"కోలు కోలమ్మా కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే.."
"పిల్లగాడి మాటలన్ని గాజులల్లె మార్చుకుంట.. కాలిధూళి బొట్టు పెట్టుకుంటా...
కుర్రగాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట.. అల్లరంత నల్లపూసలంటా.."
వంటి అందమైన పదాలతో పాట కూర్చగా.. సురేష్ బొబ్బిలి సుమధుర బాణీలు, దివ్యమాలిక మధుర గాత్రం.. వెరసీ ఓ మంచి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. డ్యాన్సింగ్ బేబీ సాయిపల్లవి ఆ పాటకి నర్తించడం, నటించడం మొదలెడితే.. ప్రాణం, జీవం అనే పదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడదే జరుగుతుంది. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్" అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న 'విరాటపర్వం'ను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
గురువారం ఈ చిత్రంలోని కోలు కోలమ్మా అనే సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 'స్త్రీ' ప్రేమ, అనంతమైన కథనాలను నిశ్శబ్దంగానే ప్రపంచానికి అందిస్తుందనే విషయాన్ని ఈ "కోలు కోలు" పాట మనకు తెలియజేస్తుంది. తను మనసిచ్చిన వాడి గురించి కథానాయిక వెన్నెల ఓ కథనంలా పాడుకుంటోంది. వెన్నెలగా సాయిపల్లవి నటించింది. ఇప్పటికే ఎన్నో గొప్ప పాటలను, మంచి పాటలను అందించిన చంద్రబోస్ కలం మరోసారి అనంతమైన ప్రేమను కురిపిస్తూ ఈ పాటను అల్లింది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ తదితరులు కనిపించనున్నారు.