Abn logo
Oct 20 2021 @ 23:47PM

అంగరంగ వైభవంగా వేంకటేశుడి కళ్యాణం

స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

భీమునిపట్నం, అక్టోబరు 20: స్థానిక కీటిన్‌పేట ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గోరోజు శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం బుధవారం వైభవోపేతంగా  జరిగింది. ప్రధానార్చకులు పురాణం శేషాచార్యులు, సహాయార్చకులు మనోజ్‌కుమారాచార్యులు, పవన్‌విష్ణు ఆచార్యుల శిష్యబృందం స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.  ఉదయం 7 గంటల నుంచి స్వామి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కం మేనేజింగ్‌ ట్రస్టీ కలిగొట్ల సూర్యనారాయణమూర్తి పర్యవేక్షణలో యాగశాలాశ్చనలు, విశేషహోమాలు జరిపారు. అనంతరం, కళ్యాణమూర్తులకు భక్తుల గోవింద నామస్మరణ మధ్య అలంకార తిరుమంజనసేవ చేశారు. మధ్యాహ్నం వేద ఆశీర్వచనం అనంతరం, మంగళాశాసనం, తీర్థప్రసాదగోష్ఠి జరిగింది. సాయంత్రం శ్రీవారి తృతీయ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే విధంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి సంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో వీక్షించిన భక్తులు తన్మయత్వంతో ఓలలాడారు. ఈ మహోత్సవంలో ట్రస్ట్‌ డైరెక్టర్లు కలిగొట్ల శ్రీరామచంద్రమూర్తి, కలిగొట్ల వెంకట పద్మ భానోజీరావు, కలిగొట్ల శ్రీనివాసరావు, కోశాధికారి వుశిరికల బంగార్రాజు, భక్తులు పాల్గొన్నారు.