Oct 18 2021 @ 11:32AM

#Vishal 32 : ‘లత్తి’ టైటిల్ తో పాన్ ఇండియా థ్రిల్లర్

కోలీవుడ్ యాక్షన్ డైనమైట్ విశాల్.. ఎర్లియర్ గా ‘చక్ర’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ సినిమా ఆశించిన రీతిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం విశాల్ ‘ఎనిమి, వీరమే వాగై సూడు, తుప్పరివాలన్ 2’ లాంటి యాక్షన్ మూవీస్ లో నటిస్తున్నారు. ఇక తాజాగా విశాల్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయింది. ఈ సినిమాకి ‘లత్తి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు, కన్నడ, హిందీలో లాఠీగానూ, మలయాళంలో ‘లాత్తి’ గానూ విడుదల కాబోతోంది. ఏ. వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీతం సామ్ సి.యస్. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను ఖాయం చేస్తూ .. ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 



ఒక డాబా మీద ఎండబెట్టిన మిరపకాయల్ని చూపిస్తూ.. అక్కడే ఆరేసిన ఓ చెక్స్ షర్ట్ ఖాకీ షర్ట్ గా మారి.. యస్. మురుగానందం అనే పేరు రివీలవడం ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ను బట్టి.. ఇందులో విశాల్ మురుగానందం అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు అర్ధమవుతోంది. ‘అయోగ్య’ తర్వాత విశాల్ నటిస్తున్న పోలీస్ మూవీ ఇదే కావడంతో సినిమామీద భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ‘లత్తి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.  సునైన కథానాయికగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీ విశాల్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.