డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న తండ్రీకొడుకుల ‘మహాన్‌’

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో విలక్షణ నటుడు ‘చియాన్‌’ విక్రమ్‌, ఆయన తనయుడు ధృవ్‌ విక్రమ్‌ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మహాన్‌’. ఈ సినిమా షూటింగ్‌ పూర్తిచేసుకోగా, ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తండ్రీ, తనయులు కలిసి డబ్బింగ్‌ పూర్తిచేశారు. నిజానికి ఈ ఇద్దరూ ఇదివరకు తమతమ పాత్రలకు సంబంధించి  వేరువేరుగా డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించిన సన్నివేశాలకు డబ్బింగ్‌ పూర్తిచేశారు. కాగా, గత మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న హీరో విక్రమ్‌... తన స్వయంకృషితో ఉన్నతస్థానానికి ఎదిగారు. ఇపుడు తన కుమారుడు ధృవ్‌ను మరింత ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు తన వంతు సహకారం అందిస్తున్నారు. 

ఇందులో భాగంగా ఆయన తన కుమారుడుతో కలిసి తొలిసారిగా నటించారు. ఇందులో వీరిద్దరితో పాటు సిమ్రాన్‌, బాబీ సింహా, వాణీభోజన్‌ తదితరులు నటించారు. ఇది విక్రమ్‌ 60వ చిత్రం కావడం గమనార్హం. సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియో పతాకంపై ప్రముఖ నిర్మాత లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇదిలావుంటే, దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీలో తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన విక్రమ్‌... అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’, గౌతం మీనన్‌ దర్శకత్వంలో స్పై అధికారిగా నటించిన ‘ధృవనక్షత్రం’ చిత్రాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్నాయి.

Advertisement