Abn logo
Mar 25 2020 @ 03:26AM

మీ ఊరికి మేము రాము.. మా ఊరికి రావొద్దు

దారులు బంద్‌ చేసిన గ్రామస్థులు

బారికేడ్లు, ముళ్లకంపలు, రాళ్లు పెట్టి దిగ్బంధం

ఊరు మీదుగా వెళ్లిన కొత్త వ్యక్తులకు జరిమానా

కొత్తవారిని ఇంట్లోకి రానిచ్చినా ఫైన్‌

జనం బయటకు రాకుండా పోలీసుల నిఘా

ఉల్లంఘించిన వారికి గుంజీలు, లాఠీచార్జి 

పట్టణాల్లో మోహరించిన పోలీసులు

రెండోరోజు లాక్‌డౌన్‌ విజయవంతం


 (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో  రెండోరోజు లాక్‌డౌన్‌  విజయవంతమైంది. తొలిరోజు సోమవారంతో పోల్చితే మంగళవారం రోడ్లమీద జనం అంతగా కనిపించలేదు. ఎక్కడికక్కడ పోలీసులు రోడ్ల మీద మోహరించి బైక్‌లు, కార్లు తదితర వాహనాలను అడ్డుకున్నారు. మాట వినని వారిపై లాఠీలు ఝళిపించారు. మునిసిపాలిటీల పరిధిలో నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు మినహా ఇతరులను ఇళ్లకు పంపించివేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పనిపాట లేకుండా బయటకు వచ్చిన యువకులను పట్టుకొని గుంజీలు తీయించారు. లాక్‌డౌన్‌ స్ఫూర్తి పల్లెల్లో మరింతగా కనిపిస్తోంది.  ‘మీ ఊరికి మేం రాము.. మా ఊరికి మీరు రావొద్దు’ అంటూ మార్గాలను దిగ్బంధిస్తున్నారు.


గ్రామప్రవేశ మార్గాలకు అడ్డంగా బారికేడ్లు, ముళ్లకంపలను పెడుతున్నారు. ఇళ్ల నుంచి ఎవరైనా బయటకు వచ్చినా.. గ్రామం మీదుగా వాహనదారులు వెళ్లినా జరిమానాలు విధిస్తున్నారు. ఈ బాధ్యతను సర్పంచ్‌లు పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సింగాపూర్‌ మండలం ఉజలపాడ్‌లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.50వేల జరిమానా విధించాలని తీర్మానించారు.  వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం నజీరాబాద్‌ గ్రామంలో ఎవరి ఇంట్లోకి కొత్తవారిని అనుమతించొద్దని, లేదంటే ఆ ఇంటి యజమానికి రూ.1000 జరిమానా విధించాలని పంచాయతీ తీర్మానించింది.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌, ఓదెల, ముత్తారం తదితర మండలాలల్లోని ఆయా గ్రామాల ప్రవేశ మార్గాల వద్ద ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. 


మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్‌ గ్రామస్తులు స్వీయ నిర్బంధం ఏర్పాటుచేసుకున్నారు.  జోగులాంబ జిల్లాలోని బుద్దారెడ్డిపల్లి, సింధనూరు, పాగుంట గ్రామాలను అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా మూసివేశారు.  సిద్దిపేట జిల్లాలో 499 గ్రామాల్లో 100 గ్రామాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘిచి హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పాలవ్యాన్‌లో ప్రయాణికులను తరలిస్తుండగా సూర్యాపేట జనగామ క్రాస్‌రోడ్‌ వద్ద  పోలీసులు పట్టుకున్నారు. కాగా సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రిలో విధులకు కోసం ఓ నర్సు తన భర్తతో కలిసి బైక్‌పై వెళుతుండగా పోలీసులు కొట్టడం వివాదాస్పదమైంది.  కరోనా నుంచి విముక్తి కోసం శంషాబాద్‌ మండల పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీ రామనగరం దివ్యసాకేతంలో త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో అంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించారు. 


వేపచెట్టుకు పూజచేస్తే కరోనా రాదు 

కొడుకులున్న మహిళలు వేపచెట్టును పూజించాలని, ఎంతమంది కొడుకులుంటే అన్ని చెంబుల నీళ్లను ఓ ఐదు ఇళ్ల నుంచి అడిగి తెచ్చుకొని వేపచెట్టుకు పోయాలని అలా చేస్తే కరోనా రానేరాదని అంటూ వాట్సా్‌పలో ఓ మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. దీంతో చాలామంది మహిళలు.. వేపచెట్ల వద్ద పూలు, పసుపు-కుంకుమ, కొబ్బరికాయలు పట్టుకొని క్యూలు కడుతున్నారు, మెదక్‌, నల్లగొండ, వికారాబాద్‌ తదితర జిల్లాలో గ్రామాల్లో మహిళలు.. వేపచెట్ల వద్ద పూజలు చేస్తున్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మొద్దంటూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు.


కరోనా భయంతో పొలాల్లో ఆవాసం

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుతండా, ఎమాయికుంట గ్రామాల్లోని 120 కుటుంబాల్లో 35 కుటుంబాలు పొలాల్లో టెంట్లు వేసుకొని ఉంటున్నారు. ఇదంతా కరోనా భయంతో! ఆ గ్రామానికి చెందిన ప్రేమ్‌సింగ్‌, అందుతండాకు చెందిన జగదీశ్‌ బతుకుదెరువు కోసం ఉగాండాకు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారు. వారికి కరోనా లక్షఽణాలున్నాయేమోనన్న అనుమానంతో విషయాన్ని గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం అక్కడికి వైద్యులు వెళ్లి.. వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అయినా వారు ఇళ్లలో ఉండకుండా బయట తిరుగుతుండటంతో కొన్ని కుటుంబాలు తమ పొలాల్లోకి వెళ్లి టెంట్లు వేసుకున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement