Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉల్లంఘనులుజిల్లాలో మద్యం దుకాణాల  ఏర్పాటుపై ఫిర్యాదులు
నిబంధనలు పాటించని లిక్కర్‌ వ్యాపారులు
మితిమీరి పోతున్న మందుబాబుల ఆగడాలు
ఆదాయంపైనే దృష్టి సారిస్తున్న ఎక్సైజ్‌ శాఖాధికారులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఆదిలాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మద్యం దుకాణాల ఏర్పాటులో కొందరు వ్యాపారులు నిబంధనలు ఉ ల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 40 మద్యం దుకాణాలను కేటాయించారు. కానీ వాటి ఏర్పాటు, నిర్వాహణ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు ఎక్సైజ్‌ శాఖ అధికారులతో కుమ్మక్కై నిబంధనలు గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే సదరు వైన్‌షాపు లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లు మద్యం దుకాణాల దరఖాస్తుల పైననే దృష్టి సారించిన అధికారులు నియమ నిబంధనల పై వ్యాపారులకు కనీస అవగాహన కూడా కల్పించక పోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ వ్యాపారంలో ఆరితేరిన కొందరు భడా వ్యాపారులు మద్యం షాపులపై చక్రం తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కొందరు లిక్కర్‌ వ్యాపారులు గుడ్‌విల్‌ ఇచ్చి మరీ జిల్లాలో సిండికేటు దందాపై పెత్తనం చలాయిస్తున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి రూ.50లక్షల నుంచి రూ.80లక్షలు గుడ్‌విల్‌ ఇ చ్చేందుకు ముందుకు వస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే మద్యం షాపులకు ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని పంజాబ్‌చౌక్‌లో ఓ మద్యం దుకాణం రూ.53లక్షల గుడ్‌విల్‌ ఇచ్చి ఓ లిక్కర్‌ వ్యాపారి దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలా అడుగడుగున నిబంధనలు ఉల్లంఘిస్తూ లిక్కర్‌ వ్యాపారంలో మళ్లీ చలామణి అయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
పర్యవేక్షణ కరువు..
జిల్లాలో కొన్ని మద్యం షాపుల ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారులకు పలుమార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇచ్చోడ మండలం ఆడేగామ(కె) గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు వైన్‌షాపులపై గ్రామస్థులు, కాలనీ వాసులు కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలతో పాటు చర్చి, డిగ్రీ కళాశాల ఉండడంతో ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. బోథ్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైన్‌షాపుపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పాఠశాల ముందే మద్యం విక్రయించడాన్ని తప్పుబడుతున్నారు. ఉట్నూర్‌ మండలం లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలపై కొందరు గ్రామస్థులు ఐటీడీఏ పీవోతో పాటు ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. సిరికొండ జనావాసాల మధ్యనే ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై స్థానికులు మండిపడుతున్నారు. బేల మండలంలో మద్యం దుకాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్‌ శాఖ అధికారులు సరైన పర్యవేక్షణ చేయక పోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.
వ్యాపారుల ఇష్టారాజ్యం..
కొందరు లిక్కర్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నిబంధనల ప్రకారం గుడి, బడి, చర్చికి వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. అలాగే జాతీయ రహదారికి 220 మీటర్ల దూరంలో ఉండాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసింది. అయినా మున్సిపల్‌ పరిధిలో కొంత మినహాయింపు ఉందన్న కారణంగా జాతీయ రహదారి పైననే మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దేవాలయాలు ఎండోమెంట్‌ పరిధిలో ఉంటేనే నిబంధనలు వర్తిస్తాయని ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కమర్షియల్‌ కాకుండా నివాస ప్రాంతాల మధ్యలో ఏర్పాటు చేయరాదనే నిబంధన ఉంది. ఇలాంటి నిబంధనలు పట్టించుకోకుండా వ్యాపారులు షాపులను ఏర్పాటు చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫిర్యాదు చేసిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్న ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోతోంది. కొందరు ఎక్సైజ్‌ శాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇకనైనా ప్రత్యేక కమిటీని వేసి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలను పరిశీలిస్తేనే అసలు విషయాలు బయట పడే అవకాశం ఉందంటున్నారు.
శృతి మించుతున్న మందుబాబుల ఆగడాలు
జనవాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడంతో మందుబాబుల ఆగడాలను భరించలేక పోతున్నామని స్థానిక మహిళలు పేర్కొంటున్నారు. రాత్రి పడితే మందుబాబుల ఆగడాలు మితి మీరి పోతున్నాయని చెబుతున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లే పరిస్థితులే లేవంటున్నారు. రోడ్డు పైననే మద్యం షాపులను ఏర్పాటు చేయడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, బహిరంగంగానే మూత్ర, మలవిసర్జన చేయడంతో ఆ దారి గుండా వెళ్లేందుకే మహిళలు జంకుతున్నారు. దీంతో పరిసరాలన్ని కంపుకొట్టడంతో ముక్కు మూసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పారిశుధ్యం వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా అసలు పట్టించుకోవడమే లేదు. కొన్ని మద్యం దుకాణాల ముందు మందుబాబులు తప్పతాగి పడిపోవడంతో అటు వైపు రోడ్డుపై వెళ్లేవారికి ఇబ్బందికరంగా మారుతోంది. ఊరికి దూరంగా ఉంటే ఎంత రచ్చ చేసినా పట్టించుకునే వారే ఉండరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం..
- రవీందర్‌రాజు, జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారి

జిల్లా వ్యాప్తం గా మద్యం దుకాణాల ఏర్పాటుపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. నిబంధనల ప్రకారమే వైన్‌షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చాం. బడి, గుడి, ఆసుపత్రికి వంద మీటర్ల దూరంలో ఉండాలనే నిబంధనను అమలు చేస్తున్నాం.  ఇప్పటి వరకు ఏ ఒక్క ఫిర్యాదు వాస్తవమని తేలలేదు. స్థానిక పరిస్థితుల దృష్ట్యానే ఫిర్యాదులు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగిస్తాం.

Advertisement
Advertisement