికాప్టర్లను అమెరికా కొనడంపై నిషేధం ఉన్నా కూడా.. దాన్ని పక్కన పెట్టి మరీ అఫ్ఘానిస్థాన్‌లో వాడకానికి యూఎస్‌ సైన్యం వీటిని కొనుగోలు చేసింది. అఫ్ఘాన్‌ నైసర్గిక, వాతావరణ పరిస్థితులకు ఇంతకు మించిన హెలికాప్టర్లు లేవని సాక్షాత్తూ పెంటగాన్‌ వర్గాలే పేర్కొన్నాయి. అత్యంత ఆధునిక సైనిక రవాణా చాపర్లుగా పేరొందిన ఈ హెలికాప్టర్లను మన సైన్యం బాగా ఎత్తైన ప్రాంతాల్లో ఆపరేషన్లకు ఉపయోగిస్తుంటుంది.


ఎడారులు, సముద్రజలాలు, అడవులు.. ఇలా ఎలాంటి నైసర్గిక ప్రాంతాల్లోనైనా, ఎలాంటి వాతావరణంలోనైనా ఈ హెలికాప్టర్లు సమర్థంగా పనిచేస్తాయని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత రక్షణ దళాలు వాడుతున్న హెలికాప్టర్లలో వీటిని అత్యంత శక్తిమంతమైనవిగా పేర్కొంటుంటారు. అందుకే ముంబైలో 26/11 దాడుల సమయంలో కమాండో ఆపరేషన్స్‌కు, 2019లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు వీటినే వినియోగించారు. 2008 డిసెంబరులో తొలిసారిగా భారత రక్షణ శాఖ 1.3 బిలియన్‌ డాలర్లతో 80 హెలికాప్టర్లకు ఆర్డర్‌ ఇచ్చింది. 2011లో వీటి సరఫరా మొదలైంది. 2013 తొలినాళ్ల సమయానికి 36 ఎంఐ-17వీ5 హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి. 2012, 2013 సంవత్సరాల్లో మొత్తం 71 హెలికాప్టర్లకు రక్షణశాఖ ఆర్డరిచ్చింది. దానికి సంబంధించి తుది విడత హెలికాప్టర్లు 2018 జూలై నాటికి అందుబాటులోకి వచ్చాయి. 

ఈ చాపర్‌ను.. సైన్యాన్ని తరలించడానికి, రవాణాకు, ఎక్స్‌టర్నల్‌ స్లింగ్‌ ఆపరేషన్లకు (అంటే హెలికాప్టర్‌కు తాడు కట్టి దాని ద్వారా భారీ లోడ్‌లను తరలించడం), నేలమీది లక్ష్యాలను ఛేదించడానికి వాడతారు.

ఈ హెలికాప్టర్లు గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో, ఫుల్‌ ట్యాంక్‌ ఇంధనంతో 580 కిలోమీటర్ల దాకా నిరంతరాయంగా ప్రయాణించగలవు.  

వీటి గరిష్ఠ టేకాఫ్‌ వెయిట్‌ 13 వేల కిలోలు. 36 మందిని ఒకేసారి తరలించవచ్చు.

స్లింగ్‌ విధానంలో 4500 కిలోల బరువును మోసుకుంటూ ప్రయాణించగలదు.

ఈ హెలికాప్టర్ల ద్వారా.. ష్తుర్మ్‌-వి క్షిపణులు, ఏకేఎం సబ్‌ మెషీన్‌ గన్స్‌, పీకేటీ మెషీన్‌గన్స్‌, ఎస్‌-8 రాకెట్స్‌, ఒక 23ఎంఎం మెషీన్‌ గన్‌ వంటివాటిని వినియోగించవచ్చు. మొత్తం ఎనిమిది ఫైరింగ్‌ పోస్టులుంటాయి.

2019లో వాయుసేనకు చెందిన ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ను పొరపాటున మన 

గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ స్పైడర్‌ కూల్చేసింది.

తాజాగా ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను సూలూరు ఎయిర్‌బేస్‌లో వాడుతున్నారు.

సురక్షితమైనవని నిపుణులు చెబుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇవి కూలిన ఘటనల్లో పలువురు మరణించారు.


ప్రత్యేక రక్షణ కవచాలు అమర్చి ఉండే ఈ హెలికాప్టర్ల ఇంధన ట్యాంక్‌ పేలకుండా దానికి పాలీయురేథిన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ను పూస్తారు. దీనివల్ల.. భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడడానికి ఈ హెలికాప్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ హెలికాప్టర్లలో ‘ఇంజన్‌ ఎగ్జాస్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సప్రెసర్స్‌’, ‘ఫ్లేర్స్‌ డిస్పెన్సర్‌’, ‘జామర్‌’, రాత్రిపూట చూడగలిగే నైట్‌విజన్‌ వ్యవస్థ ఉంటాయి.

Advertisement
Advertisement