Abn logo
Jul 12 2020 @ 05:05AM

ఆగని వైరస్‌

ఉమ్మడి పాలమూరులో 28 కేసులు నమోదు

కోస్గి మండలంలో తొమ్మిది నెలల బాబుకు వైరస్‌


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/ గద్వాల క్రైం/ గట్టు/ కోస్గి రూరల్‌/ ఆత్మకూరు/ కందనూలు/ పెంట్లవెల్లి/ జూలై 11 : ఉమ్మడి పాలమూరులో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శనివారం కొత్తగా 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని ధనలక్ష్మి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. సంతోష్‌నగర్‌ కాలనీ, రాజేంద్రనగర్‌ కాలనీలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు వైరస్‌ సోకింది. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో ఒకరికి, దేవరకద్రలోని శివాజీనగర్‌కు చెందిన ఒకరికి, ఇస్రంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో కేంద్రంలోని భవానీనగర్‌, గంజిపేట, కుంటవీధి, గాయత్రి ఎస్టేట్‌లలో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. రాజోలిలో రెండు, ఇటిక్యాలలో ఒకటి, గట్టు మండలం మాచర్లలో మరొకటి కేసులు నమోదు అయినట్లు తెలిపారు.


నారాయణపేట పట్టణంలో ముగ్గురికి, మండలంలోని అప్పక్‌పల్లిలో ఓ ప్రజాప్రతినిధికి, అతడి డ్రైవర్‌కు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కోస్గి మండలం మీర్జాపూర్‌కు చెందిన తొమ్మిది నెలల బాలుడికి కరోనా సోకినట్లు హెల్త్‌ సూపర్‌వైజర్‌ రాంచందర్‌ తెలిపారు. 


వనపర్తి జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆత్మకూర్‌ మండలంలోని పిన్నంచర్ల గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అక్షయ్‌కుమార్‌, సాయితేజ తెలిపారు. 


నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్‌ కాలనీలో ఒకరికి, బిజినేపల్లిలో ఒకరికి, అమ్రాబాద్‌ మండలం ఈగలపెంటలో ఒకరికి, లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో ఒకరికి, తిమ్మాజిపేటకు చెందిన మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుధాకర్‌లాల్‌ తెలిపారు. పెంట్లవెల్లి మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన ఒక ప్రజాప్రతినిధికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కొల్లాపూర్‌ పట్టణంలో కరోనా వైరస్‌ సోకిన దంపతుల కుటుంబసభ్యులను వైద్యులు అంబులెన్స్‌లో జిల్లా కేంద్రానికి తరలించి శాంపిల్స్‌ తీసుకున్నారు. స్వీయనిర్బంధంలో ఉండాలని సూచించారు. 

Advertisement
Advertisement