Abn logo
Oct 20 2020 @ 00:17AM

టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడిగా వాసు

Kaakateeya

 15 ఏళ్ల తర్వాత కడప జిల్లాకు ఛాన్స్‌

 జిల్లాలో పార్టీ బలోపేతానికి చంద్రబాబు వ్యూహం

 పార్టీలో కీలక బాధ్యతలు

 అధినేత నమ్మకాన్ని నిలబెడతా : శ్రీనివాసరెడ్డి


(కడప-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కడపలో రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జిల్లా యువ నాయకులకు పార్టీ కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో జిల్లాకు చెందిన రాజంపేట పార్లమెంట్‌ స్థానం అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి (వాసు)కు కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఛాన్స్‌ దక్కింది.


15 ఏళ్ల తరువాత జిల్లాకు పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూర్‌లో స్థానం దక్కడం రాజకీయంగా జిల్లాకు దక్కిన ప్రాధాన్యతగా పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో అధికార పార్టీని ఎదురొడ్డి కార్యకర్తలు, సీనియర్‌ నాయకులను సమన్వయం చేస్తూ ఓ పక్క పార్టీ బలోపేతం.. మరోపక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వాసుకు కత్తి మీద సాములాంటిదే.


విధేయతకు తగిన గుర్తింపు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్‌.శ్రీనివాసరెడ్డి (వాసు) విధేయుడుగా ఉంటూ వస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లా నాయకులను సమన్వయం చేసుకుంటూ దిగ్విజయం చేయడంలో ముందుంటున్నారు. అంతేకాదు.. యువకుడు, సౌమ్యుడు కావడం వల్లే చంద్రబాబు గుర్తించారని, కీలకమైన పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓపక్క రాజంపేట పార్లమెంట్‌ స్థానం అధ్యక్షుడిగా జిల్లాలో అధికార పార్టీ నేతలు అవంభించే ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే క్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యమవుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లో తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది.


2014 ఎన్నికల నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల అనంతరం అధినేత చంద్రబాబు మూడు రోజుల జిల్లా పర్యటనను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. వాసు తండ్రి ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.


అందులో 1983, 1985లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గాల పునర్వీభజనలో లక్కిరెడ్డిపల్లె రాయచోటి నియోజకవర్గంలో విలీనమైంది. అక్కడి నుంచి వాసు సోదరుడు ఆర్‌.రమే్‌షరెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వాసు కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 


అధినేత నమ్మకాన్ని నిలబెడతా 

- ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు

అధినేత చంద్రబాబు మా కుటుంబంపై ఉన్న నమ్మకంతో రాజంపేట పార్లమెంట్‌ స్థానం అధ్యక్షుడిగా ఎంపిక చేయడమే కాదు.. తాజాగా కీలకమైన పార్టీ పొలిట్‌ బ్యూరోలో అవకాశం ఇచ్చారు. పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకులు ఉండే పొలిట్‌ బ్యూరోలో నాకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో కీలకపాత్ర పోషిస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. జిల్లాలో నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ అధినేత నమ్మకాన్ని నిలబెడతాను. 


Advertisement
Advertisement